close
కష్టపడ్డారు.. భేష్‌

ప్రజాదరణ, పార్టీ శ్రేణుల కృషితోనే తొమ్మిది స్థానాలు
రాష్ట్రాభివృద్ధికి కృషి చేయాలి
కొత్త ఎంపీలతో సీఎం కేసీఆర్‌
ఈనాడు - హైదరాబాద్‌

మొత్తం 16 స్థానాలను ఆశించాం. ఇందులో తొమ్మిది దక్కాయి. విజయాలు సంతృప్తికరమే కానీ, ఏడు స్థానాల్లో ఓటమి ఎదురైంది. దీనికి గల కారణాలను విశ్లేషించాలి. ఎంపీలుగా మీరు కూడా అభిప్రాయాలను తెలపాలి.

-సీఎం కేసీఆర్‌

 

తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థులు సమష్టి కృషితో తొమ్మిది నియోజకవర్గాల్లో విజయం సాధించారని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నేతలు, కార్యకర్తలు కష్టపడి పనిచేశారని ప్రశంసించారు. గెలుపుతో వారి బాధ్యత మరింత పెరిగిందని, రాష్ట్రం, నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం వారు చిత్తశుద్ధితో కృషి చేయాలని సూచించారు. తెరాస బలోపేతంలో భాగస్వాములవ్వాలన్నారు. ఎన్నికల్లో విజయం సాధించిన ఎంపీలు శుక్రవారం ప్రగతిభవన్‌కు వచ్చి తెరాస అధినేత కేసీఆర్‌ను కలిశారు. వారిని విడివిడిగా సీఎం అభినందించారు. ‘‘మొత్తం 16 స్థానాలను ఆశించాం. ఇందులో తొమ్మిది దక్కాయి. విజయాలు సంతృప్తికరమే కానీ, ఏడు స్థానాల్లో ఓటమి ఎదురైంది. దీనికి గల కారణాలను విశ్లేషించాలి. ఎంపీలుగా మీరు కూడా అభిప్రాయాలను తెలపాలి. పార్టీ బలోపేతంలో భాగస్వాములుకావాలి’ అని సీఎం అన్నారు.

ఇద్దరు మంత్రులు భేష్‌
మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌ ఎంపీలు మన్నె శ్రీనివాస్‌రెడ్డి, పి.రాములు.. మంత్రులు వి.శ్రీనివాస్‌గౌడ్‌, నిరంజన్‌రెడ్డిలతో వచ్చి కేసీఆర్‌ను కలిశారు. వారిని సీఎం అభినందించారు. ప్రణాళికాబద్ధంగా పనిచేసి విజయం సాధించారని, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నేతలు, కార్యకర్తలు చక్కగా పనిచేశారని పేర్కొన్నారు.

మెదక్‌ నేతలకు...
మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు నేతృత్వంలో నూతన ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి సీఎంను కలిశారు. ఎమ్మెల్యేలు మదన్‌రెడ్డి, రామలింగారెడ్డిలు, ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి, పార్టీ నేతలు చింత ప్రభాకర్‌, సత్యనారాయణ వారి వెంట ఉన్నారు. ఈ సందర్భంగా ప్రభాకర్‌రెడ్డి సహా వచ్చిన నేతలందరికీ సీఎం శుభాకాంక్షలు తెలిపారు. మంచి మెజారిటీని సాధించి, మెదక్‌ పేరు నిలిపారంటూ కొనియాడారు.

ఓరుగల్లు కంచుకోట
వరంగల్‌ జిల్లా తెరాసకు కంచుకోట అని మరోసారి నిరూపించారని సీఎం అన్నారు. వరంగల్‌ ఎంపీ పసునూరి దయాకర్‌, మహబూబాబాద్‌ ఎంపీ మాలోతు కవితలు సీఎంను కలిశారు. మండలి విప్‌ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీ సత్యవతి రాఠోడ్‌ వారితో ఉన్నారు. వరంగల్‌ గత మూడు పార్లమెంటు ఎన్నికల నుంచీ విజయం సాధిస్తోందన్నారు. ఈ ఆనవాయితీని నిలబెట్టడం అభినందనీయమని దయాకర్‌తో చెప్పారు. శాసనమండలి, స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఘన విజయం సాధించాలన్నారు. మహబూబాబాద్‌ స్థానంలో గెలుస్తావనే నమ్మకంతో టికెట్‌ ఇచ్చాం. దానిని నిలబెట్టావమ్మా అంటూ ఎంపీ కవితను కేసీఆర్‌ అభినందించారు. వరంగల్‌, మహబూబాబాద్‌ స్థానాలు గెలవడం ద్వారా అక్కడ పార్టీ బలంగా ఉందని రుజువైందని చెప్పారు.

ఖమ్మం నేతలు మాట నిలబెట్టుకున్నారు
ఖమ్మం నుంచి నూతనంగా ఎన్నికైన ఎంపీ నామా నాగేశ్వరరావు కేసీఆర్‌ను కలిశారు. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మండలి విప్‌ పల్లా రాజేశ్వర్‌రెడ్డి వెంట ఉన్నారు. ఖమ్మం జిల్లాలో తప్పనిసరిగా విజయం సాధించి చూపుతామని తనకు హమీ ఇచ్చారని, దీనిని నిలబెట్టుకున్నారని సీఎం అభినందించారు.

పెద్దపల్లిలో మళ్లీ గులాబీ జెండా
పెద్దపల్లి నియోజకవర్గం తెరాసను ఆది నుంచి ఆదరిస్తోందని, అదే ఆనవాయితీ కొనసాగించారని, ప్రజలు ఆదరాభిమానాలతో మంచి విజయం సాధించారని ఆ నియోజకవర్గ కొత్త ఎంపీ వెంకటేశ్‌ను కొనియాడారు. సింగరేణి కార్మికులు తెరాస వెన్నంటే ఉన్నారన్నారు.

చేవెళ్లలో మళ్లీ పాగా
రాష్ట్రంలోని కీలక నియోజకవర్గాల్లో చేవెళ్ల ఒకటి. అక్కడ స్ఫూర్తిదాయక విజయం సాధించారంటూ కొత్త ఎంపీ రంజిత్‌రెడ్డిని కేసీఆర్‌ అభినందించారు. అతి సునాయాసంగా గెలుస్తామనుకున్నప్పటికీ, పరిస్థితులు మారాయని, ప్రజలు తెరాస వెన్నంటే ఉండి గెలిపించారన్నారు. పార్టీ నేతలు, కార్యకర్తల కృషి ఫలించిందని తెలిపారు.

జహీరాబాద్‌ మనదే
జహీరాబాద్‌ నియోజకవర్గంలో వరుసగా రెండోసారి గెలవడం అభినందనీయమని కొత్త ఎంపీ బీబీపాటిల్‌తో తెరాస అధినేత అన్నారు. ఈ నియోజకవర్గంలోనూ చివరి వరకు ఉత్కంఠ ఏర్పడిందని, మెజారిటీ నియోజకవర్గాల్లో ఆధిక్యంతో విజయం దక్కిందని తెలిపారు.

నల్గొండలో సత్తా చాటాలి
నల్గొండ అభ్యర్థి వేమిరెడ్డి నర్సింహారెడ్డి, మంత్రి జగదీశ్‌రెడ్డి, ఇతర నేతలు శుక్రవారం సీఎంను కలిశారు. వేమిరెడ్డి మాట్లాడుతూ, తప్పనిసరిగా విజయం సాధిస్తామని ఆశించినా.. ఊహించని రీతిలో ఓటమి పాలయ్యానని ఆవేదన చెందారు. సీఎం ఆయనతో మాట్లాడుతూ, ఎన్నికల్లో గెలుపోటములు సహజమని, ప్రతి ఒక్కరూ గెలుపొందడం ఒక్కోసారి అసాధ్యమన్నారు. ఈ ఎన్నికల్లో ఓడినా కుంగిపోవద్దని, మళ్లీ పుంజుకుని ముందుకు సాగాలని సూచించారు. నల్గొండ తప్పనిసరిగా గెలవాల్సిన స్థానమని, అయినా ఓడిపోయామని, పార్టీ ఓటమిపై త్వరలోనే సమావేశం ఏర్పాటు చేసి చర్చిస్తామని కేసీఆర్‌ అన్నారు.


 

హుజూర్‌నగర్‌పై సీఎం చర్చ

ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నల్గొండ ఎంపీగా గెలవడంతో ఖాళీ అవుతున్న హుజూర్‌నగర్‌ శాసనసభ స్థానాన్ని తప్పనిసరిగా తెరాసయే గెలుస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. ప్రగతిభవన్‌లో నల్గొండ జిల్లా మంత్రి, నేతలు సీఎంను కలిసినపుడు హుజూర్‌నగర్‌ను శాసనసభ ఎన్నికల్లో మనం గెలవాల్సి ఉందని, కేవలం 7 వేల మెజారిటీతో ఉత్తమ్‌ గట్టెక్కారని సీఎం పేర్కొన్నట్లు తెలిసింది. లోక్‌సభ ఎన్నికల్లోనూ హుజూర్‌నగర్‌లో ఉత్తమ్‌కు 12 వేల మెజారిటీ మాత్రమే వచ్చిందని వెల్లడించినట్లు సమాచారం. ఈ నియోజకవర్గ బాధ్యతలను ఆయన కేటీఆర్‌కు అప్పగించారు. ఇక్కడ పోటీకి ప్రస్తుత ఇన్‌ఛార్జి సైదిరెడ్డి, మాజీ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డిల పేర్లు ప్రస్తావనకు వచ్చాయి. త్వరలో అభ్యర్థిని ఎంపిక చేసి, వెంటనే ప్రచారంలోకి దిగాలని పార్టీ నేతల సమావేశంలో కేసీఆర్‌, కేటీఆర్‌లు నిర్ణయించినట్లు తెలిసింది.

సీఎంను కలిసిన కవిత, నర్సయ్యగౌడ్‌
నిజామాబాద్‌ మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత, భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌లు శుక్రవారం ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిశారు. సీఎం వారితో విడివిడిగా మాట్లాడారు. ఎన్నికల్లో ఓటమి గురించి మాట్లాడి, వారిని ఓదార్చారని తెలిసింది.

 

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.