Array
(
  [0] => stdClass Object
    (
      [news_id] => 121031
      [news_title_telugu_html] => 

దీటైన దళపతి

[news_title_telugu] => దీటైన దళపతి [news_title_english] => [news_short_description] => సార్వత్రిక ఎన్నికల్లో ఆరోదశ ముగుస్తోందనగా భాజపా జాతీయాధ్యక్షుడు అమిత్‌ షా విలేకరులతో మాట్లాడారు. సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడానికి కావల్సిన ఆధిక్యత తమకు ఇప్పటికే వచ్చేసిందని, కేవలం భాజపాను 300 మార్కు.... [news_tags_keywords] => [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [news_sections] => ,27,26, ) )
దీటైన దళపతి - EENADU
close
దీటైన దళపతి

భాజపా వరుస విజయాల వెనుక అమిత్‌ షా వ్యూహాలే కీలకం

సార్వత్రిక ఎన్నికల్లో ఆరోదశ ముగుస్తోందనగా భాజపా జాతీయాధ్యక్షుడు అమిత్‌ షా విలేకరులతో మాట్లాడారు. సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడానికి కావల్సిన ఆధిక్యత తమకు ఇప్పటికే వచ్చేసిందని, కేవలం భాజపాను 300 మార్కు దాటించడానికే ఏడోదశ ఎన్నికల్లో ప్రచారం చేస్తున్నామని చెప్పారు. అది చూసి అంతా నవ్వుకున్నారు. మరీ అతిశయానికి పోతున్నారని విమర్శించారు కూడా. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత వాళ్లంతా ఆ రోజును గుర్తుచేసుకుని ముక్కున వేలేసుకున్నారు. భాజపాకు సొంతంగా 303 స్థానాలు వచ్చాయి.. సరిగ్గా షా చెప్పినట్లే!! 2017 ఫిబ్రవరిలో ఉత్తర్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలు ముగిసే సమయంలో కూడా అమిత్‌షా ఇలాగే చెప్పారు. ఆ రాష్ట్ర ఎన్నికలు నాలుగు దశల్లోనే ముగిసిపోయాయని, మిగిలిన మూడు దశల్లో కేవలం అక్కడ తమ ఆధిక్యాన్ని పెంచుకోడానికే ప్రచారం చేస్తున్నామని అన్నారు. అప్పుడూ ఆయన  చెప్పినట్లే జరిగింది. లోక్‌సభ ఎన్నికల్లో తొలిసారే గాంధీనగర్‌ నుంచి 5.5 లక్షల ఆధిక్యంతో గెలిచారు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉత్తర్‌ప్రదేశ్‌ బాధ్యతలు చేపట్టినపుడే 2014 సార్వత్రిక ఎన్నికలలో భాజపా విజయానికి ఆయన పునాదులు వేశారు. 2019కి వచ్చేసరికి పార్టీకి 22.6 కోట్ల ఓట్లు, మొత్తం పోలైన ఓట్లలో 37.4 శాతంతో 303 స్థానాలు సంపాదించి పెట్టారు. అంతేకాదు, 2014లో కేవలం ఆరు రాష్ట్రాల్లోనే అధికారంలో ఉన్న ఆ పార్టీ ఇప్పుడు 19 రాష్ట్రాలకు విస్తరించింది. భాజపా మూలసిద్ధాంతమైన హిందుత్వకు జాతీయవాద అజెండాను మేళవించి, క్షేత్రస్థాయిలో సంస్థాగతమైన నెట్‌వర్క్‌తో పకడ్బందీగా వ్యూహాల్ని అమలు చేయడం ద్వారా 2019 ఎన్నికల్లో మోదీ సునామీని గతంలోకన్నా ఉద్ధృతంగా వీచేలా చేశారు. స్థానిక ఓటుబ్యాంకు అండదండలున్న ప్రత్యర్థి పక్షంలోని నేతలను భాజపా ఛత్రం కిందికి తీసుకురావడం, ఈశాన్య రాష్ట్రాల్లో కొత్త సంకీర్ణాలను ఏర్పాటు చేయడం ద్వారా పార్టీ విజయావకాశాలను అమిత్‌ షా మరింతగా మెరుగుపరిచారు. మిత్రపక్షాల విషయంలో ఆయన వ్యవహార శైలి విభిన్నంగా ఉంటుంది. 2015లో చిన్నపక్షాలతో కూడిన భాజపా బిహార్‌లోని లాలుప్రసాద్‌, నీతీశ్‌కుమార్‌ జోడీతో ఏమాత్రం సరితూగని పరిస్థితిలో ఉండగా, తర్వాత నీతీశ్‌ మనసు గెలిచి 2017లో తమ కూటమిలోకి ఆకర్షించగలిగారు. తర్వాత జేడీయూతో సమాన స్థానాల్లో పోటీచేసేందుకు అంగీకరించి, ప్రాంతీయ పార్టీ కోసం ఒక మెట్టు కిందికి దిగడమూ ఆయనకే చెల్లు. మహారాష్ట్రలో 2015లో తమ మిత్రపక్షం శివసేన కూటమి నుంచి బయటికి వెళ్లిపోతే ఆపకుండా ఉండటం ద్వారా భాజపా తన స్థానాన్ని సుస్థిరం చేసుకునేలా చేసి, కీలకమైన లోక్‌సభ ఎన్నికలకు వచ్చేసరికి అదే శివసేనతో ఉదారంగా సీట్లు పంచుకున్నారు.

యంత్రాంగం నిర్మాణమిలా..

తాను పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత అమిత్‌షా యువ నేతలకు అధిక ప్రాధాన్యం కల్పించారు. ప్రభుత్వ పథకాలపై ప్రచారం నిర్వహించడం, రాజకీయ కార్యక్రమాలు చేపట్టడం, ఓటర్లను చేరేలా సామాజిక మాధ్యమాల్ని ఉపయోగించేందుకు ప్రతి రాష్ట్రంలో సంస్థాగత యంత్రాంగాన్ని బలంగా నిర్మించారు. 2019 ఎన్నికల్లో దేశవ్యాప్తంగా సుమారు 500 పోల్‌ కమిటీలతో 7 వేల మంది నేతల్ని మోహరించారు. 2014లో భాజపా ఓడిన 120 స్థానాలపై ప్రత్యేకదృష్టి సారించారు. పార్లమెంటరీ స్థానాలన్నింటికీ 3 వేల మంది చొప్పున పూర్తిస్థాయి కార్యకర్తలను నియమించారు. పార్టీ పరంగా ప్రభుత్వ కార్యక్రమాల్ని ప్రోత్సహించడంతోపాటు  మంత్రులను పార్టీ కార్యక్రమాలకు ఉపయోగించుకునేలా ప్రభుత్వానికి, పార్టీకి మధ్య వారధిగా వ్యవహరిస్తుంటారు. ఈసారి ఎన్నికల్లో మరే నేతా తిరగని స్థాయిలో 1.58 లక్షల కిలోమీటర్లు పయనించి 312 లోక్‌సభ స్థానాల్ని సందర్శించి, 161 సభల్లో పాల్గొన్నారు. ‘‘ప్రతిపక్షాలు ఎన్ని ఏకమైనా మనం 50 శాతం ఓట్లు సాధిస్తే చాలు. గెలుపు మనదే. ఆ దిశగా లక్ష్యాన్ని నిర్దేశించుకోండి. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి’’ అని బూత్‌స్థాయి కార్యకర్తల నుంచి కేంద్రమంత్రుల వరకు ఉద్బోధించిన అమిత్‌షా వ్యూహం ఫలించింది. యూపీలో మహాకూటమిని గెలవాలంటే 50% ఓట్లే లక్ష్యంగా పనిచేయాలన్న సూచన పనిచేసింది. 49 శాతానికి పైగా ఓట్లతో ఆ పార్టీ మెజార్టీ స్థానాలు గెలుచుకుంది. మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌, గుజరాత్‌, హరియాణాల్లో 50 శాతానికిపైగా ఓట్లు సాధించింది.

పడిన చోటే మళ్లీ లేచి...

భాజపా ఇంతలా బలపడేందుకు ఒకవైపు ప్రధాని నరేంద్రమోదీ చేసిన మ్యాజిక్‌తో పాటు.. అవిశ్రాంతంగా పార్టీకి అమిత్‌షా అందించిన సేవలు కూడా  ముఖ్య కారణం. 2014 జులైలో భాజపా జాతీయాధ్యక్షుడిగా ఎన్నికయ్యాక దిల్లీలో నిర్వహించిన మొట్టమొదటి జాతీయ మండలి సమావేశంలో.. ఇకనుంచి జరిగే ప్రతి ఎన్నికలోనూ నెగ్గాలన్నది లక్ష్యంగా నిర్దేశించారు. దాదాపుగా అది నిజమైంది. మధ్యలో ఇటీవల జరిగిన కొన్ని రాష్ట్రాల ఎన్నికలలో  మాత్రం భాజపా ఎదురుదెబ్బలు తింది. అయితే.. కొన్ని నెలల వ్యవధిలోనే మళ్లీ కోలుకుని పడిన చోటే లేచి నిలబడింది. ఫలితంగా 19 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కాంగ్రెస్‌ కనీసం బోణీ కూడా కొట్టలేకపోయింది. ఉత్తర్‌ప్రదేశ్‌, బిహార్‌, మధ్యప్రదేశ్‌, కర్ణాటక, మహారాష్ట్ర లాంటి పెద్ద రాష్ట్రాలలో కేవలం ఒక్కొక్క స్థానానికే పరిమితమైంది. ఆరు దశాబ్దాల పాటు భారతదేశాన్ని పరిపాలించిన కాంగ్రెస్‌ వరుసగా రెండుసార్లు లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా సంపాదించలేని పరిస్థితికి తీసుకొచ్చినది మోదీ-షా జోడీయే. 543 స్థానాలున్న లోక్‌సభలో ఈ హోదా రావాలంటే 10%.. అంటే 54 రావాలి. కాంగ్రెస్‌ పార్టీకి సొంతంగా 2014లో 44, ఇప్పుడు 52 మాత్రమే వచ్చాయి. అంతే కాదు.. ఇందిరాగాంధీ హయాం నుంచి కాంగ్రెస్‌ పార్టీకి పెట్టని కోటగా నిలిచిన అమేఠీని ఆ పార్టీ నుంచి లాగేసుకున్నారు. రాహుల్‌ గాంధీ చేతిలో 2014 ఎన్నికలలో ఓడిన స్మృతి ఇరానీయే ఆయనను ఓడించారు.

తూర్పున గెలవాల్సిందే

భాజపా వ్యూహకర్తలతో ఒకసారి నిర్వహించిన సమావేశంలో అమిత్‌ షా, మోదీ ఒక ముఖ్యమైన విషయం చెప్పారు. ఉత్తరభారతంలో, పశ్చిమ ప్రాంతంలో భాజపా ఇప్పటికే వ్యాపించిందని, ఇక విస్తరణ అవకాశాలున్నది కేవలం తూర్పు, దక్షిణ భారతాల్లోనే అని అన్నారు. కానీ దేశానికి తూర్పుప్రాంతంలో ఉన్న పశ్చిమబెంగాల్‌ అప్పటికే మమతా బెనర్జీ అధీనంలో ఉంది. కమ్యూనిస్టులను పడగొట్టి మరీ ఆమె అక్కడ పాగా వేశారు. చీమను కూడా దూరనివ్వరని పేరున్న మమతను ఢీకొట్టి అక్కడ గెలవడం సాధ్యమేనా అని చాలామందికి అనుమానాలు తలెత్తాయి. ఆ రాష్ట్రంలో అడుగుపెట్టేందుకు అమిత్‌ షా ఎన్ని వ్యూహాలు పన్నారో ఆయనకే ఎరుక. టీఎంసీకి వణుకు పుట్టించి, ఆ పార్టీ కంటే కేవలం 3% ఓట్లు వెనకబడి, అక్కడ 18 లోక్‌సభ స్థానాలను కైవసం చేసుకున్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో అక్కడ భాజపా గెలిచింది రెండే. ఇపుడు దక్షిణ భారతంలోని ఒడిశా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, కేరళ రాష్ట్రాలపై దృష్టిసారించారు. రాబోయే కాలంలో ఇటువైపు కాలు మోపాలన్నది కమల దళపతి లక్ష్యం.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.