close
సంప్రదింపులకు రాలేం! 

మమతా బెనర్జీ ఆహ్వానాన్ని తిరస్కరించిన జూనియర్‌ వైద్యులు 
డిమాండ్లను ఆమోదించినట్లు ముఖ్యమంత్రి ప్రకటన

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లో జూనియర్‌ వైద్యుల సమ్మెతో నెలకొన్న ప్రతిష్టంభన వీడలేదు. శనివారం వరుసగా ఐదో రోజూ ఆందోళన కొనసాగింది. సమస్య పరిష్కారానికి చర్చల కోసం సచివాలయానికి రావాలన్న ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆహ్వానాన్ని డాక్టర్లు తోసిపుచ్చారు. దీనికి బదులు కోల్‌కతాలోని ఎన్‌ఆర్‌ఎస్‌ వైద్య కళాశాల ఆసుపత్రికి వచ్చి, బహిరంగ చర్చలు జరపాలని కోరారు. సమ్మెవల్ల రాష్ట్రంలో వైద్యసేవలు స్తంభించాయి. వైద్యులు విధులకు హాజరుకావాలని, వారి డిమాండ్లను ప్రభుత్వం ఆమోదించిందని మమత తెలిపారు. మరోవైపు సమ్మెపై నివేదిక కోరుతూ కేంద్ర హోంశాఖ బెంగాల్‌ ప్రభుత్వానికి లేఖ రాసింది. జూనియర్‌ వైద్యుల భద్రతకు చర్యలు తీసుకోవాలని గవర్నర్‌ కె.ఎన్‌.త్రిపాఠి ముఖ్యమంత్రికి సూచించారు. 
కోల్‌కతాలోని ఎన్‌ఆర్‌ఎస్‌ వైద్య కళాశాల, ఆసుపత్రిలో తమ సహచరులపై జరిగిన దాడికి నిరసనగా మంగళవారం నుంచి జూనియర్‌ వైద్యులు సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. శనివారం రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి నిర్వహించతలపెట్టిన సమావేశానికి తమ ప్రతినిధులెవరూ వెళ్లడంలేదని జూనియర్‌ వైద్యుల సంయుక్త వేదిక అధికార ప్రతినిధి తెలిపారు. ముఖ్యమంత్రి ఎన్‌ఆర్‌ఎస్‌ ఆసుపత్రి వద్దకు వచ్చి, తమతో చర్చించాలని కోరారు. ఎస్‌ఎస్‌కేఎం ఆసుపత్రి వద్ద చేసిన వ్యాఖ్యలకు మమత క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. 
చర్చలకు జూనియర్‌ వైద్యులు హాజరు కాకపోవడంతో మమతా బెనర్జీ శనివారం సాయంత్రం విలేఖరులతో మాట్లాడారు. సమ్మెపై కేంద్రం నివేదిక కోరడాన్ని ఆమె తప్పుపట్టారు. గవర్నర్‌ లేఖను ప్రస్తావిస్తూ ఆయనతో తాను మాట్లాడానని, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలను వివరించానని తెలిపారు. జూనియర్‌ వైద్యులపై అత్యవసర సేవల నిర్వహణ చట్టం (ఎస్మా) ప్రయోగించలేదని పేర్కొన్నారు. వారి కోసం తాను 5 గంటల పాటు వేచిచూశానని చెప్పారు. రాజ్యాంగ వ్యవస్థ పట్ల గౌరవం చూపాలని హితవు పలికారు. రాష్ట్రవ్యాప్తంగా అనేక మంది వైద్యులు రాజీనామా లేఖలను సమర్పించడాన్ని ప్రస్తావిస్తూ.. అవి చట్టపరంగా చెల్లుబాటు కావన్నారు. తనకు సమర్థత లేదని జూనియర్‌ వైద్యులు భావిస్తే గవర్నర్‌తో కానీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో కానీ పోలీసు కమిషనర్‌తో కానీ వారు చర్చించవచ్చని సూచించారు. తనతో చర్చించడానికి కొందరు జూనియర్‌ వైద్యులు వచ్చారంటూ పాత్రికేయ సమావేశాన్ని మమత అర్ధాంతరంగా ముగించారు. అయితే తమ ప్రతినిధులెవరూ అక్కడికి వెళ్లలేదంటూ జూనియర్‌ వైద్యులు తెలిపారు. సమ్మె ముగింపునకు సరిగా ప్రయత్నించడంలేదంటూ భాజపా, సీపీఎం మమతా బెనర్జీపై మండిపడ్డాయి. మరోవైపు ఆందోళన చేస్తున్న వైద్యుల డిమాండ్లను 48 గంటల్లోగా నెరవేర్చాలని దిల్లీలోని ఎయిమ్స్‌, సఫ్దర్‌జంగ్‌ ఆసుపత్రుల్లోని డాక్టర్లు మమతా బెనర్జీకి అల్టిమేటం జారీ చేశారు. లేకుంటే నిరవధిక సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. 
చట్టం చేసే అంశాన్ని పరిశీలించండి 
వైద్యులను అన్ని రకాల దాడుల నుంచి రక్షించేందుకు చట్టాన్ని చేసే అంశాన్ని పరిశీలించాలంటూ కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖలు రాశారు. దీనితోపాటు భారత వైద్య సంఘం (ఐఎంఏ) అందజేసిన ముసాయిదా చట్టాన్ని పంపారు. వైద్యులపై దాడులు చేసే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. మరోవైపు ఐఎంఏ, దిల్లీ వైద్య సంఘం ప్రతినిధులు శనివారం హర్షవర్ధన్‌ను కలిసి, వైద్యుల భద్రతకు చర్యలు తీసుకోవాలని కోరారు.

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.