close
ప్రత్యేక హోదాయే ప్రాణవాయువు 

నీతి ఆయోగ్‌ సమావేశంలో ఆంధ్రప్రదేశ్‌ సీఎం జగన్‌

ఏపీకి ప్రత్యేక హోదా సాధ్యం కాదని 14వ ఆర్థిక సంఘం చెప్పిందంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. రాష్ట్రానికి హోదా ఇవ్వొద్దని ఎక్కడా సిఫార్సు చేయలేదంటూ 14వ ఆర్థిక సంఘం సభ్యుడు అభిజిత్‌సేన్‌ రాసిన లేఖను ఈ సమావేశం ముందు ఉంచుతున్నా. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అమలు ప్రక్రియ వేగవంతం చేయాలని 2014 మార్చి 2న ప్రణాళిక సంఘానికి కేంద్ర మంత్రివర్గ సమావేశం సూచించింది. నీతి ఆయోగ్‌ ఏర్పడక ముందు ప్రణాళిక సంఘం 2014 డిసెంబరు 31 వరకు మనుగడలోనే ఉన్నా నాటి రాష్ట్ర ప్రభుత్వం సరిగా స్పందించకపోవడం వల్లే ప్రత్యేక హోదా అమలు ప్రక్రియ ముందుకు సాగలేదని స్పష్టమవుతోంది. నాడు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రకటిస్తూ కేంద్ర మంత్రివర్గం అనుమతించిన లేఖను కూడా సమావేశం ముందుంచుతున్నా. 

- ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌

ఈనాడు, దిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాయే ప్రాణవాయువని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గాడినపడాలన్నా అదే తారక మంత్రమని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. విభజన అనంతరం గత ప్రభుత్వం లోపభూయిష్టమైన పాలనవల్ల ప్రమాణాలు పడిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రానికి తగిన ప్రోత్సాహకాలు, రాయితీలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు రాష్ట్రంలోని పరిస్థితులు వివరిస్తూ సుమారు 98 పేజీల నివేదికను నీతిఆయోగ్‌కు అందజేశారు. శనివారమిక్కడ ప్రధాని మోదీ అధ్యక్షతన నిర్వహించిన నీతి ఆయోగ్‌ పాలక మండలి సమావేశంలో   జగన్‌ ప్రసంగించారు. ‘‘ఏపీకి సంబంధించిన జాతీయ స్థాయిలోని ఆకాంక్షలకు అనుగుణంగా ఉన్న కొన్ని సూచనలు, ప్రతిపాదనలు చేస్తున్నా. రాష్ట్రానికి సంబంధించిన అజెండాను నివేదిక రూపంలో సమావేశానికి అందజేశా.  విభజన వల్ల ఆంధ్రప్రదేశ్‌ ఆర్థికంగా ఇబ్బందులు పడుతుందని, నిరుద్యోగం పెరుగుతుందని కనీసం ఆలోచించలేదు. జనాభా, రుణాలకు సంబంధించి ఏపీకి వారసత్వంగా సుమారు 59 శాతం లభిస్తే.. ఆదాయం మాత్రం 47 శాతమే దక్కింది. 
భారీగా ఆదాయ లోటు 
2015 నుంచి 2020 వరకు ఐదేళ్ల కాలంలో ఆంధ్రప్రదేశ్‌కు.. విభజన అనంతర ఆదాయ లోటు (పోస్ట్‌ డివల్యూషన్‌ రెవెన్యూ డెఫిషిట్‌) రూ.22,113 కోట్లు ఉంటుందని 14వ ఆర్థిక సంఘం అంచనా వేసింది. అదే కాలానికి తెలంగాణకు.. విభజన అనంతర ఆదాయ మిగులు (పోస్ట్‌ డివల్యూషన్‌ రెవెన్యూ సర్‌ప్లస్‌) రూ.1,18,678 కోట్లుగా తేల్చారు. కానీ వాస్తవంగా చూస్తే ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్‌ ఆదాయ లోటు రూ.66,362 కోట్లు. దశాబ్దాలుగా హైదరాబాద్‌ నగరం ఎంతో అభివృద్ధి చెందిన విషయం అందరికీ తెలిసిందే. 2013-14 కాలంలో ఆంధ్రప్రదేశ్‌ నుంచి రూ.57 వేల కోట్ల విలువైన సాఫ్ట్‌వేర్‌ ఉత్పత్తులు ఎగుమతి అయితే అందులో రూ.56,500 కోట్లు హైదరాబాద్‌ నుంచి ఎగుమతి అయినవే. 2015-16 నాటికి తెలంగాణ తలసరి ఆదాయం రూ.14,411గా ఉంటే ఏపీలో తలసరి ఆదాయం రూ.8,397 మాత్రమే. 
ప్రధాని కూడా హామీ ఇచ్చారు 
ప్రత్యేక హోదా కావాలంటూ మరికొన్ని రాష్ట్రాలు డిమాండ్‌ చేస్తున్నట్లు వదంతులు వినిపిస్తున్నాయి. దేశ చరిత్రలో ఇప్పటి వరకూ ఏ రాష్ట్రాన్ని కూడా హోదా ఇస్తామని చెప్పి విభజించలేదు.  విభజన వల్ల అధిక ఆదాయం వచ్చే రాజధానిని కోల్పోయిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌. రాష్ట్రంలో మెజారిటీ ప్రజలు విభజనను కోరుకోలేదు. విభజన సమయంలో ఇచ్చిన ప్రత్యేక హోదా హామీ నెరవేర్చాలని ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేస్తున్నా. 2014 ఎన్నికల భాజపా మేనిఫెస్టోలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పిన విషయాన్ని మరిచిపోద్దని గుర్తు చేస్తున్నా. ఎన్నికల ప్రచారంలో కూడా రాష్ట్రానికి హోదా ఇస్తామని ప్రధాని ప్రకటించారు.  రాష్ట్ర సమస్యలన్నీ సహృదయంతో పరిష్కరిస్తారని విశ్వసిస్తూ ప్రసంగం ముగిస్తున్నా’’ అని ముఖ్యమంత్రి జగన్‌ పేర్కొన్నారు.

కర్ణాటక సీఎం కుమారస్వామితో జగన్‌ చర్చలు

బెంగళూరు, న్యూస్‌టుడే: దిల్లీలో శనివారం నిర్వహించిన నీతి ఆయోగ్‌ సమావేశంలో పాల్గొనేందుకు వెళ్లిన కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి తొలిసారి ముఖాముఖి సమావేశమయ్యారు. జగన్‌కు కుమారస్వామి పుష్పగుచ్ఛాన్ని అందించి, శాలువాతో సత్కరించారు. జగన్‌ కూడా కుమారస్వామికి శాలువా కప్పి, వేంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని అందజేశారు. ఇటీవలే కుమారస్వామి తనయుడు నిఖిల్‌ తాడేపల్లిలో ముఖ్యమంత్రి క్యాంప్‌ కార్యాలయంలో జగన్‌ను కలుసుకుని చర్చలు జరిపారు. కొత్తగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన జగన్‌కు అభినందనలు తెలిపానని కుమారస్వామి వివరించారు.

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.