close
వెంటనే సాధారణ బదిలీలు చేపట్టాలి 

మధ్యంతర భృతిని ప్రకటించాలి 
తెలంగాణ ఉద్యోగ, ఉపాధ్యాయ, గెజిటెడ్‌ అధికారులు, పింఛనర్ల ఐకాస వినతి 
సీఎంపై పూర్తి నమ్మకముందని వెల్లడి

ఈనాడు, హైదరాబాద్‌: వెంటనే ప్రభుత్వ ఉద్యోగుల సాధారణ బదిలీలు చేపట్టాలని రాష్ట్ర ఉద్యోగ, ఉపాధ్యాయ, గెజిటెడ్‌ అధికారులు, పింఛనర్ల ఐకాస ప్రభుత్వాన్ని కోరింది. 2018 జులై ఒకటో తేదీ నుంచి వర్తించేలా పీఆర్‌సీని ప్రకటించాలని లేదా 43 శాతం మధ్యంతర భృతి ఇవ్వాలని కోరింది. పదవీ విరమణ వయసును 58 నుంచి 61 ఏళ్లకి పెంచాలని, సీపీఎస్‌ను రద్దు చేయాలని, ఏపీలో ఉన్న తెలంగాణ ఉద్యోగులను స్వరాష్ట్రానికి తీసుకురావాలని విజ్ఞప్తి చేసింది.  రెవెన్యూతోపాటు ఇతర శాఖలను మరో శాఖలో విలీనం చేయడాన్ని వ్యతిరేకిస్తున్నామని తెలిపింది.  నెలాఖరులోగా ఉద్యోగుల సమస్యలన్నింటినీ పరిష్కరించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి విన్నవిస్తామని తెలిపింది. సీఎం కేసీఆర్‌పై తమకు పూర్తి నమ్మకం ఉందని.. ఆయన అన్నింటినీ పరిష్కరిస్తారని భావిస్తున్నామని తెలిపింది. శనివారమిక్కడ టీఎన్జీవో భవన్‌లో ఐకాస ఛైర్మన్‌ కారెం రవీందర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ప్రధాన కార్యదర్శి మమత, ఇతర నేతలు సత్యనారాయణ, మామిండ్ల రాజేందర్‌, రేచల్‌, మధుసూదన్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి, సతీష్‌, హన్మంతునాయక్‌, పద్మాచారి, జ్ఞానేశ్వర్‌, ప్రవీణ్‌, వెంకటేశ్వర్లు, జగన్‌, సహదేవ్‌, మణిపాల్‌రెడ్డి, పవన్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రవీందర్‌రెడ్డి, మమతలు విలేకరులతో మాట్లాడారు. ‘‘గత సంవత్సరం మే 16న సీఎం కేసీఆర్‌ ఉద్యోగులతో సమావేశమయ్యారు. అప్పుడు ఇచ్చిన హామీలలో కొన్ని అమలు చేశారు.. మరికొన్ని అమలు కావాల్సి ఉంది. పీఆర్‌సీని నియమించినా.. ఇప్పటి వరకు నివేదిక ఇవ్వలేదు. వెంటనే పీఆర్‌సీ నివేదిక ఇవ్వాలి. ఏపీ ప్రభుత్వం 27 శాతం మధ్యంతర భృతి (ఐఆర్‌) ప్రకటించింది. సీపీఎస్‌ రద్దుకి కమిటీ వేసింది. ఇక్కడ 43 శాతం ఐఆర్‌ కోరుతున్నాం. సీపీఎస్‌ను రద్దు చేయాలి. గ్రంథాలయ సంస్థ, వ్యవసాయ మార్కెట్లు, విశ్వవిద్యాలయాలు, ఎయిడెడ్‌ విద్యాసంస్థల్లోని వారికి 010 కింద వేతనాలివ్వాలి. ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణ, సమాన పనికి సమానవేతనం, పొరుగుసేవల ఏజెన్సీలను రద్దు చేసి, ప్రభుత్వ శాఖల ద్వారా వేతనాలు ఇవ్వాలి. ఉద్యోగులకు గత ఏడాది మాదిరే సాధారణ బదిలీలు చేపట్టాలి. బడిబాట అమలు తర్వాతే పాఠశాలల్లో హేతుబద్ధీకరణ జరగాలి. పాలనా సంస్కరణలను స్వాగతిస్తున్నాం. అవినీతి రహితంగా అందరూ పనిచేయాలి. ఒకశాఖను పూర్తిగా మరో శాఖలో విలీనం చేస్తే ఉద్యోగుల్లో అభద్రతాభావం చోటుచేసుకుంటుంది. రెవెన్యూశాఖను విలీనం చేయవద్దని కోరాలని తీర్మానించాం. 
ఆరోగ్య సేవలకు ప్రీమియం చెల్లించడానికి మేం సిద్ధంగా ఉన్నాం. ఈ పథకంలో సేవలను మెరుగుపరచాలి. వెల్‌నెస్‌సెంటర్లను పెంచాలి. పదోన్నతులకు గడువును రెండేళ్లకు తగ్గించాలి. ఉపాధ్యాయులకు ఏకీకృత సేవల ద్వారా పదోన్నతులు కల్పించాలి. కొత్త జిల్లాలకు అవసరమైన సిబ్బందిని మంజూరు చేయాలి’’ అని రవీందర్‌రెడ్డి, మమతలు కోరారు. కేసీఆర్‌ది స్నేహపూర్వక ప్రభుత్వమని.. ఏ ప్రభుత్వం అధికారంలోఉన్నా ఉద్యోగులు దానికి అనుగుణంగా పనిచేయాల్సిందేనని పేర్కొన్నారు. కేసీఆర్‌పై తమకు  పూర్తి నమ్మకం ఉందని స్పష్టంచేశారు. 
సీఎం కేసీఆర్‌కు అభినందనలు 
కాళేశ్వరం వంటి భారీ ప్రాజెక్టును స్వల్ప వ్యవధిలో పూర్తి చేసిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని అభినందిస్తూ ఐకాస తీర్మానం చేసింది. ప్రాజెక్టు నిర్మాణంలో భాగస్వాములైన అధికారులు, ఉద్యోగులకు అభినందనలు తెలిపింది.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.