close
పత్తాలేని వాన.. పండించేదెలా 

11 ఏళ్లలో అతి తక్కువ  వర్షపాతం 
జూన్‌లో ఇప్పటి వరకు కనిపించని వాన జాడ 
70 శాతం వర్షపాతం లోటు ఉండే అవకాశం 
ప్రస్తుత తేలికపాటి వర్షాలకు విత్తులు నాటొద్దు 
జయశంకర్‌ వర్సిటీ, క్రిడా, వ్యవసాయశాఖ నివేదిక 
ఈనాడు - హైదరాబాద్‌

ప్రస్తుత ఖరీఫ్‌లో వర్షాభావ పరిస్థితులు అన్నదాతను వెంటాడుతున్నాయి. జూన్‌ 15వ తేదీ వచ్చినా వానల జాడే లేదు. భానుడి భగభగలతో ఖరీఫ్‌ సాగుపై తీవ్ర ప్రభావం పడనుంది. ప్రస్తుతం సాధారణంకన్నా 7 డిగ్రీల వరకూ  అదనంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నైరుతి రుతుపవనాలు కేరళ దాటినా అక్కడే ఉన్నాయి. మరో 2, 3 రోజుల్లో కర్ణాటకలో విస్తరించే అవకాశాలున్నట్లు వాతావరణశాఖ ప్రకటించింది. ఈ నెల 20 వరకూ తెలంగాణకు వచ్చే అవకాశాలు పెద్దగా లేవు. నాలుగైదు రోజుల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నట్లు అంచనా. వర్షపాతం పరంగా చూసుకుంటే గత 11 ఏళ్లలో 2009-19 మధ్యకాలంలో అతి తక్కువ వర్షపాతం 2014 జూన్‌లో కురిసింది. ఆ నెలలో సాధారణంకన్నా 43.8 శాతం తక్కువ వర్షం పడింది. ఈ ఏడాది అంతకన్నా అతి తక్కువగా అంటే 52 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. ఈమేరకు రాష్ట్ర వ్యవసాయశాఖ, జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం, జాతీయ మెట్టపంటల పరిశోధన కేంద్రం(క్రిడా)లు సంయుక్తంగా శనివారం విడుదలచేసిన నివేదికలో వెల్లడించాయి. 

రానున్న రోజుల్లోనూ లోటే! 
జూన్‌ 3వ వారంలోనూ అధికంగా ఉష్ణోగ్రతలుండటం వల్ల పంటల సాగులో పలు జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రస్తుత ఖరీఫ్‌ (జూన్‌ నుంచి సెప్టెంబరు) కాలంలో సాధారణ వర్షపాతంలో 96 శాతం వరకూ కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ ముందస్తు అంచనాల్లో గత నెలలో ప్రకటించింది. ప్రస్తుత జూన్‌లో తెలంగాణలో సాధారణంకన్నా 60 నుంచి 70 శాతం వరకూ లోటు ఏర్పడనుంది. 
జూన్‌ 1 నుంచి 15 వరకూ సాధారణంకన్నా 52 శాతం తక్కువ వర్షం కురిసింది. ములుగు జిల్లాలో సాధారణంకన్నా 97, వరంగల్‌ అర్బన్‌లో 93, ఖమ్మంలో 88 శాతం తక్కువ
వర్షపాతం నమోదైంది. వచ్చే నెలలో సాధారణంకన్నా 60 నుంచి 70 శాతం తక్కువ కురుస్తుందని అంచనా. సెప్టెంబరులో 60 నుంచి 70 శాతం వరకూ అదనంగా పడుతుంది. 
ఇప్పుడేం చేయాలి 
ప్రస్తుతం కురుస్తున్న తేలికపాటి వానలకు వర్షాధార భూముల్లో పంటల సాగు వద్దు. విత్తనాలు విత్తవద్దు. పంటల సాగుకు అవసరమైన లోతు దుక్కులు దున్నాలి. 
రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించాక కనీసం 75 మి.మీ.ల వర్షపాతం నమోదైన అనంతరం వర్షాధార పంటలైన సోయాచిక్కుడు, మొక్కజొన్న, జొన్న, కంది, పెసర, పత్తి వంటివి విత్తుకోవాలి. 
ఈ నెలాఖరులోగా పెసర, జొన్న, జులై 15లోగా మొక్కజొన్న, పత్తి, సోయాచిక్కుడు, జులై నెలాఖరులోగా కంది, ఆగస్టు 15లోగా ఆముదం విత్తుకోవాలి. 
వరిలో సాంబ మసూరి వంటి దీర్ఘకాలిక రకాల వంగడాల నారు ఈ నెల 20 తరువాత పోయవద్దు. వచ్చే నెల 10లోగా మధ్యకాలిక, వచ్చే నెల 31 వరకూ స్వల్పకాలిక రకాల వంగడాల వరి నార్లు పోసుకోవచ్చు. 
తేలికపాటి నేలల్లో సోయాచిక్కుడు సాగువద్దు. 
దక్షిణ తెలంగాణలో తేలికపాటి నేలల్లో మొక్కజొన్న వేయవద్దు. 

మంజీర వెలవెల 
సంగారెడ్డి, మెదక్‌ జిల్లాల మధ్యలో చుక్కనీరు లేకుండా మంజీరా నది బోసిపోయి దర్శనమిస్తోంది. నాగల్‌గిద్ద మండలం నుంచి మెదక్‌ జిల్లాలోని ఘనపూర్‌ ఆనకట్ట వరకు చుక్కనీరు లేక వెలవెలబోతోంది. లోటు వర్షపాతం, భానుడి ఉగ్రరూపం ధాటికి బోర్లు ఎండిపోయి వ్యవసాయ పనులు సాగించలేని దుస్థితి నెలకొంది.

-ఈనాడు, సంగారెడ్డి

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.