close
మనది భారత జట్టు 

ఎన్నికలు ముగిశాయి... కలిసికట్టుగా పనిచేద్దాం 
ఐదేళ్లలో రూ.350 లక్షల కోట్ల  ఆర్థిక వ్యవస్థగా మారుద్దాం 
జీడీపీ పెరుగుదలకు జిల్లా స్థాయి నుంచే దృష్టి 
వ్యవసాయంలో కార్పొరేట్‌  పెట్టుబడులకు ప్రోత్సాహం 
నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ 
దిల్లీ

భారత్‌ను 2024 నాటికి అయిదు ట్రిలియన్‌ డాలర్ల (350 లక్షల కోట్ల రూపాయలు) ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. దీన్ని చేరుకోవడం సవాలుతో కూడుకున్నదే అయినప్పటికీ మనమంతా కలిసి జట్టుగా పనిచేస్తే అసాధ్యమైనది కాదని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రస్తుతం దేశ ఆర్థిక వ్యవస్థ 2.75 ట్రిలియన్‌ డాలర్ల విలువైనదిగా అంచనా వేయగా, దాన్ని రానున్న అయిదేళ్లలో రెట్టింపు చేయాలన్న భారీ ఆశయాన్ని నిర్దేశించుకున్నట్టు చెప్పారు. ఇందుకోసం రాష్ట్రాలు తమ పూర్తి సామర్థ్యాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. స్థూల జాతీయ ఉత్పత్తి (జీడీపీ) పెరుగుదలకు జిల్లా స్థాయి నుంచే దృష్టి కేంద్రీకరించాలని అన్నారు. శనివారం రాష్ట్రపతి భవన్‌లో జరిగిన నీతి ఆయోగ్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ అయిదో సమావేశంలో ఆయన అధ్యక్షోపన్యాసం చేశారు. ఈ సమావేశంలో నలుగురు మినహా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్‌ గవర్నర్లు, నీతి ఆయోగ్‌లో సభ్యులుగా ఉన్న కేంద్రమంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కరవు పరిస్థితులు, వ్యవసాయ రంగ సంక్షోభం, నక్సలైట్‌ సమస్య, వర్షపు నీటిని ఆదా చేయడం, వ్యవసాయ రంగంలో మౌలిక సంస్కరణలు, ఆకాంక్ష జిల్లాల అభివృద్ధే అజెండాగా చర్చలు జరిగాయి. 
కలిసికట్టుగా పనిచేద్దాం 
ఇటీవలే ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య కసరత్తు అయిన ఎన్నికల ప్రక్రియ పూర్తయిందని, ఇకపై దేశం అభివృద్ధిపై అందరూ దృష్టి సారించాలని ప్రధాని మోదీ కోరారు. పేదరికం, నిరుద్యోగం, కరవు, వరదలు, కాలుష్యం, అవినీతి, హింసపై కలిసికట్టుగా పోరాడాలని పిలుపునిచ్చారు. 2022నాటికి నూతన భారత్‌ నిర్మాణమే అందరి లక్ష్యం కావాలని ఆకాంక్షించారు. ప్రతి పౌరునికీ సాధికారిత, సులభతర జీవనాన్ని కల్పించాలని చెప్పారు. మహాత్మా గాంధీ 150వ జయంతి సందర్భంగా తీసుకున్న నిర్ణయాలను అక్టోబరు రెండో తేదీనాటికి క్రోడీకరించాలని, వాటిని దేశ స్వాతంత్య్ర 75వ వార్షికోత్సవం జరిగే 2022నాటికి నెరవేర్చాలని తెలిపారు. దీర్ఘకాలిక, స్వల్పకాలిక లక్ష్యాల సాధనకు ఉమ్మడి బాధ్యత తీసుకోవాలని అన్నారు. దేశంలో కరవు పరిస్థితులు కనిపిస్తున్నాయని, దీన్ని ఎదుర్కోవడానికి ‘ప్రతి చుక్కకు అధిక పంట’ అన్న విధానాన్ని పాటించాలని సూచించారు. 2022నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్న విధానానికి కట్టుబడ్డామని, ఇందుకోసం చేపల పెంపకం, పశుపోషణ, ఉద్యానవనాలు, కూరగాయల పెంపకంపై దృష్టి సారించాలని తెలిపారు. 
ఇవీ వ్యవసాయ సంస్కరణలు 
వ్యవసాయ రంగంలో చేపట్టాల్సిన సంస్కరణలను ప్రధాని మోదీ వివరించారు. ఈ రంగంలో కార్పొరేట్‌ పెట్టుబడులు, రవాణా సౌకర్యాలు, మార్కెట్‌ మద్దతును ప్రోత్సహించాల్సి ఉందని తెలిపారు. ఆహార ధాన్యాల ఉత్పత్తి కన్నా ఆహార శుద్ధి రంగం వేగంగా అభివృద్ధి చెందాల్సి ఉందని తెలిపారు. రైతుల కోసం ఉద్దేశించిన పీఎం కిసాన్‌ నిధి వంటి పథకాలు అర్హులైన లబ్ధిదారులకు సకాలంలో చేరాల్సి ఉందని అన్నారు. 
నక్సలైట్ల హింసపై జరుగుతున్న యుద్ధం కీలక దశకు చేరుకుందని మోదీ చెప్పారు. అరాచకాలను కఠినంగా అణచివేయడంతోపాటు, అభివృద్ధి పనులకు ప్రాధాన్యం ఇస్తున్నట్టు తెలిపారు. ఆయుష్మాన్‌ భారత్‌ పథకాన్ని అమలు చేయని రాష్ట్రాలు దాన్ని అందుకోవాలని కోరారు. ఆకాంక్ష జిల్లాల్లో సుపరిపాలనపై దృష్టి పెట్టాలని, అప్పుడే గణనీయమైన ప్రగతి సాధ్యమవుతుందని అన్నారు. అందరితో కలిసి, అందరి వికాసం, అందరి విశ్వాసం అన్న నినాదాన్ని సఫలీకృతం చేయడంలో నీతి ఆయోగ్‌ కీలకపాత్ర పోషించాలని మోదీ కోరారు. 
త్వరలో సంస్కరణల కమిటీ విధివిధానాలు 
వ్యవసాయరంగంలో తీసుకురాదలచిన సంస్కరణలకు సంబంధించి ఏర్పాటు చేయనున్న ఉన్నతస్థాయి కమిటీ విధి విధానాలను త్వరలోనే వెల్లడిస్తామని నీతి ఆయోగ్‌ వైస్‌ఛైర్మన్‌ రాజీవ్‌ కుమార్‌ విలేకరులకు తెలిపారు. ఈ కమిటీ రెండు మూడు నెలల్లో తన నివేదికను సమర్పించాల్సి ఉంటుందన్నారు. వ్యవసాయ మార్కెట్ల కమిటీలు, నిత్యావసరాల చట్టంలోని నిబంధనలను పునఃసమీక్షించాలని పలు రాష్ట్రాలు సమావేశంలో కోరినట్లు వెల్లడించారు. రానున్న బడ్జెట్‌కు రాష్ట్రాల నుంచి పలు సూచనలు అందినట్లు రాజీవ్‌కుమార్‌ పేర్కొన్నారు. 
హాజరు కాని కేసీఆర్‌, మమత... 
నీతి ఆయోగ్‌ సమావేశానికి నలుగురు ముఖ్యమంత్రులు... కె.చంద్రశేఖర్‌రావు, మమతా బెనర్జీ, అమరీందర్‌ సింగ్‌, జైరాం ఠాగూర్‌లు హాజరుకాలేదు. ప్రతిష్ఠాత్మకమైన కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ప్రారంభోత్సవ కార్యక్రమ సన్నాహాల్లో నిమగ్నమై ఉన్నందున తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు పాల్గొనలేదు. అనారోగ్యం కారణంగా పంజాబ్‌ ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌ తనకు బదులు ఆర్థిక మంత్రి మన్‌ప్రీత్‌ బాదల్‌ను పంపించారు. ఆర్థిక అధికారాలు లేని నీతిఆయోగ్‌ సమావేశాల్లో పాల్గొనడం నిష్ప్రయోజనమని, అందువల్ల తాను రాబోనంటూ గతంలోనే పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ లేఖ పంపించారు. హిమాచల్‌ప్రదేశ్‌ సీఎం జైరాం ఠాకూర్‌ జర్మనీలో ఉన్నందున హాజరవ్వలేదు.

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.