close
ఎన్నికలకు ముందు 5 నెలల ప్రక్రియ

వార్డుల పునర్విభజన, రిజర్వేషన్‌లు ఖరారు చేయాలి
గ్రామ పంచాయతీల విలీనంతో ఎన్నికల ప్రక్రియ జాప్యం
మున్సిపల్‌ ఎన్నికలపై హైకోర్టుకు నివేదించిన రాష్ట్ర ప్రభుత్వం
ఈనాడు - హైదరాబాద్‌

రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌లకు ఎన్నికల ప్రక్రియను విడివిడిగా చేపట్టడం సాధ్యం కాదని, ఎన్నికల ముందస్తు ప్రక్రియ నిర్వహించడానికి సుమారు 5 నెలల గడువు పడుతుందని తెలంగాణ ప్రభుత్వం మంగళవారం హైకోర్టుకు నివేదించింది. గ్రామ పంచాయతీల విలీనంతో పాటు కొత్తగా మున్సిపాలిటీలను ఏర్పాటు చేయడం వల్ల వార్డుల విభజన, ఓటర్ల జాబితా, రిజర్వేషన్‌ల ప్రక్రియ పూర్తి చేయాలంటే గడువు అవసరమని తెలిపింది. మున్సిపాలిటీల పాలకవర్గాల గడువు జులై 2తో ముగుస్తున్నందున ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు ఏర్పాటు చేయకపోవడాన్ని సవాల్జేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం, బీసీ సంక్షేమ సంఘం హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాయి. కోర్టు ఆదేశాల మేరకు మంగళవారం రాష్ట్రప్రభుత్వం తరఫున పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్‌కుమార్‌ కౌంటరు దాఖలు చేశారు.

కౌంటరులో పేర్కొన్న అంశాలు
ఎన్నికల ముందస్తు ప్రక్రియ పూర్తి చేయడానికి 141 రోజులతోపాటు అదనంగా మరో 10 రోజులు పడుతుంది. రాష్ట్రంలోని 3 మున్సిపల్‌ కార్పొరేషన్‌లు 53 మున్సిపాలిటీల పాలకవర్గాల గడువు జులై 2న ముగుస్తోంది. 2018 డిసెంబరు 31లోగా వార్డుల పునర్విభజన ఏమైనా ఉంటే పూర్తి చేయాలని, ఈ ఏడాది మార్చి 28లోగా రిజిర్వేషన్‌లను ఖరారు చేయాలంటూ గత ఏడాది సెప్టెంబరు 15న రాష్ట్ర ఎన్నికల సంఘం లేఖ రాసింది. ప్రస్తుతం ఉన్న 11 మున్సిపాలిటీలు, కొత్తగా ఏర్పడిన 44 మున్సిపాలిటీల ఓటర్ల జాబితాను ప్రచురించాలని పేర్కొంది. పట్టణాల సమీప ప్రాంతాల్లో ఉన్నవి, పట్టణీకరణ చెందిన పంచాయతీలను మున్సిపాలిటీలుగా మార్చడం, లేదంటే విలీనం చేయాలని ప్రభుత్వం విధాన నిర్ణయం తీసుకుంది. ఈమేరకు గతేడాది జనవరి 19న జిల్లా కలెక్టర్లకు సమాచారమిస్తూ ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించింది. ఇందులో భాగంగా 68మున్సిపాలిటీలను ఏర్పాటయ్యాయి. 173పంచాయతీలను మున్సిపాలిటీలుగా మార్చడంతో పాటు మరో 131పంచాయతీలను పక్కనే ఉన్న 42 మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌లలో విలీనమయ్యాయి. పంచాయతీలపాలకవర్గాల గడువు పూర్తయ్యాకే విలీనం ఉంటుంది. వివిధ మున్సిపాలిటీలు పలు తేదీల్లో ఏర్పాటయ్యాయి. 28 పంచాయతీల విలీనాన్ని, 14 మున్సిపాలిటీల ఏర్పాటు చేయడాన్ని సవాల్జేస్తూ హైకోర్టులో పిటిషన్‌లు దాఖలు చేయగా, విలీనంపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పిటిషన్‌లను ఈ ఏడాది మార్చి 8న హైకోర్టు కొట్టివేయడంతో అప్పటినుంచి పంచాయతీలు మున్సిపాలిటీలుగా మార్పు చేయడం జరిగింది. గుండ్లపోచంపల్లి పాలకవర్గం గడువు జూన్‌1తోను, నకిరేకల్‌, జడ్చర్లలోని బడేపల్లి మున్సిపాలిటీ 2020 డిసెంబరులో ముగుస్తుంది. ప్రజాప్రతినిధులు, ప్రజలతో చర్చించి వార్డులను విభజించాక వాటిని ఖరారు చేయడానికి 30రోజుల గడువు అవసరమన్నారు. వార్డుల వారీగా ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాను సిద్ధం చేసి, పార్టీల అభ్యంతరాలను స్వీకరించి విడుదల చేయడానికి వార్డుల పునర్విభజన పూర్తయిన 30 రోజులు పడుతుంది. వార్డుల పునర్విభజన పూర్తయ్యాక ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా ఓటర్ల గుర్తింపు నిమిత్తం ఇంటింటా సర్వేచేసి, అభ్యంతరాలు స్వీకరించి తుది ఓటర్ల జాబితాను సిద్ధం చేయాలంటే 60రోజులు పడుతుంది. జులై 2న పదవీకాలం ముగిసే 56 మున్సిపాలిటీలకు 21చోట్ల మాత్రమే పంచాయతీల విలీనం జరగలేదు. అని అరవింద్‌కుమార్‌ దాఖలు చేసిన కౌంటర్‌ ద్వారా కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలో తగిన ఉత్తర్వులు జారీ చేయాలని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ అభ్యర్థించారు. ఈ కౌంటరును పరిశీలించిన జస్టిస్‌ నవీన్‌రావు పిటిషన్‌లపై విచారణను బుధవారం చేపడతామన్నారు.

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.