close
ఎమ్మార్‌ కుంభకోణం నిందితులకు సమన్లు

వచ్చే నెల 12న హాజరుకావాలంటూ 12 మందికి ఈడీ కోర్టు ఆదేశం
నిందితుల్లో కోనేరు రాజేంద్రప్రసాద్‌, మధు, ప్రదీప్‌, స్టైలిష్‌ హోమ్స్‌ డైరెక్టర్‌ తుమ్మల రంగారావు తదితరులు

ఈనాడు, హైదరాబాద్‌: ఎమ్మార్‌ కుంభకోణం వ్యవహారంలో నిందితులకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) ప్రత్యేక హోదా ఉన్న సీబీఐ కోర్టు సమన్లు జారీ చేసింది. ఎమ్మార్‌ వ్యవహారంలో ఈడీ దాఖలు చేసిన అభియోగ పత్రం (ఫిర్యాదులో)లోని 12 మంది నిందితులకు సమన్లు జారీ చేసింది. నిందితుల్లో కోనేరు రాజేంద్రప్రసాద్‌, కోనేరు మధు, కోనేరు ప్రదీప్‌, నేరాన్ని అంగీకరించి సీబీఐ కేసు నుంచి బయటపడిన స్టైలిష్‌ హోమ్స్‌ డైరెక్టర్‌ తుమ్మల రంగారావు, సునీల్‌రెడ్డి, ఎమ్మార్‌ ఎంజీఎఫ్‌ సీఈవో పి.శ్రీకాంత్‌ జోషి, ఆర్థిక విభాగాధిపతి జి.వి.విజయరాఘవలతోపాటు ఎమ్మార్‌ హిల్స్‌ టౌన్‌షిప్‌, ఎమ్మార్‌ ఎంజీఎఫ్‌, స్టైలిష్‌ హోమ్స్‌, ఇందుకూరి శ్యాంప్రసాద్‌రెడ్డి డైరెక్టర్‌గా ఉన్న ఆసరా థీమ్‌ ప్రాజెక్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, ఎన్‌.మనోహర్‌రెడ్డి డైరెక్టర్‌గా ఉన్న సౌత్‌ఎండ్‌ ప్రాజెక్ట్స్‌ అండ్‌ ఫౌండేషన్‌ లిమిటెడ్‌లున్నాయి. పర్యాటక ప్రాజెక్టు చేపట్టిన ఎమ్మార్‌ వ్యవహారంలో కోట్ల రూపాయల ప్రభుత్వ ధనం అన్యాక్రాంతం అయిందన్న ఆరోపణల నేపథ్యంలో సీబీఐ కేసు నమోదు చేసి అభియోగ పత్రం దాఖలు చేసింది.

ఇదీ నేపథ్యం
పర్యాటక ప్రాజెక్టుగా మణికొండ, గచ్చిబౌలిలలో 535 ఎకరాల్లో గోల్ఫ్‌కోర్సు మైదానం, కన్వెన్షన్‌ సెంటర్‌, హోటల్‌, విల్లాలతో కూడిన వాణిజ్య సముదాయ నిర్మాణాలను చేపట్టడానికి ఎమ్మార్‌ ప్రాపర్టీస్‌తో ఏపీఐఐసీ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ప్రాజెక్టును పొందిన ఎమ్మార్‌ ఇతర ఒప్పందాలకు విరుద్ధంగా అనుబంధ ఒప్పందాలు చేసుకోవడం, ఏపీఐఐసీ వాటాను తగ్గించడం వంటి అక్రమాలకు పాల్పడింది. పైసా పెట్టుబడి పెట్టని ఎమ్మార్‌ ఎంజీఎఫ్‌ రూ.167.29 కోట్ల ప్రయోజనం పొందగా, రికార్డుల్లో చూపిన ధర కంటే ఎక్కువ మొత్తాలకు విల్లాలు, ఫ్లాట్‌లను విక్రయించగా వచ్చిన రూ.96 కోట్లు కోనేరు రాజేంద్రప్రసాద్‌, ఎన్‌.సునీల్‌రెడ్డిలకు చేరింది. ఏపీఐఐసీకి మాత్రం రూ.43.50 కోట్ల నష్టం వాటిల్లింది. ఈ మేరకు సీబీఐ కేసు నమోదు చేసి అభియోగ పత్రం దాఖలు చేసింది. దీని ఆధారంగా ఈడీ దర్యాప్తు చేసి ఏడేళ్ల తర్వాత ఇటీవల అభియోగ పత్రం దాఖలు చేసింది. దీన్ని విచారణ నిమిత్తం పరిగణనలోకి తీసుకున్న ఈడీ ప్రత్యేక కోర్టు నిందితులకు సమన్లు జారీ చేసింది. మనీలాండరింగ్‌ నిరోధక చట్టం కింద నిందితులు అక్రమాలకు పాల్పడ్డారని, వారిని శిక్షించాలని కోరింది. ఇప్పటికే ఎమ్మార్‌ ఆస్తులను జప్తు చేసిన విషయం విదితమే.

ఎల్వీ సుబ్రహ్మణ్యం, బీపీ ఆచార్యలపై కేసు కొట్టివేత
ఐఏఎస్‌ అధికారులు ఎల్వీ సుబ్రహ్మణ్యం, బీపీ ఆచార్యలపై సీబీఐ కేసును గతంలోనే హైకోర్టు కొట్టివేసింది. ఎమ్మార్‌ ప్రాజెక్టు వ్యవహారంలో ఎల్వీ సుబ్రహ్మణ్యం పాత్ర పరిమితమని పేర్కొంటూ ఆయనపై సీబీఐ కేసును రద్దుచేసింది. బీపీ ఆచార్య ప్రాసిక్యూషన్‌కు అనుమతి లేకపోవడంతో ఆ కేసును కొట్టివేసింది. ప్రభుత్వ అనుమతి పొందాక ఈడీ కేసులో అభియోగాలను విచారణ నిమిత్తం పరిగణనలోకి తీసుకోవచ్చని హైకోర్టు తెలిపింది. కోనేరు మధుపై సీబీఐ కేసును హైకోర్టు కొట్టివేసినప్పటికీ ఈడీ ఆయనను నిందితుడిగా పేర్కొంది.

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.