close
నేటి నుంచి జూడాల నిరవధిక సమ్మె

బోధనాస్పత్రుల్లో ఆచార్యుల పదవీ విరమణ వయసు పెంపునకు నిరసన

ఈనాడు, హైదరాబాద్‌ - కవాడిగూడ, గాంధీఆస్పత్రి, సుల్తాన్‌బజార్‌, న్యూస్‌టుడే: బోధనాస్పత్రుల్లో ఆచార్యుల పదవీ విరమణ వయసును పెంచొద్దని, ఖాళీగా ఉన్న వైద్య పోస్టులను సత్వరమే భర్తీ చేయాలన్న డిమాండ్లతో బుధవారం నుంచి సమ్మెకు దిగుతున్నట్లు జూనియర్‌ డాక్టర్లు ప్రకటించారు. జూడాల సంఘం గాంధీ యూనిట్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు లోహిత్‌, అర్జున్‌లు మంగళవారం ఆస్పత్రి సూపరింటెండెంట్‌ శ్రావణ్‌కుమార్‌ను కలిసి సమ్మె నోటీసు అందించారు. అత్యవసర సేవలు మినహా బోధనాస్పత్రుల్లో ఇతర వైద్యసేవల్లో తాము పాల్గొనబోమని జుడాల ఐకాస అధ్యక్షుడు పీఎస్‌ విజేందర్‌గౌడ్‌ తెలిపారు. పదవీ విరమణ వయసు పెంపుపై ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకూ సమ్మె కొనసాగుతుందని తెలిపారు. సమ్మె సమాచారాన్ని వైద్య విద్య సంచాలకులకు మంగళవారం రాతపూర్వకంగా తెలియజేశామన్నారు. మరోవైపు జూడాల సమ్మె నేపథ్యంలో రోగులకు ఇబ్బందుల్లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు సూపరింటెండెంట్‌ వివరించారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు ‘కెరీర్‌ అడ్వాన్స్‌మెంట్‌ స్కీం’ (సీఏఎస్‌) అమలు తర్వాతే ఉద్యోగ విరమణ వయోపరిమితి పెంపుపై నిర్ణయం తీసుకోవాలని.. దీని కోసం ప్రత్యేకంగా కమిటీని నియమించాలని తెలంగాణ వైద్యుల సంఘం (టీజీజీడీఏ) ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. ఆచార్యుల వయోపరిమితి పెంచుతూ ఆర్డినెన్స్‌ తీసుకొస్తున్నారన్న సమాచారంతో మంగళవారం టీజీజీడీఏ ఆధ్వర్యంలో ‘చలో డీఎంఈ కార్యాలయం’ కార్యక్రమాన్ని చేపట్టారు. సంఘం అధ్యక్ష, కార్యదర్శులు పల్లం ప్రవీణ్‌కుమార్‌, నరహరి ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో వైద్యులు కోఠిలోని వైద్యవిద్య సంచాలకుల (డీఎంఈ) కార్యాలయానికి చేరుకుని ఆందోళన చేపట్టారు.  డీఎంఈ కార్యాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించిన వైద్యులను పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర వాగ్వాదం, తోపులాటతో ఉద్రిక్తత నెలకొంది. టీజీజీడీఏ ప్రతినిధులు సిద్దిపేట రమేశ్‌, భూపేందర్‌ రాథోడ్‌  పాల్గొన్నారు. వైద్య ఆచార్యుల పదవీ విరమణ వయోపరిమితిని పెంచొద్దని నిరుద్యోగ వైద్యులు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. మంగళవారం హైదరాబాద్‌లోని ధర్నాచౌక్‌లో నిరుద్యోగ వైద్యుల సభ జరిగింది. హెల్త్‌కేర్‌ రిఫార్మ్స్‌ డాక్టర్స్‌ అసోసియేషన్‌ (హెచ్‌ఆర్‌డీఏ) రాష్ట్ర అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ మాట్లాడుతూ.. ప్రభుత్వ వైద్య పదవులు అనుభవిస్తున్న వారిని ఇంకా కొనసాగిస్తే తమకు ఉద్యోగాలు వచ్చేదెన్నడని మండిపడ్డారు.

రిటైర్మెంట్‌ వయసు పెంచొద్దు
ఉస్మానియా యూనివర్సిటీ, న్యూస్‌టుడే: ప్రభుత్వ ఉద్యోగుల, వైద్య ఆచార్యుల పదవీ విరమణ వయోపరిమితిని పెంచొద్దని తెలంగాణ విద్యార్థి నిరుద్యోగ ఐకాస ఛైర్మన్‌ కోటూరి మానవతారాయ్‌ డిమాండ్‌ చేశారు. వయోపరిమితి పెంపు ప్రతిపాదనలకు నిరసనగా ఓయూ లైబ్రరీ ఆవరణలో ఐకాస ఆధ్వర్యంలో మంగళవారం శిరోముండన కార్యక్రమం నిర్వహించారు.

పదవీ విరమణ వయసు పెంపుపై హర్షం
ఖైరతాబాద్‌, న్యూస్‌టుడే: ప్రభుత్వ బోధనాస్పత్రుల్లో పనిచేస్తున్న ఆచార్యుల పదవీ విరమణ వయసు 58 నుంచి 65 ఏళ్లకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం హర్షణీయమంటూ ప్రీ, పారా క్లినికల్‌ టీచింగ్‌ గవర్నమెంట్‌ డాక్టర్స్‌ అసోసియేషన్‌ (పీపీటీజీడీఏ), బోధనాస్పత్రుల ఆచార్యుల సంఘం సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపాయి. సంఘాల ప్రతినిధులు రమాదేవి, టి.కృపాల్‌సింగ్‌, ఆర్‌.బాబురావు, సులేమాన్‌లు మాట్లాడారు.

ప్రజారోగ్య విభాగంలో పదోన్నతులు
ఈనాడు, హైదరాబాద్‌: ప్రజారోగ్య సంచాలకుల విభాగంలో సీనియర్‌ అసిస్టెంట్లుగా పనిచేస్తున్న 35 మందికి సూపరింటెండెంట్లుగా మంగళవారం పదోన్నతి కల్పించారు. కొత్తగా నెలకొల్పిన వైద్యకళాశాలలు, అనుబంధ ఆస్పత్రులు సహా పలు దవాఖానాల్లో పాలనాధికారులుగా వీరు వ్యవహరిస్తారు.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.