close
తెలంగాణ జలప్రదాయని కాళేశ్వరం

ప్రాజెక్టుపై తప్పుడు ప్రచారం మానుకోండి
జాతీయ ప్రాజెక్టు హోదా కోసం కొట్లాడాల్సిన తరుణమిది
కావాలనే విద్వేష పూరిత విమర్శలు
తెలంగాణ విశ్రాంత ఇంజినీర్ల సంఘం
ఈనాడు - హైదరాబాద్‌

హుళార్థ సాధక ప్రాజెక్టు కాళేశ్వరం తెలంగాణకు వరప్రదాయని అని తెలంగాణ విశ్రాంత ఇంజినీర్ల సంఘం పేర్కొంది. ఎవరెన్ని విమర్శలు చేసినా నీళ్లు, నిధులు, నియామకాల కోసం చేసిన తెలంగాణ ఉద్యమం అనంతరం సాధించుకున్న బృహత్తరమైన వనరు ఈ ప్రాజెక్టు అని పేర్కొంది.  ఇందులో భాగంగా గోదావరినే జలాశయంగా మార్చి అన్నారం, సుందిళ్ల, మేడిగడ్డ బ్యారేజీలు నిర్మించారని, మరో 15 బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్ల నిర్మాణంతో 141 టీఎంసీల జలాలను నిల్వ చేసుకునే వెసులుబాటు ఏర్పడిందని వెల్లడించింది. అన్ని అనుమతులు వచ్చిన ఈ ప్రాజెక్టుకు అనుమతులు రద్దు చేయాలంటూ తెలంగాణ వారే సుప్రీంకోర్టులో కేసులు వేయడం దారుణమంది. ప్రాజెక్టుపై విమర్శలు చేయడం, వ్యతిరేకంగా పోరాటాలు చేయడం మానుకొని, జాతీయ హోదా కోసం కొట్లాడాలని సలహా ఇచ్చింది. ప్రాజెక్టు విశిష్టత, నిర్మాణంపై పలువురు ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో వాటిపై స్పష్టతనివ్వాలని భావించినట్టు స్పష్టం చేసింది. ఈ మేరకు మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో విలేకర్ల సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు చంద్రమౌళి తదితరులు మాట్లాడారు.

వ్యయం పెరగడం సహజం

బహుళార్థ సాధక ప్రాజెక్టు అన్నాక వ్యయం పెరగడం సహజం. అంతకు మించి ప్రయోజనం కలుగుతుంది. తెలంగాణకు ఎత్తిపోతల పథకాలు అనువైనవి కావని జయప్రకాశ్‌ నారాయణ చేస్తున్న ప్రచారం తప్పు. విమర్శలకు బదులు కృష్ణా, గోదావరి నదులకు ఎగువన ఉండే తెలంగాణకు సాగునీళ్లు ఎలా ఇవ్వొచ్చో ఆయన సూచించవచ్చు కదా?

 
- సంఘం అధ్యక్షుడు చంద్రమౌళి

పండుగ చేసుకోవాల్సిన సమయం

ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు 2010 అంచనాల మేరకు రూ.40 వేల కోట్లు వ్యయం అయ్యేది. అది రూ.65 వేల కోట్లకు చేరుకునేది. దాని కింద 16 లక్షల ఎకరాలకు మాత్రమే నీళ్లు ఇచ్చేందుకు వీలుండేది. కాళేశ్వరం ప్రాజెక్టు వ్యయం రూ.80 వేల కోట్లు అయినా 18.35 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లు, మరో 18.34 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ, హైదరాబాద్‌కు తాగునీటి లభ్యత చేకూరుతుంది. ఇప్పటివరకు 65 శాతం పనులు జరిగాయి. రూ.43 వేల కోట్లు వ్యయం చేశారు. దీనికి భిన్నంగా కొందరు 15 శాతమే పనులైనట్లు విమర్శలు చేయడం తగదు. గత ప్రభుత్వం మొదలు పెట్టిన ఈ ప్రాజెక్టును పునరాకృతితో అనతికాలంలోనే సీఎం కేసీఆర్‌ ప్రభుత్వం పూర్తిచేస్తోంది. ఉత్తర తెలంగాణతోపాటు దక్షిణ తెలంగాణ ఆయకట్టు స్థిరీకరణకు కాళేశ్వరం జలాలు పంపించే వెసులుబాటు ఉంది. ప్రజలు పండుగ చేసుకోవాల్సిన సమయమిది.

- సంఘం ప్రధాన కార్యదర్శి శ్యాంప్రసాద్‌ రెడ్డి

తుమ్మిడి హట్టికి సమ్మతించకుంటే మేడిగడ్డకు

2004లో ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా తుమ్మిడి హట్టి నుంచి 160 టీఎంసీలు మళ్లించి ఒక పంటకు నీళ్లు ఇవ్వాలని నిర్ణయించారు. రూ.17,875 కోట్ల నుంచి 28 ప్యాకేజీలతో రూ.35,500 కోట్లకు నిర్మాణ వ్యయాన్ని పెంచారు. రిజర్వాయర్‌ ఆనకట్ట ఎత్తును నిర్ణయించకుండానే కాల్వల తవ్వకం పనులు ఎందుకు మొదలు పెట్టారంటూ మహారాష్ట్ర అప్పటి సీఎం చౌహాన్‌ ఉమ్మడి ఏపీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డికి లేఖ కూడా రాశారు. దీనికి భిన్నంగా సీఎం కేసీఆర్‌ రెండు పంటలకు నీళ్లు ఇచ్చేలా కేంద్ర జల సంఘం నివేదిక ప్రకారం తుమ్మిడి హట్టి నుంచి మేడిగడ్డకు ప్రాజెక్టును మార్చారు. దీంతో ఇక్కడ 284 టీఎంసీల లభ్యత ఏర్పడింది.

- విశ్రాంత సీఈ వెంకటరామారావు

ఎకరానికి రూ.1200-1500 మాత్రమే ఖర్చు

ప్రాజెక్టుకు చేస్తున్న ఖర్చుతో ఎకరా విస్తీర్ణానికి నీళ్లు అందించేందుకు రూ.40-50 వేల వరకు వ్యయం అవుతుందని కొందరు చేస్తున్న ప్రచారం తప్పు. కేవలం రూ.1200 నుంచి 1500 వరకు మాత్రమే ఖర్చవుతుంది. దీనివల్ల వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ రంగాలు, పర్యాటకం, మత్స్య పరిశ్రమ అభివృద్ధి చెందుతుంది. హైదరాబాద్‌తోపాటు ఇతర పట్టణాలకు తాగునీటి లభ్యత పెరగడంతో పరిశ్రమల స్థాపన పెరిగి ఉద్యోగాలు, ఉపాధి కల్పన అవకాశాలు మెరుగుపడుతాయి.

- విశ్రాంత ఇంజినీరు భీమయ్య

ఇది అసాధారణం

1955లో ప్రారంభించిన నాగార్జునసాగర్‌ కింద 1995 నాటికి కూడా పూర్తిస్థాయిలో కాలువల తవ్వకం పూర్తికాలేదు. అలాంటిది మూడేళ్లలో బహుళ ప్రయోజనాలున్న ప్రాజెక్టును దాదాపు పూర్తిచేయడం సాధారణ విషయం కాదు.

- కెప్టెన్‌ జనార్థన్‌

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.