close
తెలుగు రాష్ట్రాల్లో ప్రతి అంగుళానికీ నీరు

5,000 టీఎంసీల జలాలను పారిస్తాం
పరస్పర సహకారంతో సంపూర్ణ జల వినియోగం
రాష్ట్ర ఉద్యోగులకు ప్రత్యేక ప్యాకేజీ
త్వరలో పీఆర్‌సీ.. రిటైర్మెంట్‌ వయసు పెంపు
ప్రస్తుత స్థలంలోనే కొత్త సచివాలయం
ఎర్రమంజిల్‌లో శాసనసభకు కొత్త భవనాలు
రూ. 500 కోట్లతో నిర్మాణం
ఈ నెల 27న భూమి పూజ నిర్వహిస్తాం
కాళేశ్వరం ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల
30 జిల్లాల్లో తెరాస కార్యాలయాలకు స్థలాలు
తెలంగాణ మంత్రిమండలి నిర్ణయాలు

ఈనాడు - హైదరాబాద్‌

కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవాన్ని విజయవంతం చేయడానికి పనులు జరుగుతున్నాయి. ఈనెల 21న గవర్నర్‌ నరసింహన్‌ ఆధ్వర్యంలో కార్యక్రమం జరుగుతుంది. మహారాష్ట్ర, ఏపీ సీఎంలిద్దరినీ ఆహ్వానించాను. ఈ ప్రాజెక్టు నిర్మాణం ఇంత వేగంగా చేస్తారనుకోలేదని మహారాష్ట్ర సీఎం నాతో అన్నారు. అప్పుడే పనులు పూర్తిచేశారా అని ఆశ్చర్యపోయారు. ఆంధ్రప్రదేశ్‌ కొత్త ముఖ్యమంత్రి జగన్‌ యువకుడు, ఉత్సాహవంతుడు. ఏపీలోని మెట్ట ప్రాంతాలకు నీరు తీసుకెళ్లాలనే పట్టుదలతో ఉన్నారు. ఏపీ సీఎం, నీటిపారుదల శాఖ కార్యదర్శి, మంత్రి 27, 28 తేదీల్లో హైదరాబాద్‌ వస్తారు. ఇక్కడ ఇరు రాష్ట్రాల సంయుక్త సమావేశం జరుగుతుంది. ఆ తరువాత విజయవాడలో సమావేశమవుతాం. రెండు రాష్ట్రాల్లో ప్రతి అంగుళానికీ నీరు అందిస్తాం.

ఆంధ్రప్రదేశ్‌తో స్నేహం కలకాలం సాగాలి. విభజన సజావుగా సాగకుండా కొన్ని పార్టీలు చేసిన కుట్రల వల్ల రెండు రాష్ట్రాల మధ్య వైషమ్యాలు ఏర్పడ్డాయి. అదో పీడకల. జగన్‌ అధికారంలోకి రావడంతో  తెలుగు రాష్ట్రాల మధ్య స్నేహ సౌరభాలు విరజిమ్ముతున్నాయి. ఏపీ, తెలంగాణ పరస్పర సహకారంతో గొప్ప అభివృద్ధిని సాధిస్తాయి. గతంలో ఎన్నడూ చూడని మంచి ఫలితాలను అన్ని రంగాల్లో సాధిస్తాం.

 

తెలంగాణ ప్రాజెక్టుల నిర్మాణంలో అహోరాత్రులు పనిచేశాను. ఈ పనులపై అనుమానం ఉన్నోడిని దూకి చావమనండి. కొంతమంది ఏం తెలీకుండా మాట్లాడుతున్నారు. వాళ్లనేం చేస్తాం! 90 మీటర్ల బెడ్‌ నుంచి తొలిదశలో 75 టీఎంసీల నీరు 148 మీటర్ల ఎత్తుకు ఎల్లంపలికి వస్తాయి. అక్కడి నుంచి 318 టీఎంసీలు మళ్లీ ఎత్తిపోతల ద్వారా తెస్తున్నాం. దీని వల్ల 25 లక్షల ఎకరాలు సాగులోకి వస్తాయి. ఈ ప్రాజెక్టులపై చాలామంది అపోహలు సృష్టిస్తున్నారు. నేరుగా 600 మీటర్ల ఎత్తుకు నీరు ఎత్తిపోస్తున్నట్లు చెబుతున్నారు. ఇది బహుళార్థ సాధక ప్రాజెక్టు. ప్రకృతిపరంగా తెలంగాణకు నీరు దిగువన ఉన్నందున మనం ఎత్తిపోయాల్సిందే.

-సీఎం కేసీఆర్‌

అయిదువేల టీఎంసీల నీటితో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలలోని ప్రతీ అంగుళానికి నీరందేలా చూడాలని తెలంగాణ మంత్రిమండలి తీర్మానించింది. రెండు రాష్ట్రాల పరస్పర సహకారంతో ఆ లక్ష్యాన్ని సాధించేందుకు కృషి చేస్తామని ప్రకటించింది.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన మంగళవారం జరిగిన మంత్రిమండలి సమావేశంలో ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. పలువురు మంత్రులతో కలిసి కేసీఆర్‌ ఈ వివరాలను విలేకరులకు వెల్లడించారు. యావత్‌ తెలుగు ప్రజానీకానికి మంచి జరగాలని మంత్రివర్గం ఏకగ్రీవంగా భావించిందని తెలిపారు. ఉద్యోగులకు త్వరలో ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని, ఎన్నికల ప్రణాళికలో హామీ ఇచ్చిన విధంగానే పదవీ విరమణ వయసు పెంచుతామని, పీఆర్‌సీని ప్రకటిస్తామని తెలిపారు. దీనిపై మంత్రిమండలి ఉపసంఘాన్ని నియమిస్తున్నామన్నారు. జులైలో పురపాలక ఎన్నికలు జరుపుతామని ప్రకటించారు. ప్రస్తుతం ఉన్న స్థలంలోనే కొత్త సచివాలయ నిర్మాణానికి ఈనెల 27న భూమి పూజ చేస్తామని, ఎర్రమంజిల్‌లో కొత్త శాసనసభ భవన సముదాయాలను నిర్మిస్తామని చెప్పారు. వీటికి రూ. 500 కోట్లను వెచ్చిస్తామన్నారు.

2020 నాటికి అన్ని పనులు పూర్తి
‘‘ప్రపంచమే అబ్బురపడుతున్న కాళేశ్వరం ప్రాజెక్టు 2020 నాటికి పూర్తవుతుంది. ప్రాజెక్టులో కొన్ని పనులు కావాల్సి ఉంది. ప్రస్తుతం జరుగుతున్నది ప్రారంభం మాత్రమే. నీళ్లు జులైలో వస్తాయి. ఈనెల తప్పితే మళ్లీ మంచిరోజులు లేవనే ఇప్పుడు ప్రారంభం చేస్తున్నాం. ఇంత వేగంగా పనులు జరగడానికి మహారాష్ట్ర సహకారం ఎంతో గొప్పది. ఆ రాష్ట్రానికి చెందిన 15,000 ఎకరాలను చాలా ఉదారంగా ఇప్పించారు. పక్క రాష్ట్రంలో స్నేహ పూర్వకంగా ఉండటం వల్ల ఇంత సులభంగా పనులు జరిగాయి. తెలంగాణ ఏర్పడకముందు అప్పటి ఉమ్మడి ఏపీకి మహారాష్ట్ర, కర్ణాటకలతో అంతులేని తగదాలు, కోర్టు గొడవలు ఉండేవి. తెలంగాణ వచ్చాక ఇరు రాష్ట్రాలతో మంచి సంబంధాలు కొనసాగిస్తున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి 45 లక్షల ఎకరాలకు 2 పంటలకూ నీరు అందుతుంది. రాష్ట్ర పారిశ్రామిక అవసరాలకు సరిపోను నీరు వస్తుంది.

కాళేశ్వరం ఏర్పాట్లకు ఈటల సమన్వయం
కాళేశ్వరం ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు సాగుతున్నాయి. మంత్రి ఈటల రాజేందర్‌ సమన్వయం చేస్తారు. ఐదు పంపింగ్‌ స్టేషన్ల వద్ద మంత్రులుంటారు. ఆ సమయానికి అక్కడ వారు పూజలు చేస్తారు. మేడిగడ్డ వద్ద నేను ప్రారంభిస్తాను. హోమం చేస్తాం. కన్నెపల్లి పంపునకు కూడా పూజ చేసి స్విచ్‌ ఆన్‌ చేస్తాం. ఉదయం 8కి హోమం ప్రారంభం. ప్రాజెక్టు నిరాటంకంగా పూర్తిచేశాం. చాలా ధైర్యంగా ముందుకెళ్లాం. 20 బ్యాంకుల వారు కన్సార్షియం పెట్టి సాయం చేశారు. వారందరినీ పిలుస్తున్నాం. 5 హెలికాప్టర్లు వాడుతున్నాం. ఆ రాష్ట్ర హెలికాప్టర్లను జగన్‌ తెచ్చుకుంటారు. ఆరు హెలిపాడ్లు సిద్ధం చేశాం. అక్కడ సభ పెట్టడం లేదు.

కొత్త సచివాలయం, కొత్త శాసనసభ
తెలంగాణకు కొత్త సచివాలయం, శాసనసభ నిర్మిస్తాం. ఇప్పుడున్నచోటే సచివాలయం నిర్మించాలని నిర్ణయించాం. 5 నుంచి 6 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం ఉంటుంది. రూ.400 కోట్లు ఖర్చవుతుంది. సచివాలయంలో ఇప్పుడున్న భవనాల్లో మొత్తం అన్నింటినీ కూలగొట్టాలా, కొన్ని అలాగే వినియోగించుకోవాలా అని యోచిస్తున్నాం. దేశవ్యాప్తంగా పలువురు ఆర్కిటెక్చర్లు మంచిమంచి డిజైన్లు పంపుతున్నారు. వాటిని పరిశీలిస్తున్నాం. ఈనెల 27న భూమి పూజ చేస్తాం. ఆర్‌ అండ్‌ బి మంత్రి అధ్యక్షతన ఉప కమిటీ ఏర్పాటు చేస్తాం. మొత్తం కూలగొట్టాలా కొన్ని ఉంచుకుని కూడా కట్టుకోవాలా ఈఎన్‌సీతో మాట్లాడి ఒక నిర్ణయానికి రమ్మని చెప్పాం. ఈ కమిటీ నివేదికపై తుది నిర్ణయం సీఎం తీసుకునే అధికారం మంత్రివర్గం ఇచ్చింది. కొత్త సచివాలయం కట్టేవరకు అక్కడి కార్యాలయాలను తరలించాలా? వద్దా? తరలించాలంటే ఎక్కడికి తరలించాలి అనే అంశంపై మంత్రివర్గ ఉపకమిటీ నిర్ణయిస్తుంది. ఎర్రమంజిల్‌లోని 17 ఎకరాల్లో శాసనసభ నిర్మిస్తాం. దీనికి రూ. 100 కోట్లవుతుంది. పార్లమెంటు భవన సముదాయంలా సెంట్రల్‌ హాలు, శాసనసభ, మండలి ఉంటాయి. ప్రస్తుత అసెంబ్లీ భవనాన్ని వీలైనన్ని రోజులు యథాతథంగా పరిరక్షిస్తాం.

ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన మాట తప్పం
ప్రభుత్వ ఉద్యోగులు పీఆర్‌సీ పెంపుకోసం ఎదురుచూస్తున్నారు. ఎన్నికల సందర్భంగా పదవీ విరమణ వయసు 61 ఏళ్లకు పెంచుతామని వాగ్దానం చేశాం. ఇవి తప్పనిసరిగా చేస్తాం. ఎప్పటి నుంచి, ఎంత పెంచాలనేది ఉద్యోగ సంఘాలతో మాట్లాడి నిర్ణయిస్తాం. ఈ రెండూ కలిపి ఒకటే ప్యాకేజీ కింద ఇస్తాం. రాష్ట్రానికి ఉన్న ఆర్థిక పరిమితులు వారికి చెప్పి నిర్ణయం తీసుకుంటాం. నూతన పంచాయతీ రాజ్‌ చట్టాన్ని సమర్థంగా అమలు చేయాలని నిర్ణయించాం. జడ్పీలకు చాలామంది విద్యావంతులు వచ్చారు. వారికి కొన్ని అధికారాలు, నిధులు సమకూర్చాలని చర్చించాం. కమిటీ వేసి అమలు చేస్తాం.

శారదా పీఠానికి 2 ఎకరాలు
దర్శకుడు ఎన్‌.శంకర్‌ స్టూడియోకు మోకిల గ్రామంలో ఎకరానికి రూ. 5 లక్షల చొప్పున 5 ఎకరాల స్థలం కేటాయింపు. ఆయన ఉద్యమంలో భాగస్వామి. శారదా పీఠం ట్రస్టుకు సంస్కృత పాఠశాల కోసం 2 ఎకరాలను ఇచ్చాం. తెరాస పార్టీ ఆఫీసుల నిర్మాణం కోసం 30 జిల్లాల్లో స్థలాలు కేటాయించాం. హైదరాబాద్‌లో స్థలం పెండింగులో ఉంది. రేపు పార్టీ సమావేశంలో దీనిపై చర్చిస్తాం.

కేంద్రంతో రాజ్యాంగబద్ధమైన సంబంధాలు
రాష్ట్రంలో జరిగే ప్రతీదానికి ప్రధానిని ఆహ్వానించాల్సిన అవసరం లేదు. అప్పుడు మిషన్‌ భగీరథ ప్రారంభానికి పిలిచాం. కేంద్రంతో రాజ్యాంగబద్ధమైన సంబంధాలు కొనసాగుతాయి. గతంలో మాకు నచ్చిన చోట కేంద్రానికి మద్దతు ఇచ్చాం. నచ్చని చోట గట్టిగా ఆడిగాం. మోదీ ప్రధానమంత్రి అయ్యాక అతి కఠినంగా విమర్శించిన సీఎంను నేను. ఏడు మండలాలను ఇచ్చినప్పుడు ఫాసిస్ట్‌ పీఎం అని చెప్పా. కేంద్రం నుంచి ఒక్క రూపాయి కూడా అదనంగా రాలేదు. నీతి ఆయోగ్‌ మిషన్‌ కాకతీయ, భగీరథకు రూ.24 వేల కోట్లు ఇవ్వమంటే కేంద్రం రూ. 24 కూడా ఇవ్వలేదు. ఏటా 450 కోట్లు బీఆర్‌జీఎఫ్‌ కింద ఇవ్వాలి. కానీ ఒక సంవత్సరం ఇచ్చి తరవాత ఇవ్వలేదు. .అన్ని రికార్డులు ఉన్నాయి. ప్రాజెక్ట్‌లకు కేంద్రం ఇవ్వాల్సిన అనుమతులు ఇవ్వాల్సిందే.

పరస్పర సహకారం ఉండాలి
నీటి వినియోగంలో ఉమ్మడి రాష్ట్రంలో రెండు పార్టీల ప్రభుత్వాలూ ఘోరంగా విఫలమయ్యాయి. 2004లో నియమించిన బ్రిజేష్‌ కుమార్‌ ట్రైబ్యునల్‌ 2019 వరకూ తీర్పు చెప్పలేదు. ఇక ప్రాజెక్టులకు అనుమతులు ఎప్పుడొస్తాయి.. ఎప్పుడు కట్టాలి? మనం ఇద్దరం ఒకమాట అనుకుంటే పంచాయితీ తీరిపోతుంది అని చెప్పా. దానికి వారు అంగీకరించారు. ముంబయి వెళ్లినప్పుడు మహారాష్ట్ర సీఎం తమకు పక్కనే ఉన్న గుజరాత్‌ సీఎం తమ పార్టీ వాడే అయినా ప్రాజెక్టుల కోసం సహకరించడం లేదని.. తెలంగాణను చూసి నేర్చుకోమని చెప్పానని అన్నారు. జమిలి ఎన్నికలపై దిల్లీలో కేంద్రం నిర్వహిస్తున్న సమావేశానికి తెరాస తరఫున కేటీఆర్‌ హాజరవుతారు.

కిషన్‌రెడ్డివి అవగాహన లేని మాటలు
హైదరాబాద్‌పై కిషన్‌రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలు అవగాహనరాహిత్యంతో చేసినవి. ఆయన మాటలను చూసి జనం నవ్వుకుంటున్నారు. రాష్ట్ర చరిత్ర తిరగేసి చూద్దాం. ఏటా 10 నుంచి 12 సార్లు మతకల్లోలాలు జరిగేవి. గత ఐదేళ్లలో బాగా తగ్గాయి. ఇది ఉగ్రవాదుల అడ్డా అని బాధ్యత గల వ్యక్తులు మాట్లాడకూడదు. ఇంత శాంతిభద్రతలు గల ప్రాంతం మరే రాష్ట్రంలోనూ లేదు.

టీఆర్‌టీ సమస్య పరిష్కారమైంది
టీఆర్‌టీ సమస్య పరిష్కారమైంది. అయినా కొంతమంది అనవసరంగా ధర్నాలు చేస్తున్నారు. ఇలాంటి వాటి వల్ల ప్రయోజనం లేదు’’ అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ వివరించారు.

కేంద్రం ఒక్క రూపాయీ ఇవ్వలేదు

ఒక్క రూపాయి కూడా కేంద్రం సహకరించలేదు. రాష్ట్రం సొంత నిధులు, బ్యాంకుల ద్వారా నిధులు సేకరించడం కూడా సామాన్యం కాదు. వాణిజ్య బ్యాంకులు ఉదారంగా ఇచ్చాయి. అవి సాధారణంగా ఇవ్వవు. వారిని ఒకరోజు ముందే రమ్మని చెప్పాం. 17 సబ్‌స్టేషన్లు భారీ కట్టాం. నేను గతంలో మంత్రిగా చేశాను. పదేళ్లలో 400 కేవీ సబ్‌స్టేషన్‌ కట్టలేకపోయేవారు. దేశంలో అన్ని రంగాలకు 24 గంటల కరెంటు సరఫరా చేస్తున్న ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ. రాష్ట్రంలో బిందెల ప్రదర్శన లేదని చెబుతున్నాం. జులై ఆఖరుకల్లా భగీరథ పూర్తవుతుంది. సీతారామ, దేవాదుల కూడా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఆఖరుకు పూర్తిచేస్తాం. కాళేశ్వరం తరవాత పాలమూరు ఎత్తిపోతలను పరుగులు పెట్టిస్తాం. విద్యుత్‌, మంచినీటి సమస్యలు లేవు. ఏడాదిన్నర తరవాత సాగునీటి సమస్య కూడా ఉండదు.

ప్రతిపక్షాల అవాకులు, చెవాకులు

కొన్ని పార్టీల నేతలు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. ఏ సందర్భంలో ఏం మాట్లాడతారనే విజ్ఞత నాయకులకు ఉండాలి. రెండు పంటలకు నీరు ఇచ్చినా మరీ బుద్ధి లేకుండా ప్రజల దృష్టి మరల్చడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడే ఎన్నికలు వస్తున్నట్లు పిచ్చిపిచ్చిగా మాట్లాడటం మంచిది కాదు. 45 లక్షల ఎకరాలకు నీరు.. 85 శాతం పారిశ్రామిక అవసరాలకు నీరిచ్చే ప్రపంచంలోని అతి పెద్ద బహుళ దశల ఎత్తిపోతల పథకం కాశేశ్వరం. ఇంత భారీగా ఖర్చు చేసి చాలా తక్కువ సమయంలో పూర్తి చేశాం. దీనిపై 200 పైచిలుకు కోర్టు కేసులు వేశారు. ఎవరేం మాట్లాడినా ఇప్పుడు అయిపోయింది. నాణ్యమైన విద్యుత్‌ అందిస్తాం అన్నాం.. అందించాం. రాష్ట్రంలో బిందెలు ఎక్కడా కనిపించవు అన్నాం.. అదీ అయిపోయింది. ఇక కోటి పైచిలుకు ఎకరాలకు నీళ్లు అంధించేందుకు ప్రాజెక్ట్‌ నిర్మాణం సాగుతోంది.

తెలుగు ప్రజలకు శుభవార్త

తెలుగు రాష్ట్రాలకు గోదావరిలో 1,480 టీఎంసీలు, కృష్ణాలో 811 టీఎంసీల నీటి కేటాయింపులున్నాయి. వీటికి తోడు మిగులు జలాలు మొత్తం మీరే వాడుకోవచ్చని బచావత్‌ ట్రైబ్యునల్‌లో స్పష్టంగా చెప్పారు. గత 50 ఏళ్ల సీడబ్ల్యూసీ రికార్డులు పరిశీలిస్తే 3,500 టీఎంసీలు నీరు సముద్రంలోకి పోతున్నట్లు తెలుస్తుంది. కృష్ణలో నీరు శ్రీశైలంలో 1,200 టీఎంసీలు వస్తున్నాయి. మొత్తం 4,700 టీఎంసీల నీరు రెండు రాష్ట్రాలు పుష్కలంగా వాడుకోడానికి అవకాశం ఉంది. ఇంతకుముందు కయ్యం, కీచులాటులు పెట్టుకుని తెలుగు ప్రజలు నష్టపోయారు. స్నేహపూర్వక మార్గమే చాలా మంచిది. రాష్ట్రానికి అందుబాటులో ఉన్న సుమారు 5,000 టీఎంసీల నీటిని తెలుగు రాష్ట్రాల్లోని ప్రతీ అంగుళానికి తీసుకెళ్లాలి. ఉభయుల పరస్పర సహకారం, కృషితో తీసుకెళ్లాలి. 2, 3 నెలల్లో ప్రజలకు ఫలితాలు చూపిస్తాం. విభజనకు సంబంధించిన అనేక అంశాలతో సహా పరస్పరం సహకరించుకోవాల్సినవి అనేక అంశాలుంటాయి. విపత్తులు, శాంతిభద్రతలు... ఇలా చాలా విషయాలలో ఇరుగుపొరుగు సఖ్యతగా ఉంటే ముందుకు సాగుతాం. గతంలో ఎప్పుడూ చూడని మంచి ఫలితాలు చూపిస్తాం. యావత్తూ తెలుగు ప్రజానీకానికి మంచి జరగాలని మంత్రివర్గం ఏకగ్రీవంగా భావించిందని రెండు రాష్ట్రాల ప్రజలకు తెలియజేస్తున్నాం.

వచ్చేనెలలో పురపాలక ఎన్నికలు

15 రోజుల్లో రిజర్వేషన్లు పూర్తిచేసి మున్సిపల్‌ ఎన్నికలు జులైలోనే ముగించేస్తాం. కొత్త మున్సిపల్‌ చట్టం తేవాలని ఆలోచిస్తున్నాం.

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.