close
పీసీసీ అధ్యక్షుడిని మార్చేది లేదు

 కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు కుంతియా స్పష్టీకరణ

హైదరాబాద్‌, న్యూస్‌టుడే: తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడిగా ఉత్తమ్‌కుమార్‌ రెడ్డే కొనసాగుతారని కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు రామచంద్ర కుంతియా ప్రకటించారు. కొద్దిరోజులుగా పీసీసీ అధ్యక్షుని మార్పుపై ఊహాగానాలు వినిపిస్తున్నాయని.. ఈ విషయంలో ఎలాంటి అపోహలకు తావులేదని స్పష్టం చేశారు. గతంలో జరిగిన పొరపాట్లను సరిదిద్దుకుంటామని, జరగబోయే మున్సిపల్‌ ఎన్నికలను సమర్ధంగా ఎదుర్కొనేందుకు పార్టీ శ్రేణులను ఇప్పటి నుంచే సమాయత్తం చేయాలని నిర్ణయించామని పేర్కొన్నారు. టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్‌, ఏఐసీసీ ఇన్‌ఛార్జి కార్యదర్శి బోసురాజు, ఏఐసీసీ కార్యదర్శులు సంపత్‌కుమార్‌, వంశీచంద్‌రెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బొల్లు కిషన్‌ తదితరులతో కలిసి రామచంద్ర కుంతియా సోమవారం గాంధీభవన్‌లో మాట్లాడారు. ఆదివారం రాత్రి జరిగిన టీపీసీసీ కోర్‌కమిటీ సమావేశంలో తీసుకున్న పలు నిర్ణయాలను కుంతియా మీడియాకు వెల్లడించారు.

ప్రతి నెలా జిల్లా, మండల, బ్లాక్‌ కాంగ్రెస్‌ కమిటీ సమావేశాలు

గత ఎన్నికల్లో పార్టీ ఓటమికి కారణాలను క్షేత్రస్థాయి నుంచి తెప్పించుకుని.. సరిదిద్దుకుంటామని కుంతియా పేర్కొన్నారు. ప్రతినెలా 1, 2, 3 తేదీల్లో జిల్లా మండల, బ్లాక్‌ కాంగ్రెస్‌ కమిటీల సమావేశాలు విధిగా నిర్వహించాలని నిర్ణయించామన్నారు. ఏఐసీసీ అధ్యక్షుడిగా రాహుల్‌గాంధీనే కొనసాగాలని ఏకగీవ్రంగా తీర్మానించామన్నారు. మున్సిపల్‌ ఎన్నికలను ఎదుర్కొనేందుకు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ నేతృత్వంలో కమిటీ వేశామన్నారు. 29న నాగార్జునసాగర్‌లో టీపీసీసీ కార్యవర్గ సమావేశం నిర్వహిస్తున్నామన్నారు. మున్సిపల్‌ ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని కోర్‌కమిటీ సమావేశంలో తీర్మానించామని ఆయన చెప్పారు.

ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డిపై చర్యలుంటాయ్‌

ఏఐసీసీ, టీపీసీసీ నాయకత్వంపైనా, నాయకులపైన అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకునే విషయాన్ని పార్టీ అధిష్ఠానం సీరియస్‌గా తీసుకుంటుందని కుంతియా తెలిపారు. క్రమశిక్షణ సంఘం నోటీసు ఇచ్చిన తర్వాత కూడా రాజగోపాల్‌రెడ్డి తీరులో ఎలాంటి మార్పు రావడం లేదన్నారు. ఆయన ఎమ్మెల్సీ పదవీకాలం పూర్తికాకున్నా ఎమ్మెల్యే టికెట్‌ ఇచ్చామని, భార్యకు ఎమ్మెల్సీ టికెట్‌, వెంకట్‌రెడ్డి ఎమ్మెల్యేగా ఓడిపోయినా ఎంపీ టికెట్‌ ఇచ్చామని, మొదటి నుంచి పార్టీ రాజగోపాల్‌ కుటుంబానికి ఎంతో గౌరవం ఇస్తూ వచ్చిందని స్పష్టం చేశారు. క్రమశిక్షణ సంఘం వివరణ కోసం ఇచ్చిన గడువు పూర్తయిన తర్వాత చర్యలు తీసుకుంటామన్నారు. స్వలాభం కోసం పార్టీని వీడేవారిని ఆపడం కష్టమని.. కొందరు పార్టీని వీడినంత మాత్రాన కాంగ్రెస్‌కు వచ్చే నష్టమేమీలేదని కుంతియా అన్నారు.

టీపీసీసీ అధ్యక్ష పదవి రేసులో ఉన్నా: జగ్గారెడ్డి

హైదరాబాద్‌, న్యూస్‌టుడే: టీపీసీసీ అధ్యక్ష పదవి రేసులో తాను కూడా ఉన్నట్లు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి తెలిపారు. మున్సిపల్‌ ఎన్నికలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలోనే జరగాలని, ఇంకా ఏడాది పాటు ఆయననే టీపీసీసీ అధ్యక్షుడిగా కొనసాగించాలని పార్టీ రాష్ట్ర ఇన్‌ఛార్జీ కుంతియాను కోరినట్లు పేర్కొన్నారు. ఒకవేళ ఉత్తమ్‌ను మార్చాల్సి వస్తే... తన పేరును అధ్యక్ష పదవికి పరిశీలించాలని విజ్ఞప్తి చేశానన్నారు. జగ్గారెడ్డి సోమవారం గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడారు. కొత్త పీసీసీ కంటే ముందు రానున్న మున్సిపల్‌ ఎన్నికలు కాంగ్రెస్‌కు చాలా ముఖ్యమని... పార్టీ శ్రేణులను ఇప్పటి నుంచే సమాయత్తం చేయాలన్నారు. పుర ఎన్నికల్లో తెరాసకు గట్టి పోటీ ఇస్తామని.. 50 శాతం వరకు సీట్లు గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. తనకు అధ్యక్ష పగ్గాలు అప్పగిస్తే నాయకులందరినీ ఏకతాటిపైకి తీసుకువచ్చి పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని జగ్గారెడ్డి పేర్కొన్నారు.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.