close
యాజమాన్యాల వారీగానే పదోన్నతులు! 

ఎస్‌జీటీల నుంచి స్కూల్‌ అసిస్టెంట్ల వరకే 
కొత్త జిల్లాల ప్రకారం చేయాల్సిందే 
రాష్ట్రప్రభుత్వం ప్రాథమిక నిర్ణయం

ఈనాడు, హైదరాబాద్‌: ప్రభుత్వ, పంచాయతీరాజ్‌ పాఠశాలల వారీగా ఉపాధ్యాయులకు పదోన్నతులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. సెకండరీ గ్రేడ్‌ టీచర్ల(ఎస్‌జీటీ) నుంచి స్కూల్‌ అసిసెంట్ల వరకే ఈ పదోన్నతులు ఉండనున్నాయి. ఈ ప్రక్రియపై విద్యాశాఖ, న్యాయ, సాధారణ పరిపాలనశాఖ అధికారులు మంగళవారం సమావేశమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి సమక్షంలో జరిగిన సమావేశంలో పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ విజయకుమార్‌, సమగ్ర శిక్షా అభియాన్‌ సహాయ రాష్ట్ర ప్రాజెక్టు అధికారి(ఏఎస్‌పీడీ) శ్రీహరి తదితర అధికారులు చర్చించారు. ఏకీకృత సర్వీసు నిబంధనలపై అవగాహన ఉన్న, లోతుపాతులు తెలిసిన పాఠశాల విద్యాశాఖలో అదనపు సంచాలకుడిగా పనిచేసి పదవీ విరమణ పొందిన వీరభద్రారెడ్డిని కూడా ఆహ్వానించారు. 
ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే వారికి ఆ సీనియారిటీ ప్రకారం పదోన్నతులు కల్పించాలని, అదేవిధంగా పంచాయతీరాజ్‌ పాఠశాలలకు ఇవ్వాలని ప్రాథమికంగా నిర్ణయానికి వచ్చారు. అందుకు ఉపాధ్యాయ సంఘాలు అభ్యంతరం చెప్పడం లేదని, సమస్యలు ఉండవని చర్చించారు. ఎస్‌జీటీ నుంచి స్కూల్‌ అసిస్టెంట్ల(ఎస్‌ఏ) వరకు పదోన్నతులు ఇవ్వాలని నిర్ణయించారు. అది జిల్లా కేడర్‌ కాబట్టి పదోన్నతులు ఇవ్వడానికి సమస్య ఉండదన్న అభిప్రాయానికి వచ్చారు. స్కూల్‌ అసిస్టెంట్ల నుంచి ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతులు ఇవ్వాలంటే అది జోనల్‌ పోస్టు అవుతుందని, అప్పుడు కొత్తగా ఏర్పాటైన ములుగు, నారాయణపేట జిల్లాలు ఏ జోన్‌లోకి వస్తాయన్న దానిపై ఉత్తర్వులు లేనందున న్యాయపరమైన సమస్య తలెత్తుతుందన్నారు. దానిపై రాష్ట్రపతి ఉత్తర్వులకు సవరణ ఉత్తర్వులు తెచ్చుకోవాల్సి ఉంటుందని చర్చ సాగింది. స్కూల్‌ అసిస్టెంట్ల వరకే పదోన్నతులు ఇస్తే చాలా తక్కువ మందికి ప్రయోజనం కలుగుతుందని, అసలైన పర్యవేక్షణాధికారుల సమస్య తీరదని కొందరు అభిప్రాయపడుతున్నారు. 
గత ఉపాధ్యాయ బదిలీల సందర్భంగా మేడ్చల్‌ జిల్లాకు చెందిన కొందరు హైకోర్టును ఆశ్రయించినప్పుడు బదిలీలు పాత జిల్లాల వారీగా, పదోన్నతులను మాత్రం కొత్త జిల్లాల వారీగా చేయాలని హైకోర్టు తీర్పు వెలువరించింది. ఆ ప్రకారమే పదోన్నతులు ఇవ్వాలని నిర్ణయానికి వచ్చారు. అయితే ఈ ప్రక్రియకు చాలా సమయం పట్టే అవకాశముందని అంచనా వేస్తున్నారు. మొదట ఎవరే జిల్లాకు చెందినవారో గుర్తించాలి. కొన్ని కొలమానాల ప్రకారం చేయాలి. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జోషి సైతం కొత్త జిల్లాల వారీగా కేడర్‌ వివరాలు రూపొందించడానికి కసరత్తు చేయాలని విద్యాశాఖ అధికారులకు సూచించినట్లు సమాచారం.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.