
ఇసుక దోపిడీని అడ్డుకోగలిగారా?
రాజధానికి భూములివ్వని రైతులపై తప్పుడు కేసులెలా పెట్టారు?
ఇప్పుడు కలిసి పనిచేసి మార్పు తెద్దాం
ఎస్పీలకు ఏపీ సీఎం ఆదేశం
ఈనాడు, అమరావతి: గత ప్రభుత్వ హయాంలో మన కళ్లముందే ఇసుక దోపిడీ, అక్రమ మైనింగ్, పేకాట క్లబ్బుల నిర్వహణ, ఎమ్మెల్యేల అక్రమ వసూళ్లు, రాజధానికి భూములివ్వని రైతులపై తప్పుడు కేసులు, వేధింపుల వంటివి అనేకం చోటుచేసుకున్నాయని, అగ్రగామి పోలీసింగ్ అంటే వాటన్నింటినీ చూస్తూ ఊరుకోవడమేనా? అని పోలీసు ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ప్రశ్నించారు. సుపరిపాలన, అత్యుత్తమ ఆచరణ అంటే ఇదేనా? అని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలపై పోలీసు ఉన్నతాధికారులు, ఎస్పీలతో ఉండవల్లిలోని ప్రజావేదికలో మంగళవారం ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారినుద్దేశించి మాట్లాడారు. ‘దేశంలో మనదే అగ్రగామి పోలీసింగ్ అంటాం. కానీ గత ప్రభుత్వ హయాంలో ఇసుక మాఫియా యథేచ్చగా చెలరేగిపోయింది. అప్పటి ముఖ్యమంత్రి ఇంటి పక్కనే పొక్లెయిన్లతో ఇసుక తవ్వకాలు జరిగేవి. నిత్యం వందలాది లారీల్లో ఇసుక అక్రమంగా తరలేది. పశ్చిమగోదావరి జిల్లాలో ఇసుక మాఫియాను అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఓ మహిళా తహసీల్దార్‌ను జుట్టు పట్టుకుని అప్పటి ఎమ్మెల్యే ఈడ్చారు. రాష్ట్రవ్యాప్తంగా ఇసుకను దోచుకున్నారు. గుంటూరు జిల్లాలో అక్రమ మైనింగ్ పెద్ద ఎత్తున సాగింది. పేకాట క్లబ్బుల నిర్వహణలో ఎమ్మెల్యేలు భాగస్వాములయ్యారు. రాజధాని కోసం భూ సమీకరణలో భూములివ్వని రైతులను తప్పుడు కేసులతో తీవ్రంగా వేధించారు. ఫలితంగా రాజధాని పరిధిలో 11 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. విజయవాడలో కాల్‌మనీ సెక్స్ రాకెట్‌తో మహిళలను వేధించారు. ఇంత తీవ్రమైన నేరంపై ఎన్ని కేసులు నమోదు చేశారు? ఎంత మందిని అరెస్టు చేశారు? అత్యుత్తమ పోలీసింగ్ అంటే ఇదేనా?’ అని జగన్ ప్రశ్నించారు. బాధ్యతాయుతంగా పని చేయండి. ఈ అంశంలో నేను మీతో ఉంటా. మీ కోసం ఏదైనా చేస్తా. అందరం కలిసి పనిచేసి వ్యవస్థలో మార్పు తీసుకొద్దాం’ అని సూచించారు.
ప్రజావేదికతోనే అక్రమ నిర్మాణాల కూల్చివేత ప్రారంభం
కృష్ణా నది కరకట్ట లోపలి భాగంలో నిర్మించిన ప్రజావేదిక భవనంతోనే అక్రమ నిర్మాణాల కూల్చివేతను మొదలు పెడతామని, ఆ తర్వాత ఉండవల్లి కరకట్ట రోడ్డును ఆనుకుని ఉన్న అక్రమ నిర్మాణాలనూ తొలగిస్తామని ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఎస్పీల సమావేశంలో ప్రకటించారు. ‘ముఖ్యమంత్రో, కలెక్టరో, ఎస్పీయో అని చెప్పి అక్రమ నిర్మాణాలు చేపట్టడం సరైనదేనా? బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉన్నవారే తప్పు చేసినప్పుడు ఇతరులను ప్రశ్నించే నైతికత ఎక్కడ నుంచి వస్తుంది? అందుకే ప్రజావేదిక భవనంతోనే అక్రమ నిర్మాణాల కూల్చివేత ప్రారంభిస్తాం’ అని అన్నారు.