close
డి-బ్లాక్‌ వెనుక భాగంలో సీఎం కార్యాలయం? 

అక్కడే కొత్త సచివాలయ శంకుస్థాపనకు ఏర్పాట్లు 
రేపు ఉదయం 11 గంటలకు ముహూర్తం

ఈనాడు, హైదరాబాద్‌: నూతన సచివాలయ భవనం సరికొత్త రూపురేఖలను సంతరించుకోనుంది. ప్రస్తుతం సీఎం కార్యాలయం సమతా బ్లాక్‌లో ఉండగా... కొత్త సచివాలయంలో దాన్ని డి-బ్లాక్‌ వెనుక నిర్మించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సచివాలయం కొత్త భవన నిర్మాణాలకు డీ బ్లాక్‌ వెనుక భాగంలో పోర్టికో ఎదురుగా ఉన్న గార్డెన్‌లో శంకుస్థాపన చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సాధారణంగా శంకుస్థాపన స్థలాన్ని విశేషమైనదిగా భావిస్తారు. నిర్మాణంలో అది కీలక స్థానంలో ఉంటుంది. వాస్తు నిపుణుడు సచివాలయం మొత్తాన్ని పరిశీలించి చివరికి డి-బ్లాక్‌ వెనుక గల తోట స్థలాన్ని ఎంపిక చేశారు. గురువారం ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేతుల మీదుగా భూమి పూజ జరుగుతుంది. సీఎంతోపాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీఎస్‌ ఎస్‌కే జోషి, డీజీపీ మహేందర్‌రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. 
సచివాలయ నిర్మాణంలో భాగంగా శంకుస్థాపన కోసం పలు స్థలాలను అన్వేషించారు. చివరికి వాస్తు నిపుణుడి సలహాతో డి-బ్లాక్‌ వెనుక గల స్థలాన్ని గుర్తించారు. అక్కడ శంకుస్థాపనకు రోడ్లు భవనాల శాఖ అధికారులు మంగళవారం గుంత తీయించారు. పోలీసు ఉన్నతాధికారులు చౌహాన్‌ తదితరులు ఈ ఏర్పాట్లను పరిశీలించారు. సుమారు నాలుగు లక్షల చదరపు అడుగులలో భవనాలు నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది. శంకుస్థాపన చేయనున్న స్థలం డి-బ్లాక్‌ గోడను ఆనుకొని ఉంది. దానికి వెనుక భాగంలోని విద్యుత్‌ కార్యాలయాలు, మింట్‌ కాంపౌడ్‌, ఉద్యోగ కార్యాలయాలు ఉన్నాయి. ఆయా భవనాలను కూడా స్వాధీనం చేసుకొని, సచివాలయ పరిధిని విస్తరించి, చతురస్రాకారంలో తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. 
మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటుపై ఉత్తర్వులు 
కొత్త సచివాలయం, శాసనసభ నిర్మాణం కోసం రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అధ్యక్షతన మంత్రులు కొప్పుల ఈశ్వర్‌, శ్రీనివాస్‌గౌడ్‌లు సభ్యులుగా మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటుపై తాజాగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీనికి రోడ్లు, భవనాల శాఖ ముఖ్యకార్యదర్శి సునీల్‌శర్మ సభ్యకార్యదర్శిగా వ్యవహరిస్తారు. సాధ్యమైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని ఉపసంఘాన్ని ప్రభుత్వం ఆదేశించింది.

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.