close
రైతుల కష్టాలకు కాంగ్రెస్సే కారణం-

కేంద్ర రక్షణ మంత్రి  రాజ్‌నాథ్‌ సింగ్‌ ధ్వజం
లోక్‌సభలో రాహుల్‌ విమర్శలకు దీటుగా స్పందన
ఈనాడు - దిల్లీ

కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం వ్యాపారవేత్తలకు అధిక ప్రాధాన్యమిస్తూ రైతుల సమస్యలను పట్టించుకోవటం లేదన్న కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ విమర్శలను కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ గట్టిగా తిప్పికొట్టారు. దేశంలో రైతుల దుస్థితికి సుదీర్ఘకాలం అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీయే కారణమని ఆయన ఎదురు దాడికి దిగారు. రైతులకు ప్రధాని మోదీ చేసినంత సాయాన్ని ఏ ప్రధాన మంత్రి చేయలేదని గురువారం లోక్‌సభలో శూన్య అవధిలో పేర్కొన్నారు. అంతకు ముందు రాహుల్‌ గాంధీ మాట్లాడుతూ తాను ఇటీవల గెలుపొందిన కేరళలోని వయనాడ్‌ లోక్‌సభ నియోజకవర్గ ప్రాంత రైతుల కష్టాలను సభ దృష్టికి తీసుకొచ్చారు. మోదీ ప్రభుత్వం వ్యాపారవేత్తలకు రూ.4.3లక్షల కోట్ల మేర పన్ను రాయితీలను ఇచ్చిందని, రూ.5.5 లక్షల మేర రుణాలను రద్దు చేసిందని ఆరోపించారు. వ్యాపారవేత్తల కంటే రైతులు తక్కువ స్థాయి వారన్నట్లుగా మోదీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు. దీనికి రాజ్‌నాథ్‌ సింగ్‌ సమాధానమిస్తూ గతంలో ఎన్నడూ లేనివిధంగా తమ ప్రభుత్వం పంటలకు మద్దతు ధరలను ప్రకటించిందని, రైతులకు ఆర్థిక భద్రత చేకూర్చేలా  వారి బ్యాంకు ఖాతాల్లో నగదు జమచేస్తోందని తెలిపారు.

* మోదీ ప్రభుత్వం రైల్వే మంత్రిత్వ శాఖను నిర్వహిస్తున్న తీరును కాంగ్రెస్‌ పార్టీ తప్పుపట్టింది. లోక్‌సభలో ఆ పార్టీ నేత అధీర్‌ రంజన్‌ చౌధురి మాట్లాడుతూ విమానయాన శాఖ మంత్రి ఎయిర్‌ ఇండియాను, రైల్వే మంత్రి రైల్వే ఆస్తులను విక్రయించాలని చూస్తున్నారని ఆరోపించారు. రైల్వేలకు లాభాలను ఆర్జించే యూనిట్లను ప్రైవేటీకరిస్తున్నారని చెబుతూ ఏదోఒక రోజు ప్రధాని మోదీ దేశాన్ని కూడా విక్రయిస్తారంటూ వ్యంగ్యంగా అన్నారు.
* రహదారులపై ప్రమాదాలు అధికంగా జరుగుతున్న ప్రాంతాలను గుర్తించి, అందుకు కారణమవుతున్న లోపాలను సరిదిద్దేందుకు రూ.14వేల కోట్లతో ఓ ప్రాజెక్టును చేపట్టనున్నట్లు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ తెలిపారు.
* స్థిరాస్తి చట్టం రెరాను అనుసరించి గృహాల కొనుగోలుదారుల నుంచి అందిన ఫిర్యాదుల్లో 20,125ని గత నెలాఖరు వరకు పరిష్కరించినట్లు కేంద్ర మంత్రి హరదీప్‌ సింగ్‌ పురి తెలిపారు.
* దేశంలో భూగర్భ జల మట్టం భారీగా పడిపోయిందని, వివిధ అవసరాలకు నిరంతరంగా నీటిని తోడేయటమే ఇందుకు కారణమని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్‌ షెఖావత్‌ తెలిపారు. 1186 ప్రాంతాలను (బ్లాకులు/తాలూకాలు/మండలాలు) భూగర్భ జలాలను మితిమీరి వాడేసిన ప్రాంతాలుగా గుర్తించినట్లు వెల్లడించారు. 17 రాష్ట్రాల పరిధిలో ఇవి ఉన్నాయి.
* ఈ నెల 2వ తేదీ వరకు దేశవ్యాప్తంగా 13000 విద్యా సంస్థలకు మైనార్టీ హోదా మంజూరు చేసినట్లు కేంద్ర మైనార్టీ వ్యవహారాల మంత్రి ముఖ్తర్‌ అబ్బాస్‌ నక్వీ తెలిపారు.

ఆర్థిక ప్రగతికి మార్గసూచీ ఏదీ?: కాంగ్రెస్‌

దేశ ఆర్థికాభివృద్ధిని ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు ఒక స్పష్టమైన మార్గసూచీని కేంద్ర ప్రభుత్వం 2019-20 బడ్జెట్‌లో రూపొందించలేకపోయిందని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ నేత పి.చిదంబరం విమర్శించారు. నిర్మాణాత్మక సంస్కరణలు తీసుకొస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ చెప్పినా అవేంటో వివరించలేదని పేర్కొన్నారు. గురువారం రాజ్యసభలో బడ్జెట్‌పై చర్చను ప్రారంభిస్తూ ఆయన మాట్లాడారు. వచ్చే అయిదేళ్లలో భారత ఆర్థిక వ్యవస్థను 5 ట్రిలియన్‌ డాలర్ల స్థాయికి తీసుకెళ్లడమే తమ లక్ష్యమని బడ్జెట్‌లో ప్రకటించుకోవడాన్ని చిదంబరం ఎద్దేవా చేశారు. ఏటా ఆర్థిక వ్యవస్థ వృద్ధి 12%గా ఉంటే ప్రధాన మంత్రి, ఆర్థిక మంత్రులు ఉన్నా లేకపోయినా మన ఆర్థిక వ్యవస్థ 5 ట్రిలియన్‌ డాలర్ల స్థాయికి చేరుతుందన్నారు. దీనిని చందమామపై దిగినట్లు గొప్పలు చేసి చెప్పడం ఏంటని ప్రశ్నించారు. ప్రతి ఆరేడేళ్లకు ఆర్థిక వ్యవస్థ రెట్టింపవుతుందని చెప్పారు. పూర్తి మెజారిటీ ఉన్న ప్రభుత్వం సాహసోపేత నిర్ణయాలు తీసుకోవటానికి ఎందుకు వెనకాడుతోందని ప్రశ్నించారు. దేశ వృద్ధిరేటు 8% ఉంటుందని బడ్జెట్‌, 7% ఉంటుందని ఆర్థిక సర్వే చెబుతున్నాయి. ఇందులో ఏది వాస్తవం అని చిదంబరం ప్రశ్నించారు.

* సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల నియామకాల విషయంలో పార్లమెంటు చొరవచూపేందుకు వీలు కల్పించేలా నియంత్రణ చట్టాన్ని తీసుకొచ్చే యోచన ఏదీ లేదని కేంద్ర న్యాయశాఖ మంత్రి రవి శంకర్‌ ప్రసాద్‌ రాజ్యసభకు లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో తెలిపారు. కొలీజియం సిఫార్సు చేసిన వారిని న్యాయమూర్తులుగా నియమించటంలో ఎలాంటి వివాదంలేదని ఓ ప్రశ్నకు మంత్రి బదులిచ్చారు. న్యాయస్థానాల్లో అపరిష్కృతంగా ఉన్న వాజ్యాల సంఖ్యను తగ్గించేందుకు న్యాయమూర్తుల పదవీ విరమణ వయస్సును పెంచాలని కోరుతూ ప్రభుత్వానికి భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయి ప్రతిపాదన పంపించారని మంత్రి వెల్లడించారు.

* బడ్జెట్‌లో న్యూస్‌ప్రింట్‌పై కేంద్ర ప్రభుత్వం విధించిన 10శాతం కస్టమ్స్‌ సుంకాన్ని ఉపసంహరించుకోవాలని కేరళకు చెందిన స్వతంత్ర ఎంపీ వీరేంద్ర కుమార్‌ రాజ్యసభలో డిమాండ్‌ చేశారు. 2009 నుంచి న్యూస్‌ప్రింట్‌పై కస్టమ్స్‌ సుంకం విధించటంలేదని గుర్తు చేశారు. పత్రికా రంగం ఆర్థిక ఇబ్బందుల్లో నలిగిపోతున్న ప్రస్తుత సమయంలో సుంకం భారం మోపటం తగదని పేర్కొన్నారు.

* దిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి కార్యాలయం ఉండే నార్త్‌బ్లాక్‌లోకి పాత్రికేయుల ప్రవేశంపై విధించిన ఆంక్షలను ఎత్తివేయాలని కాంగ్రెస్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి కపిల్‌సిబల్‌ రాజ్యసభలో  ప్రభుత్వానికి విజ్ఞప్తిచేశారు.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.