close
మరోసారి రాజీనామా అస్త్రం

సుప్రీం ఆదేశాలతో కర్ణాటకలో అసమ్మతి నేతల సత్వర స్పందన
ఇప్పటికిప్పుడే అంగీకరించలేనన్న స్పీకర్‌ రమేశ్‌కుమార్‌
నేటి నుంచి విధానసభ సమావేశాలు

ఈనాడు డిజిటల్‌, బెంగళూరు: సుప్రీంకోర్టు ఆదేశాలు, శాసనసభాపతి స్పందనల నేపథ్యంలో అసమ్మతి నేతలు 11 మంది గురువారం సాయంత్రం ముంబయి నుంచి బెంగళూరుకు తరలివచ్చారు. స్పీకర్‌ రమేశ్‌కుమార్‌కు స్వయానా రాజీనామా పత్రాలను సమర్పించారు. దాదాపు గంటసేపు వీరి పత్రాలను పరిశీలించిన స్పీకర్‌ ఇప్పటికిప్పుడే రాజీనామాలను ఆమోదించే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు. దీంతో ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. తమ రాజీనామాలను ఆమోదించాలంటూ మిత్రపక్షాలకు చెందిన అసమ్మతి ఎమ్మెల్యేలు వేసిన పిటీషన్‌ను గురువారం ఉదయం సుప్రీంకోర్టు విచారించింది. సాయంత్రం ఆరింటిలోగా రాజీనామాలపై స్పష్టతనివ్వాలని కర్ణాటక శాసనసభాపతిని ఆదేశించింది. రాజీనామా చేసినవారు ఆ సమయంలోగా స్పీకర్‌ ముందు హాజరుకావాలని దిశానిర్దేశం చేసింది. ఈ ఆదేశాలకు అనుగుణంగా ముంబయి నుంచి ఉరుకులు పరుగులతో ఎమ్మెల్యేలు బెంగళూరుకు చేరుకున్నారు. మరోమారు రాజీనామాలు సమర్పించిన వెంటనే తిరిగి ముంబయికి వెళ్లిపోయారు.

‘సుప్రీం’పై గౌరవం: స్పీకర్‌
‘నా వద్దకు వచ్చిన రాజీనామాలను యుద్ధప్రాతిపదికన ఆమోదించాలని ఎక్కడా లేదు. పైగా నా పరిధిలోని ఎమ్మెల్యేలు ఏదైనా సమస్య ఉంటే నన్ను అడగాలి తప్ప సుప్రీంకోర్టుకు ఎందుకు వెళ్లారో అంతుచిక్కటం లేదు’ అని స్పీకర్‌ రమేశ్‌కుమార్‌ అన్నారు. వీరి రాజీనామాలను గడువులోగా తేల్చాలని సుప్రీంకోర్టు ఆదేశించిందని, ఆ ఆదేశాన్ని గౌరవిస్తున్నానని వ్యాఖ్యానించారు. విధానసౌధలో బుధవారం ఇద్దరు ఎమ్మెల్యేలు రాజీనామాలు చేస్తుండగా జరిగిన తోపులాటల నేపథ్యంలో గురువారం పోలీసు భద్రతను పెంచారు. ముంబయి నుంచి ఎమ్మెల్యేలంతా సరిగ్గా సాయంత్రం ఆరింటికే బెంగళూరుకు వచ్చేలా ప్రయాణ ఏర్పాట్లు చేసుకున్నారు. వీరికి భద్రత కల్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించటంతో ముంబయిలోని రినైసెన్స్‌ హోటల్‌ నుంచి అక్కడి విమానాశ్రయం వరకు, బెంగళూరు విమానాశ్రయం నుంచి నిరాటంకంగా విధానసౌధకు చేరేలా ఏర్పాట్లు చేశారు. రాజీనామాల ప్రక్రియను వీడియో చిత్రీకరించి సుప్రీంకోర్టుకు పంపుతామని స్పీకర్‌ ప్రకటించారు.

భాజపా అసంతృప్తి
స్పీకర్‌ నిర్ణయంపై భాజపా అసంతృప్తి వ్యక్తం చేసింది. చట్టం అమలులో తప్పులను స్పీకర్‌ పునరావృతం చేస్తున్నారని పార్టీ నేతలు ఆరోపించారు. శుక్రవారం ప్రారంభమయ్యే విధానసభలో ఏ బిల్లూ ఆమోదించకుండా అడ్డుకుంటామని పార్టీ నేత ఆర్‌.అశోక్‌ చెప్పారు.

నేనెందుకు రాజీనామా చేయాలి?: సీఎం
బుధవారం వరకు రాజీనామా ఆలోచనలో ఉన్న ముఖ్యమంత్రి కుమారస్వామి ఒక్కసారిగా మాట మార్చారు. తాను రాజీనామా చేయాల్సినంత అవసరం లేదని తేల్చిచెప్పారు. గురువారం మంత్రివర్గ సమావేశం నిర్వహించి పలు కీలక నిర్ణయాలను కూడా ప్రకటించారు.

ఐదుగురిపై చర్యలకు పార్టీల విన్నపం
అసమ్మతినేతల బృందంలోని కాంగ్రెస్‌ సభ్యులు రమేశ్‌ జార్ఖిహొళి, మహేశ్‌ కుమటహళ్లి, జేడీఎస్‌కు చెందిన గోపాలయ్య, హెచ్‌.విశ్వనాథ్‌, నారాయణగౌడలపై స్పీకర్‌కు రెండు పార్టీల నేతలు ఫిర్యాదు చేశారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై స్పీకర్‌ శుక్రవారం నిర్ణయాన్ని ప్రకటించనున్నారని సమాచారం. శుక్రవారం నుంచి విధానసభ సమావేశాలు జరుగనున్నందున ఉత్కంఠ నెలకొంది. సభ్యులందరూ హాజరు కావాలంటూ కాంగ్రెస్‌,జేడీఎస్‌ విప్‌ జారీ చేశాయి.

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.