close
డీఎస్‌ వైఖరిపై తెరాస గుస్సా!

అనర్హత వేటు కోసం ఆధారాల సేకరణ
ఇబ్బందికరంగా వ్యవహరిస్తే రాజీనామాకు ఒత్తిడి

ఈనాడు, హైదరాబాద్‌ : రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్‌ వ్యవహారశైలిని తెరాస అధిష్ఠానం తీవ్రంగా పరిగణిస్తోంది. పార్టీ ఫిరాయింపునకు సంబంధించిన ఆధారాలు లభిస్తే అనర్హత వేటు కోసం రాజ్యసభ ఛైర్మన్‌కు ఫిర్యాదు చేయాలని భావిస్తోంది. గురువారం దిల్లీలో డీఎస్‌ భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాను కలిసి మంతనాలు జరుపుతున్న విషయం తెరాస ఎంపీలకు తెలియడంతో వెంటనే దీనిని వారు అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ఏం చేయాలనే దానిపై అధిష్ఠానం విస్తృతంగా చర్చ జరిపినట్లు తెలిసింది. గత శాసనసభ ఎన్నికలకు ముందు డీఎస్‌ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని నిజామాబాద్‌ జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఫిర్యాదు చేశారు. అప్పట్లో ఆయనను సస్పెండ్‌ చేయాలని భావించారు. అలా చేస్తే ఆయన మరోపార్టీలో చేరతారనే అనుమానంతో చర్య తీసుకోకుండా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంచారు. ఆ తర్వాత కాంగ్రెస్‌ అగ్ర నేతలను కలిశారని తెరాసకు సమాచారం అందినా... ఫిర్యాదు చేసే స్థాయిలో దానికి తగిన ఆధారాలు లభించలేదు. పార్లమెంట్‌ ఎన్నికల సందర్భంగానూ పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించినట్లు నేతలు అధిష్ఠానం దృష్టికి తెచ్చారు. అప్పట్లోనూ సస్పెండ్‌ చేయాలని ఒత్తిడి వచ్చినా అధిష్ఠానం డీఎస్‌కు మరో పార్టీలో చేరే అవకాశం ఇవ్వరాదనే ఉద్దేశంతో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. బుధవారం డీఎస్‌ దిల్లీలో తెరాస ఎంపీల సమావేశానికి రావడం గురించి ఎంపీలు అధిష్ఠానానికి వెల్లడించారు. దీని వెనక డీఎస్‌ వ్యూహం ఏమైనా ఉందా అనే కోణంలో తెరాస ఆరా తీసింది. గురువారం అమిత్‌షాను కలిసిన విషయం తెలిశాక డీఎస్‌ పథకం ప్రకారమే ఇలా చేస్తున్నారని.. ఆయనపై చర్య తీసుకోవాలని నిజామాబాద్‌ జిల్లా నేతలు అధిష్ఠానాన్ని మరోసారి కోరినట్లు తెలిసింది. ఈ పరిణామాలపై అధిష్ఠానం సమాలోచనలు చేసినట్లు సమాచారం.

ఆధారాలుండాల్సిందే...
డీఎస్‌ 2016 జూన్‌లో తెరాస రాజ్యసభ సభ్యునిగా ఎన్నికయ్యారు. 2022 వరకు పదవీ కాలం ఉంది. అప్పటి వరకు పార్టీకి ఇబ్బందికరంగా వ్యవహరిస్తే ఏం చేయాలనే అంశంపై  చర్చించినట్లు తెలిసింది. పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా వ్యవహరించడం, విప్‌ను ధిక్కరించడం, మరో పార్టీలో చేరడం, సమావేశాల్లో పాల్గొనడం, ఆ పార్టీకి అనుకూలంగా మాట్లాడడం, ఆ పార్టీ కండువాలను కప్పుకోవడం తదితర అంశాలు పార్టీ ఫిరాయింపు కింద వస్తాయని, దీనికి అవసరమైన ఆధారాలు సంపాదించాలని తెరాస అధిష్ఠానం భావిస్తున్నట్లు సమాచారం.

అమిత్‌షాతో డీఎస్‌ భేటీ
ఈనాడు, దిల్లీ : తెరాస ఎంపీ డి.శ్రీనివాస్‌ గురువారం మధ్యాహ్నం భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాతో భేటీ అయ్యారు. పార్లమెంట్‌ భవనంలోని అమిత్‌షా కార్యాలయానికి వెళ్లిన డీఎస్‌ సుమారు పది నిమిషాలపాటు ఆయనతో సమావేశమయ్యారు.ఈ భేటీకి పెద్దగా ప్రాధాన్యం లేదని, ఓ కేంద్ర మంత్రిని ఎంపీలా కలిశారు తప్పితే ఇందులో ఇంకెలాంటి రాజకీయ అంశాలు లేవని డీఎస్‌ సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.