close
అద్దె అడ్వాన్స్‌ 2 నెలలకు మించొద్దు

దేశమంతా ఒకే విధానం
ముసాయిదా చట్టంలో కేంద్రం ప్రతిపాదన

ఈనాడు, దిల్లీ: దేశంలో అద్దె ఇళ్ల యజమానులు, కిరాయిదారుల హక్కుల పరిరక్షణ కోసం కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ కొత్త ముసాయిదా అద్దె చట్టాన్ని రూపొందించింది. దీని ప్రకారం అద్దె ఇళ్ల సెక్యూరిటీ డిపాజిట్‌ రెండు నెలల అద్దెకు మించకూడదు. నివాసేతర సముదాయాలకు ఒక నెల అద్దెను కనీస సెక్యూరిటీ డిపాజిట్‌గా నిర్ధారించారు. ఈ తరహా నియంత్రణ వల్ల వివిధ ప్రాంతాల నుంచి వలస వచ్చినవారు, సంఘటిత, అసంఘటిత కార్మికులు, వృత్తినిపుణులు, విద్యార్థులకు ఇళ్లు అందుబాటులోకి వస్తాయని కేంద్రం భావిస్తోంది. దేశవ్యాప్తంగా ఒకే అద్దె విధానాన్ని అమలుచేయడం వీలవుతుందని పేర్కొంది. ప్రస్తుతం దేశంలో ఉన్న అద్దె ఇళ్ల కొరతను నివారించడానికి వీలవుతుందని అభిప్రాయపడింది. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా 1.1 కోట్ల ఇళ్లు ఖాళీగా ఉన్నాయి. 2022 నాటికల్లా అందరికీ ఇళ్లు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం వాటన్నింటినీ అందుబాటులోకి తేవాలని భావిస్తోంది. ప్రస్తుతం అమల్లో ఉన్న అద్దె నియంత్రణ చట్టం అద్దె ఇళ్ల విధానాన్ని నిరుత్సాహపరిచేలా ఉండటంతోపాటు, యజమానులను భయపెట్టేలా ఉందన్నది కేంద్రం అభిప్రాయం.

ప్రతిపాదిత చట్టంలోని ముఖ్యాంశాలు...
* రెంట్‌ అథారిటీ, రెంట్‌ కోర్ట్‌, రెంట్‌ ట్రైబ్యునళ్ల ఏర్పాటువల్ల వివాదాలు, ఫిర్యాదుల పరిష్కారానికి కట్టుదిట్టమైన వ్యవస్థ అందుబాటులోకి వస్తుంది.
* ఈ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత లిఖితపూర్వకమైన ఒప్పందం లేకుండా ఎవ్వరూ అద్దెకు తీసుకోవడం, ఇవ్వడం కుదరదు. ఈ చట్టం దేశమంతటికీ వర్తిస్తుంది.
* అద్దె ఒప్పందం అమల్లోకి వచ్చిన రెండునెలల్లోపు ఇంటి యజమాని, అద్దెదారులిద్దరూ తమమధ్య కుదిరిన ఒప్పందం గురించి రెంట్‌ అథారిటీకి సమాచారం అందించాలి. వారంలోపు రెంట్‌ అథారిటీ ఆ ఇద్దరికీ ఒక విశిష్టగుర్తింపు సంఖ్యనిస్తుంది.
* అద్దె ఒప్పందపత్రాలు, ఇతర దస్తావేజులు సమర్పించడానికి రాష్ట్రస్థాయిలో స్థానిక భాషల్లో ఒక డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌ ఏర్పాటుచేస్తారు.
* నమూనా అద్దెచట్టం 2019 ముసాయిదాపై కేంద్ర పట్టణాభివృద్ధి, గృహనిర్మాణశాఖ ప్రజల నుంచి అభిప్రాయాలు ఆహ్వానిస్తోంది. ఆగస్టు 1లోపు ఎవరైనా తమ అభిప్రాయాలను పంపొచ్చు.
* దీనిపై రాష్ట్ర ప్రభుత్వాల అభిప్రాయాలను కూడా ఆహ్వానిస్తోంది. ఇది ఖరారు కాగానే కొత్త నమూనా చట్టాన్ని రాష్ట్రాలకు పంపుతుంది.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.