close
కృష్ణమ్మ పరవళ్లు ఏవీ..!

శ్రీశైలంలో అత్యల్ప ప్రవాహం
50 ఏళ్లలో తొలిసారి

ఈనాడు, హైదరాబాద్‌: కృష్ణమ్మ వెలవెలపోతోంది. జల పరవళ్లు లేక ఒట్టిపోతోంది. గత ఐదు దశాబ్దాలతో పోలిస్తే శ్రీశైలంలో ఇంత తక్కువ ప్రవాహం ఎప్పుడూ లేదు. కృష్ణా బేసిన్‌లో ప్రధాన ఆయకట్టుకు సాగునీరు, పలు పట్టణాలు, గ్రామాలకు తాగునీరు ఇక్కడికి వచ్చే ప్రవాహంపైనే ఆధారపడి ఉంది. ఎన్నో ఏళ్లు జులై రెండో పక్షం వరకు తక్కువగా ఉన్నా, ఆ తర్వాత శ్రీశైలంలోకి ప్రవాహం మెరుగ్గా ఉండేది. ఈఏడాది పరిస్థితి ఆశాజనకమేనా అన్నది చెప్పలేని పరిస్థితి. 1967-68వ సంవత్సరం నుంచి 2018-19 వరకు శ్రీశైలానికి మొత్తం నీటి సంవత్సరంలో అతి తక్కువగా 2015-16వ సంవత్సరంలో 73.75 టీఎంసీలు మాత్రమే వచ్చాయి.

ఈ ఏడాది కూడా జులై 15 వరకు 1.4 టీఎంసీ మాత్రమే నీరు వచ్చింది. ఈ ఏడాది ఇప్పటివరకు అతి తక్కువగా కేవలం 0.20 టీఎంసీ మాత్రమే వచ్చింది. గత ఏడాది జులై 15 తర్వాత 145 టీఎంసీలు రాగా.. ఆగస్టులో 300 టీఎంసీల నీరు వచ్చింది.

భారీ వరద వస్తేనే...
ప్రధాన కృష్ణాలో ఉన్న ఆలమట్టి, తుంగభద్రపై ఉన్న తుంగభద్ర ప్రాజెక్టుల్లోకి వస్తున్న ప్రవాహాలను పరిశీలిస్తే భారీ వరద వస్తే తప్ప ఆ రిజర్వాయర్ల నుంచి దిగువకు జులైలో నీటిని వదిలే అవకాశం ఉండదు. ప్రస్తుత పరిస్థితిని పరిశీలిస్తే జులై నెలాఖరు వరకు శ్రీశైలంలోకి ప్రవాహం ప్రారంభం కావడం కూడా కష్టమేనన్న అభిప్రాయం నీటిపారుదలశాఖ వర్గాల నుంచే వ్యక్తమవుతోంది. కృష్ణా బేసిన్‌ పరిధిలో తెలుగు రాష్ట్రాల్లోని రిజర్వాయర్లన్నీ ఖాళీగా దర్శనమిస్తూ నీటికోసం ఎదురుచూస్తున్నాయి. ఆలమట్టిలోకి ప్రవాహం ప్రస్తుతం 1.42 లక్షల క్యూసెక్కులు ఉంది. ఆలమట్టి.. దీని దిగువన ఉన్న నారాయణపూర్‌ రెండూ నిండటానికి 80 టీఎంసీలు అవసరం. ప్రస్తుతం ఉన్న ప్రవాహం పది రోజుల పాటు కొనసాగితే దిగువకు నీటి విడుదలకు అవకాశాలు పెరుగుతాయి. ఆలమట్టిలోకి ప్రవాహం ఇంకా పెరిగే అవకాశం ఉంది. అయితే ఎన్ని రోజులు ఈ వరద ప్రవాహం ఉంటుందన్న దానిపై శ్రీశైలం భవిష్యత్తు ఆధారపడి ఉంది. తుంగభద్రలోకి కేవలం 12 వేల క్యూసెక్కుల ప్రవాహమే ఉంది. ఈ రిజర్వాయర్‌ నిండటానికి 95 టీఎంసీలు అవసరం. ఈ ప్రాజెక్టు నుంచి శ్రీశైలంలోకి ఇప్పుడిప్పుడే నీటిని ఆశించే పరిస్థితి లేదు.

గోదావరిలోనూ ఇదే పరిస్థితి
ఈ ఏడాది గోదావరి బేసిన్‌లో పరిస్థితి కూడా అంత ఆశాజనకంగా లేదు. ప్రధాన గోదావరి ఎలా ఉన్నా, ప్రాణహితలో జులైలో ఎక్కువ ప్రవాహం ఉండేది. ఈ నదిలో వచ్చే మొత్తం నీటిలో జూన్‌లో 3.5 శాతం లభ్యత ఉంటే, జులైలో 21 శాతం ఉంటుంది. కానీ ఈ ఏడాది జూన్‌లో అసలు లేకపోగా, జులైలో కూడా ఇప్పటివరకు నామమాత్రంగానే ఉంది. ప్రాణహితలో జులైలో ఇప్పటివరకు ఇలాంటి పరిస్థితి గతంలో ఎప్పుడూ చూడలేదని నీటిపారుదల శాఖ వర్గాలు పేర్కొన్నాయి. మేడిగడ్డ దగ్గర గురువారం 11 వేల క్యూసెక్కుల ప్రవాహం మాత్రమే ఉంది. దీంతో కన్నెపల్లి పంపుహౌస్‌ వద్ద నాలుగు మోటార్లను కూడా పూర్తి స్థాయిలో నిరాటంకంగా నడపలేని పరిస్థితి. ప్రాణహిత నదిలో ఎంత నీటి ప్రవాహం ఉందన్నది కొలిచేందుకు టేక్రా వద్ద కేంద్ర జలసంఘం గేజ్‌ పాయింట్‌ ఉంది. ఇక్కడ ఇప్పటివరకు అత్యధికంగా రికార్డయిన వరద ప్రవాహం 26 వేల క్యూసెక్కులు మాత్రమే. జులై రెండో వారంలో ఇలాంటి పరిస్థితి అరుదు. శ్రీరామసాగర్‌ ప్రాజెక్టులోకి ఇప్పటివరకు చుక్కనీరు రాకపోగా, ఎల్లంపల్లిలోకి నామమాత్రంగా వచ్చింది. దిగువన ధవళేశ్వరం వద్ద నీటి ప్రవాహం తక్కువగా ఉంది. ఈ సీజన్‌లో అత్యధికంగా 1.34 లక్షల క్యూసెక్కులు గురువారం ధవళేశ్వరం వద్ద రికార్డయింది. గోదావరి డెల్టాకు వినియోగించిన, సముద్రంలోకి వెళ్లిన మొత్తం నీటిని పరిగణనలోకి తీసుకొంటే ఇప్పటివరకు వచ్చింది 60 టీఎంసీలు మాత్రమే. ఇలా రావడం అరుదని ఇంజినీరింగ్‌ వర్గాలు తెలిపాయి.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.