close
వాహన ప్రమాదంలో మరణిస్తే రూ.5 లక్షల పరిహారం 

తీవ్రంగా గాయపడిన వారికి రూ.2.5 లక్షలు 
వాహన యజమాని లేదా బీమా సంస్థ చెల్లించాలి 
నిబంధనలు ఉల్లంఘించే వారిపై చర్యలు తీవ్రతరం 
లోక్‌సభ ముందుకు మోటారు వాహనాల చట్ట సవరణ బిల్లు

దిల్లీ: మోటారు వాహనాల చట్ట నిబంధనలకు మరింత పదును పెంచే లక్ష్యంతో రూపొందించిన సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం సోమవారం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. వాహన ప్రమాదంలో ప్రాణ నష్టం జరిగితే   చెల్లించాల్సిన పరిహారాన్ని పెంచుతూ బిల్లులో ప్రతిపాదించారు. ట్రాఫిక్‌ నిబంధనలను ఉల్లంఘించే వారికి భారీగా జరిమానాలు విధించేలా, ప్రమాదానికి గురైన వ్యక్తులకు సహాయపడే పరోపకారులకు పోలీసుల నుంచి వేధింపులు ఎదురుకాకుండా రక్షణ కల్పించే ప్రతిపాదన తాజా బిల్లులో ఉంది. గత లోక్‌సభలోనే సవరణ బిల్లుకు సభ్యుల ఆమోదం లభించినప్పటికీ రాజ్యసభలో గట్టెక్కలేకపోయింది. దీంతో సోమవారం కేంద్ర రోడ్డు రవాణాశాఖ సహాయ మంత్రి వి.కె.సింగ్‌ బిల్లును మళ్లీ సభ ముందుకు తీసుకొచ్చారు. బిల్లులోని కొన్ని నిబంధనలు రాష్ట్రాల హక్కులను హరించేలా ఉన్నాయని కొందరు విపక్ష సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేయగా కేంద్ర రోడ్డురవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ వాటిని తోసిపుచ్చారు. రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు తక్షణమే బిల్లును ఆమోదించాలని సభ్యులకు విజ్ఞప్తి చేశారు. సవరణ బిల్లులోని నిబంధనలను అమలు చేయాలా వద్దా అన్నది రాష్ట్రాల ఇష్టాయిష్టాల మీదే ఆధారపడి ఉంటుందని తెలిపారు. దేశంలో 30 శాతం డ్రైవింగ్‌ లైసెన్సులు నకిలీవేనని, ప్రతి ఏటా రోడ్డు ప్రమాదాల్లో 1.5లక్షల మంది మృతి చెందుతున్నారని, మరో 5 లక్షల మంది గాయపడుతున్నారని గడ్కరీ సభకు వివరించారు. ప్రమాదాలను తగ్గించాలన్నదే సవరణ బిల్లు లక్ష్యమన్నారు. రాష్ట్రాల రవాణా శాఖలను సంప్రదించే దీనిని రూపొందించామని చెప్పారు. 

బిల్లులోని ముఖ్యమైన ప్రతిపాద‌న‌లు..

వాహనం ప్రమాదానికి గురైనప్పుడు ప్రాణాలు కోల్పోయిన బాధిత వ్యక్తి కుటుంబానికి రూ.5లక్షలు, తీవ్రంగా గాయపడిన వ్యక్తికి రూ.2.5లక్షలు చొప్పున పరిహారం ఇవ్వాలి. ఈ మొత్తాన్ని వాహన యజమాని లేదా బీమా సంస్థ చెల్లించాలి. సత్వరమే పరిహారం అందేలా బీమా నిబంధనలు సరళతరం

ట్రాఫిక్‌ నిబంధనలను ఉల్లంఘించే వారికి జరిమానాలు భారీగా పెంపు.

ఆన్‌లైన్‌ ద్వారా లెర్నింగ్‌ లైసెన్సుల మంజూరుకు వెసులుబాటు
ఆపద సమయంలో క్షతగాత్రులకు చేయూతనందించే   పరోపకారులకు రక్షణ కల్పించేలా నిబంధనలు
ట్రాన్స్‌పోర్టు లైసెన్సుల పునరుద్ధరణ కాలవ్యవధి మూడేళ్ల నుంచి అయిదేళ్లకు పెంపు దివ్యాంగులకు లైసెన్సుల మంజూరు చేసేలా అధికారులకు వెసులుబాటు
డ్రైవింగ్‌ లైసెన్సుల గడువు ముగియటానికి ఏడాది నుంచి నెల రోజుల ముందే పునరుద్ధరించుకొనే వీలు. గడువు తీరాక కూడా ఏడాది లోపల పునరుద్ధరించుకొనే వెసులుబాటు

నాలుగేళ్లపై బడిన ప్రతి ఒక్కరూ హెల్మెట్‌ ధరించటం తప్పనిసరి 
సీటు బెల్ట్‌ ధరించకపోతే రూ.వెయ్యి జరిమానా 
14 ఏళ్లలోపు పిల్లలను వాహనాల్లో తీసుకెళ్లేటప్పుడు సరైన రక్షణ చర్యలు చేపట్టకపోతే రూ.వెయ్యి వడ్డింపు 
నిర్దేశిత ప్రమాణాల ప్రకారం రహదారులను నిర్మించకుండా ప్రమాదాలకు కారణమయ్యే గుత్తేదారుకు రూ.లక్ష వరకు జరిమానా 
అనుమతించిన పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకుంటే అధికంగా ఉన్న ఒక్కొక్కరిపై రూ.200 జరిమానా విధింపు. 
కిందికి దించిన ప్రయాణికులకు ప్రత్యామ్నాయ రవాణా సౌకర్యం కల్పించిన తర్వాతే ఆ వాహనం కదలటానికి అనుమతి లభిస్తుంది. 
రహదారుల్లో అనవసరంగా శబ్దం(హార్న్‌) మోగించినా, నిషేధిత ప్రాంతాల్లో శబ్దాలు చేసినా, సైలెన్సర్లు తీసేసి ధ్వనికాలుష్యం సృష్టించినా రూ.వెయ్యి జరిమానా.రెండోసారి అలాంటి తప్పే చేస్తే జరిమానా రెట్టింపు 
బాలబాలికలు ఎవరైనా ఈ చట్టం పరిధిలోకి వచ్చే నేరం చేస్తే అందుకు వారి తల్లిదండ్రులు, సంరక్షకులు లేదా వారికి వాహనం ఇచ్చిన యజమానిదే బాధ్యత. చట్ట ప్రకారం వారే శిక్ష అనుభవించాలి. ఇలాంటి కేసుల్లో మూడేళ్ల వరకు జైలుశిక్ష, రూ.25వేల వరకు జరిమానా 
ప్రమాదాలకు కారకులైన బాలురకు తదుపరి 25 ఏళ్ల వరకు డ్రైవింగ్‌ లైసెన్స్‌ మంజూరు నిలిపివేత 
మోటారు వాహనం వల్ల పర్యావరణానికి నష్టం కలిగినా, డ్రైవరు, అందులో ప్రయాణిస్తున్న వారికి, లేదా రోడ్డుపై వెళ్లే వారికి ప్రమాదం ఉన్నట్లు తేలినా ఆ వాహనాలను ఉపసంహరించమని తయారీదారుడిని కేంద్రం ఆదేశించవచ్చు అగ్నిమాపకదళం, అంబులెన్స్‌, ఇతర అత్యవసర వాహనాలకు దారి ఇవ్వకుంటే ఆరు నెలల జైలుశిక్ష, రూ.పదివేల జరిమానా 
ప్రమాద నిధి ఏర్పాటు 
దేశంలో రహదారిని ఉపయోగించే వారందరికీ తప్పనిసరిగా బీమా రక్షణ. దీనికి గాను మోటారు వాహనాల ప్రమాద నిధి ఏర్పాటు. కొంత మొత్తాన్ని గ్రాంట్‌గా, మరికొంత రుణంగా కేంద్రమే నిధులను సమకూరుస్తుంది. 
రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి వైద్యసేవలు అందించడానికి, గుర్తుతెలియని వాహనాల బారినపడి మృతిచెందిన, తీవ్రంగా గాయపడిన వారి కుటుంబాలకు పరిహారం అందించడానికి ఈ నిధిని ఉపయోగిస్తారు. 
కేంద్రం నిర్ధరించే పరిమితి ఆధారంగా గరిష్ఠ మొత్తాన్ని అందిస్తారు. ఇన్సూరెన్స్‌ క్లెయిమ్స్‌ సెటిల్‌ చేసేటప్పుడు ఈ నిధి నుంచి చెల్లించిన పరిహారాన్ని మినహాయించుకుంటారు.

- ఈనాడు, దిల్లీ

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.