close
తెలంగాణకు గిరిజన వర్సిటీ ఏది? 

 రాజ్యసభలో నిలదీసిన తెరాస ఎంపీ కేశవరావు

ఈనాడు, దిల్లీ: ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో కేంద్రీయ, గిరిజన విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు బిల్లు ప్రవేశపెట్టారని, అదే పేజీలో తెలంగాణలో ఈ వర్సిటీల ఏర్పాటు గురించి కేంద్రానికి కనిపించలేదా అని తెరాస ఎంపీ కేశవరావు ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఈ విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు సంబంధించి మంగళవారం రాజ్యసభలో కేంద్రీయ వర్సిటీల బిల్లు సవరణపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. విద్యాసంస్థలకు సంబంధించి తెలంగాణకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చకపోవడంపై నిరసన వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణలో కేంద్రీయ విశ్వవిద్యాలయాన్ని తాత్కాలికంగా హెచ్‌సీయూలో ఏర్పాటు చేయొచ్చని, గిరిజన వర్సిటీని ఆదిలాబాద్‌లో ఏర్పాటు చేయాలని కోరామన్నారు. చట్టంలో పొందుపరిచినవి, పొందుపరచనివి అన్నీ ఏపీకి ఇచ్చామని భాజపా సభ్యుడు జీవీఎల్‌ అంటున్నారని కానీ, ఎన్నికల్లో భాజపా ఏపీలో ఒక్క సీటు కూడా గెలవలేకపోయింద]ని కేశవరావు వ్యాఖ్యానించారు. హెచ్‌సీయూలో రోస్టర్‌ విధానం, రిజర్వేషన్లు అమలు చేయడం లేదని, వాటిపై దృష్టి సారించాలని కోరారు. ఆరెస్సెస్‌ నేపథ్యం ఉన్న వారిని వీసీని చేస్తున్నారన్న కేశవరావు వ్యాఖ్యలపై భాజపా సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణలో గిరిజన వర్సిటీ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం స్థలం కేటాయించలేదని కేంద్ర మానవ వనరుల అభివృద్ధిశాఖ మంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌ పేర్కొన్నారు. 
విమానాశ్రయాలు ఏర్పాటు చేయాలి 
ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్‌ ఇండియా సవరణ బిల్లుపై జరిగిన చర్చలో తెరాస ఎంపీ బండా ప్రకాశ్‌ మాట్లాడారు. కొత్తగూడెం, వరంగల్‌, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌లలో విమానాశ్రయాలు ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. 
‘స్వదేశ్‌ దర్శన్‌’గా తెలంగాణకు రూ.183.40 కోట్లు 
స్వదేశ్‌ దర్శన్‌ పథకం కింద తెలంగాణకు మొత్తం రూ.183.40 కోట్లను విడుదల చేసినట్లు కేంద్ర పర్యాటకశాఖ మంత్రి ప్రహ్లాద్‌ సింగ్‌ పటేల్‌ తెలిపారు. రాజ్యసభ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్‌ అడిగిన ప్రశ్నకు ఆయన లిఖితపూర్వక సమాధానమిస్తూ.. సంవత్సరాలవారీగా నిధుల వివరాలు వెల్లడించారు. 2015-16లో మహబూబ్‌నగర్‌ జిల్లా సమగ్రాభివృద్ధి పథకానికి రూ.73.30 కోట్లు, 2016-17లో గిరిజన సర్క్యూట్‌ (ములుగు- లక్నవరం-మేడారం-తాడ్వాయి-దామెరవాయి-మల్లూర్‌-బొగత జలపాతం అభివృద్ధి)కి రూ.65.27 కోట్లు, 2017-18లో హెరిటేజ్‌ సర్క్యూట్‌కు (కుతుబ్‌షాహీ హెరిటేజ్‌ పార్క్‌, తదితరాలకు) రూ.44.83 కోట్లు కేటాయించామన్నారు. ప్రసాద్‌ పథకంలో గద్వాల జిల్లాలోని జోగులాంబ క్షేత్రాభివృద్ధికి నిర్ణయించామని చెప్పారు. స్వదేశ్‌ దర్శన్‌లో గిరిజన సర్క్యూట్‌కి సంబంధించి ఆదిలాబాద్‌ జిల్లాలో గిరిజన, పర్యావరణ అభివృద్ధి; హెరిటేజ్‌లో భువనగిరి, దేవరకొండ, రాచకొండ, రాజాపేట, ఖమ్మం కోటలు; రామాయణ కింద భద్రాచలం ప్రగతి, ఆధ్యాత్మికంగా సంగారెడ్డి-కామారెడ్డి-మెదక్‌-వరంగల్‌, నాంపల్లిగుట్ట-వేములవాడ-కోటిలింగాల-కొండగట్టు-ధర్మపురి-రామగిరి కోట-కాళేశ్వరం పురోగతి గురించి తెలంగాణ రాష్ట్రప్రభుత్వం ప్రతిపాదనలు పంపిందని కేంద్రమంత్రి వివరించారు.

రైతు ఆత్మహత్యలపై సమాచార లేమి 
లోక్‌సభలో ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

ఈనాడు, దిల్లీ: వ్యవసాయంలో తీవ్రంగా నష్టపోయి రోజుకు 30మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని నల్గొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఆయన లోక్‌సభలో వ్యవసాయం, రైతు సంక్షేమం పద్దుపై చర్చలో మాట్లాడారు. ‘‘భాజపా నేతృత్వంలోని ప్రభుత్వం వ్యవసాయాన్ని, రైతులను చిన్నచూపు చూస్తోంది. 2018-19 బడ్జెట్‌లో వ్యవసాయానికి రూ.75,753కోట్లు కేటాయించారు. సవరించిన బడ్జెట్‌లో దాన్ని రూ.53వేల కోట్లు చేసి అందులో రూ.22వేల కోట్లు వ్యయం చేయలేదు. కేంద్రం వద్ద రైతు ఆత్మహత్యల వివరాలు లేవు. 2016 నుంచి ఎన్‌సీఆర్‌బీలో రైతు ఆత్మహత్యలు నమోదు చేయడం లేదు. కౌలురైతులకు అర్హత పత్రాలు లేనందున బ్యాంకు రుణాలు దక్కడం లేదు. పెట్టుబడికి వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. పంటలు దక్కనప్పుడు అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. 2022నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని 2016-17 బడ్జెట్‌ ప్రసంగంలో చెప్పారు. ఈ మూడేళ్లలో సామాజిక, ఆర్థిక సర్వేల్లో ఎక్కడా రైతు ఆదాయం పెరిగినట్లు నమోదుకాలేదు. నిర్మాణాత్మక కార్యక్రమాలు చేపట్టకుండా రైతుల ఆదాయం రెట్టింపు ఎలా చేస్తారో చెప్పాలి. నిజామాబాద్‌లో పసుపుబోర్డు ఏర్పాటు చేస్తామని ఎన్నికల ప్రచారంలో కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ప్రకటించారు. వెంటనే ఏర్పాటు చేయాలి. వ్యవసాయ యంత్రాలు, ట్రాక్టర్లు, ఎరువులు, పురుగుమందులపై జీఎస్టీని తొలగించాలి. లేదా తక్కువ శ్లాబుకు పరిమితం చేయాలి’’ అని ఉత్తమ్‌ అన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ్‌ ప్రస్తావించిన జీఎస్టీ అంశంపై సభ్యులతోపాటు సభాపతి స్థానంలో ఉన్న భర్తృహరి మెహతాబ్‌ ఆయన్ను అభినందించారు.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.