close
కాపు కోటాపై కాక 

రిజర్వేషన్ల పేరుతో తెదేపా కాపులను వంచించింది 
కమిషన్‌ ఛైర్మన్‌ మంజునాథన్‌ సంతకం లేకుండా నివేదిక 
ఇది చెల్లుబాటు అవుతుందా? 
ప్రతిపక్షంపై ధ్వజమెత్తిన ఏపీ సీఎం జగన్‌ 
రిజర్వేషన్లు ఇస్తారో లేదో చెప్పండి: చంద్రబాబు 
ఈనాడు - అమరావతి

‘‘దేశంలో వివిధ రాష్ట్రాల్లో జాట్లు, గుజ్జర్లు, పటేళ్లు.. మన రాష్ట్రంలో కాపు సోదరులు రిజర్వేషన్‌ కల్పించాలని కోరుతున్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఏ రాష్ట్రంలో రిజర్వేషన్లు 50 శాతం మించకూడదన్న నిబంధన మనందరికీ తెలిసిన చిక్కుముడి.. ఇది తెలిసి కూడా తెదేపా గత ఎన్నికల ప్రణాళికలో కాపులను బీసీల్లో కలుపుతామని మోసపూరిత హామీ ఇచ్చింది. మన పరిధిలో లేని విషయంలో మన ప్రయత్నిస్తామని చెప్పగలం కానీ.. రిజర్వేషన్‌ కల్పిస్తామని చెప్తే అది ప్రజల్ని మభ్యపెట్టే చర్యే అవుతుంది. ఈ నేపథ్యంలో కాపు రిజర్వేషన్ల విషయంలో మా వైఖరి ఎప్పుడూ ఒకటే.. బీసీల హక్కులకు భంగం కలగకుండా వారి ప్రయోజనాలకు నష్టం రాకుండా జరిగే రిజర్వేషన్లకు మా మద్దతు ఎప్పుడూ ఉంటుంది’’ అని ఏపీ సీఎం జగన్‌ మంగళవారం శాసనసభలో స్పష్టం చేశారు. ‘‘కాపుల సంక్షేమం కోసం కార్పొరేషన్‌కు ఏడాదికి రూ.2వేల కోట్లు చొప్పున అయిదేళ్లలో రూ.10వేల కోట్లు కేటాయిస్తాం.. ఖర్చు చేస్తాం.. ఈ ఏడాది బడ్జెట్లో రూ.2వేల కోట్లు కేటాయించాం.. ఖర్చు చేస్తాం’’ అని స్పష్టం చేశారు. బడ్జెట్‌పై చర్చ సందర్భంగా మంగళవారం మధ్యాహ్నం అసెంబ్లీలో అంబటి రాంబాబు మాట్లాడే సమయంలో కాపు రిజర్వేషన్ల అంశం ప్రస్తావనకు వచ్చింది. ఇది చివరకు తీవ్రరూపం దాల్చి సీఎం జగన్‌, ప్రతిపక్ష నేత చంద్రబాబు మధ్య వాడివేడి చర్చకు దారితీసింది. 
నివేదిక చెల్లుబాటు అవుతుందా! 
‘‘మంజునాథన్‌ పేరుతో కమిషన్‌ వేశారు. ఛైర్మన్‌ అయిన ఆయన సంతకం పెట్టకుండానే మిగిలిన సభ్యులతో సంతకం పెట్టించి నివేదిక తీసుకున్నారు. దీనికి చెల్లుబాటు ఉంటుందా? కోర్టుకెళ్తే నిలబడుతుందా?’’ అని జగన్‌ ప్రశ్నించారు. ‘‘చంద్రబాబు అయిదేళ్లు కాపుల్ని మోసం చేశారు. తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో వచ్చిన ఎమ్మెల్యేల సంఖ్యను లెక్కేసుకుంటే తెలుస్తుంది. ఇలా మోసం చేశారు కాబట్టే ఇక్కడుండాల్సిన ఆయన అక్కడ(ప్రతిపక్ష) స్థానంలో కూర్చున్నారు. అయినా ఇప్పటికీ మారలేదు. ఇప్పుడున్న 23 మంది కాస్తా రాబోయే రోజుల్లో ఇంకా తగ్గిపోతారు’’ అని జోస్యం చెప్పారు. ‘‘2004 నాటి హామీకి ఇప్పటికి ఏం సంబంధం.. అది 15 ఏళ్ల కిందటి కథ.. ఇప్పుడు చంద్రబాబు ఏం చెప్పారు.. నేనేం చెప్పాను అనేదే మాట్లాడుకోవాలి. నేనూ అలాగే మాట్లాడితే 1993లో ఎన్టీఆర్‌ను ఏం చేశారు..అప్పుడు వెన్నుపోట్లు బయటకు వస్తాయి’’ అని మండిపడ్డారు. 
మంచితనం, మానవత్వం పెంచుకోండి 
‘‘కాపుల సంక్షేమానికి ఏడాదికి రూ వెయ్యి కోట్లు ఖర్చు పెడతామని చెప్పినా.. తొలి ఏడాది సున్నా, రెండో ఏడాది రూ.90కోట్లు, మూడో ఏడాది రూ.490 కోట్లు, నాలుగో ఏడాది రూ.891 కోట్లు, అయిదో ఏడాది రూ.525 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. ఇవన్నీ లెక్కలు.. కళ్లు ఇలా ఇలా పెట్టి చూసినా ఎవరూ భయపడర]య్యా..’’ అంటూ జగన్‌ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ఇప్పటికైనా మారవయ్యా చంద్రబాబూ.. వయసుతోపాటు మానవత్వం, మంచితనం పెంచుకో.. ఎలా గౌరవించాలో తెలుసుకో.. ప్రజల్ని మోసం చేయకుండా.. చట్టసభలను గౌరవించమని ప్రార్ధిస్తున్నా..’’ అని పేర్కొన్నారు. 
చంద్రబాబు కాపులకు పదవి ఇచ్చినా అధికారం మాత్రం ఇవ్వలేదు 
తొలుత ఎమ్మెల్యే అంబటి రాంబాబు మాట్లాడుతూ తెదేపా హయాంలో కాపులకు ఉపముఖ్యమంత్రి పదవి ఇచ్చినా హెడ్‌కానిస్టేబుల్‌ను కూడా బదిలీ చేసే అధికారం ఇవ్వలేదని విమర్శించారు. అయిదేళ్లలో ఏడాదికి రూ.వెయ్యి కోట్ల చొప్పున ఇస్తామని ప్రకటించి..ఖర్చు చేసింది రూ.2,003 కోట్లు మాత్రమే అని విమర్శించారు. కాపుల్ని మోసం చేసిన వ్యక్తి చంద్రబాబే అని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాపు రిజర్వేషన్లపై కట్టుబడి ఉన్నారో లేదో తేల్చాలని తెదేపా శాసనసభాపక్ష నేత అచ్చెన్నాయుడు ‘పాయింట్‌ఆఫ్‌ ఆర్డర్‌’ లేవనెత్తారు. ఈ సందర్భంగా అంబటి, అచ్చెన్నాయుడుల  మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. 
నాది మోసమైతే..  మీ తండ్రిదీ మోసమే: బాబు 
కాపులకు తాము కల్పించిన రిజర్వేషన్లపై అధికార పార్టీ వైఖరి స్పష్టం చేయాలని చంద్రబాబు డిమాండ్‌ చేశారు. ‘‘మేం మోసం చేశామంటున్నారు. 2004, 2009లో మీ తండ్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఎన్నికల ప్రణాళికలో పెట్టారు. అయినా ఏం చేయలేదు. మేం రిజర్వేషన్‌ ఇచ్చాం. అప్పుడు రాజశేఖరరెడ్డి మోసం చేయలేదా? నాది మోసమైతే మీ తండ్రి చేసిందీ మోసమే .. రిజర్వేషన్‌ ఇస్తారో లేదో చెప్పండి’’ అని డిమాండు చేశారు.

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.