close
ఆకలి లోకం.. ఊబకాయం.. 

ప్రపంచంలో 82 కోట్ల మందికి క్షుద్బాధ 
100 కోట్ల మంది ఊబకాయులు 
ఐరాస తాజా నివేదిక

ఐరాస: ప్రపంచవ్యాప్తంగా తినడానికి తిండి లేక, ఆకలితో అలమటిస్తున్న వారు ఓవైపు పెరుగుతుండగా.. అంతకంటే ఎక్కువ మంది ఊబకాయం, అధిక బరువుతో బాధ పడుతున్నారు. 2018లో క్షుద్బాధతో అల్లాడుతున్న వారి సంఖ్య 82 కోట్లకు పైగా చేరినట్లు ఐక్యరాజ్య సమితి తాజాగా ఓ నివేదికలో వెల్లడించింది. అదే సమయంలో 100 కోట్ల మందిని అధిక బరువు సమస్య వేధిస్తోంది. కొన్ని దశాబ్దాలుగా ‘ఆకలి’ క్రమేపీ తగ్గినప్పటికీ 2015లో మళ్లీ మొదటికొచ్చినట్లు నివేదిక పేర్కొంది. ఈ పరిస్థితులన్నీ 2030 నాటికి ‘ఆకలి’ని లేకుండా చేయాలన్న సుస్థిర అభివృద్ధి లక్ష్యానికి పెద్ద సవాల్‌గా పేర్కొంది. ‘ప్రపంచంలో ఆహార భద్రత, పోషకాహార పరిస్థితి 2019’ పేరిట న్యూయార్క్‌లో ఐరాస తాజా నివేదికను విడుదల చేసింది.

అన్నమో రామచంద్రా!

గత మూడేళ్లుగా ఆకలితో అలమటిస్తున్న వారు 11 శాతానికి అటుఇటుగా ఉన్నారు. ఆహార భద్రత లేని చోట క్షుద్బాధ పడేవారు ఎక్కువగా ఉండగా ఓ మాదిరిగా ఉన్న ప్రాంతాల్లో ప్రజలు ఆహార నాణ్యత విషయంలో రాజీ పడాల్సి వస్తోంది. 
ప్రపంచంలో దాదాపు 200 కోట్ల మంది ఓ మాదిరి లేదా తీవ్ర ఆహార అభద్రతను ఎదుర్కొంటున్నారు.  
ఆకలితో అలమటిస్తున్న వారిలో 51.3 కోట్ల మంది ఆసియాలోను, 25.6 కోట్ల మంది ఆఫ్రికాలోను ఉన్నారు.

 భారత్‌లో ‘ఆకలి’ తగ్గినా..

భారత్‌లో ఆకలి సమస్య 12ఏళ్లలో తగ్గుముఖం పట్టింది. 2004-06 మధ్యకాలంలో తినడానికి తిండిలేక ఇబ్బందులు పడే వారి సంఖ్య 25.39 కోట్లు (జనాభాలో 22.2 శాతం)కాగా 2016-18 నాటికి ఆ సంఖ్య 19.44 కోట్లకు (14.5 శాతం) తగ్గింది. అదే సమయంలో ఊబకాయుల (18 ఏళ్లకు పైబడిన వారు) సంఖ్య పెరిగింది. 2012లో ఇలాంటి వారు 2.41 కోట్ల మంది ఉంటే 2016 నాటికి ఆ సంఖ్య 3.28 కోట్లకు పెరిగింది. 2018 నాటికి అధిక బరువుతో బాధపడుతున్న పిల్లలు 29 లక్షల మంది ఉన్నారు.

అధిక బరువు ఆరోగ్య సమస్య

ఊబకాయం, అధిక బరువు ప్రపంచవ్యాప్తంగా ఇది 40 లక్షల మరణాలకు కారణమవుతోంది. ఊబకాయ సమస్య ఉన్న బడిఈడు పిల్లలు, కౌమార దశలో ఉన్నవారు 33.8 కోట్లు కాగా, పెద్దలు 67.2 కోట్ల మంది. 
ఆఫ్రికా, ఆసియా ఖండాల కంటే మిగతా ప్రాంతాల్లో ఈ సమస్య తీవ్రంగా ఉంది. వేగంగా పెరుగుతున్న ‘అధిక బరువు’ ప్రపంచానికి ఆరోగ్య సమస్యగా మారుతోంది. 
బడిఈడు పిల్లల్లో చాలామంది తగినంతగా పళ్లు, కూరగాయలు తినకపోవడం; తరచూ ఫాస్ట్‌ఫుడ్‌, కార్బొనేటెడ్‌ పానీయాలు తాగడంతో పాటు, రోజువారీ శారీరక శ్రమ లేకపోవడం వంటివి ఊబకాయానికి ప్రధాన కారణాలు.

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.