close
నేడు సుప్రీంకోర్టు కీలక తీర్పు 

అసమ్మతి ఎమ్మెల్యేల రాజీనామాలపై కొన్ని గంటల్లో స్పష్టత! 
కన్నడనాట పతాకస్థాయికి ఉత్కంఠ 
బిక్కుబిక్కుమంటున్న నేతలు 
ఈనాడు డిజిటల్‌ - బెంగళూరు

ర్ణాటక ఎమ్మెల్యేల రాజీనామాలపై సుప్రీంకోర్టు తీర్పు బుధవారానికి వాయిదా పడింది. తమ రాజీనామాలను ఆమోదించేలా స్పీకర్‌ను ఆదేశించాలంటూ కాంగ్రెస్‌- జేడీఎస్‌ అసమ్మతి ఎమ్మెల్యేలు రెండు విడతలుగా సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్‌ వేసిన విషయం విదితమే. ఈ అంశంపై గత శుక్రవారం సుప్రీంకోర్టు విచారించింది. మంగళవారానికి వాయిదా పడిన విచారణను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయి నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం కొనసాగించింది. మూడు పక్షాల న్యాయవాదులు దాదాపు నాలుగు గంటలపాటు సుదీర్ఘ వాదనలు వినిపించారు. స్వచ్ఛందంగా, స్వహస్తాలతో రాసిన రాజీనామా ప్రతులను అందజేసినా కేవలం సంఖ్యాబలం కోల్పోతున్న ప్రభుత్వాన్ని రక్షించేందుకే స్పీకర్‌ ఆలస్యం చేస్తున్నారని అసమ్మతి ఎమ్మెల్యేల తరఫున న్యాయవాది ముకుల్‌ రోహత్గీ పేర్కొన్నారు. ప్రభుత్వంలో కొనసాగలేమని చెబుతున్న ఎమ్మెల్యేలకు రెండు మార్లు విప్‌ ఎందుకు జారీ చేశారని ప్రశ్నించారు. ఈ తరుణంలో ధర్మాసనం స్పందిస్తూ ‘స్పీకర్‌ ఇలానే చేయాలని కోర్టు సూచించలేదు’ అని పేర్కొంది. రాజీనామాలపై స్పీకర్‌ అలసత్వంగా లేరని ఆయన పక్షాన అభిషేక్‌ మను సింఘ్వి తెలిపారు. ఇప్పటికే ఈ రాజీనామాలపై విచారణ మొదలైందన్నారు. ఈనెల 11నే మళ్లీ రాజీనామా చేసినా ఇంతవరకు ఏం చేస్తున్నారని చీఫ్‌జస్టిస్‌ గొగొయి ప్రశ్నించటంతో రాజీనామా, అనర్హతలను వేర్వేరుగా చూడాల్సి ఉందని సింఘ్వి వివరించారు. స్పీకర్‌ ఎంతో అనుభవజ్ఞుడని.. రాజీనామా, అనర్హతలపై రేపే నిర్ణయం తీసుకోగలరని తెలిపారు. ఒక వేళ ఆయన దారి తప్పితే జోక్యం చేసుకోండని విన్నవించారు. ఇది కేవలం స్పీకర్‌, సుప్రీంకోర్టుకు సంబంధించిన వ్యవహారం కాదని.. ఓ మాజీ ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రికి మధ్య పోరు అని ముఖ్యమంత్రి తరఫు న్యాయవాది రాజీవ్‌ధవన్‌ వివరించారు. వ్యక్తిగత ప్రయోజనాలతోనే వారంతా రాజీనామాలు చేశారని, వాటిని అంగీకరించి పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని నిర్వీర్యం చేయరాదని అభ్యర్థించారు. 
భిన్న అంశాలు చర్చకు.. 
ఈ వ్యవహారాన్ని రెండు రాజ్యాంగ సంస్థల మధ్య పోరాటంగా న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ విచారణలో గతంలో సుప్రీంకోర్టు ముందుకు వచ్చిన వివిధ రాష్ట్రాల కేసులకు భిన్నమైన అంశాలు చర్చకు వచ్చాయి. రాజీనామాలు అంగీకరించేలా ఆదేశించాలంటూ ఏ రాష్ట్ర ఎమ్మెల్యేలూ సుప్రీంకోర్టును ఆశ్రయించకపోవడం ప్రస్తావనార్హం. 
రాజ్యాంగబద్ధంగానే వ్యవహరిస్తున్నా: స్పీకర్‌ 
తాను సుప్రీంకోర్టును సవాలు చేసేంత పెద్దవాడిని కాదని స్పీకర్‌ కె.రమేశ్‌కుమార్‌ మంగళవారం ప్రతిస్పందించారు. ఆయన తన స్వగ్రామం అడ్డగరెలో మాట్లాడుతూ రాజ్యాంగబద్ధంగానే తాను వ్యవహరిస్తున్నానన్నారు. ‘బుధవారం సుప్రీంకోర్టు తీర్పు వస్తుంది. అంతవరకు మాట్లాడను. నా నోరు మాత్రమే పెద్దది. పనులు నిబంధనల మేరకే ఉంటాయి’ అని స్పష్టం చేశారు. 
ఎస్‌ఐటీ విచారణకు హాజరైన ఎమ్మెల్యే 
రాజీనామా చేసిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల్లో ఒకరైన రోషన్‌బేగ్‌ను ప్రత్యేక విచారణ బృందం(ఎస్‌ఐటీ) సోమవారం రాత్రి అదుపులోకి తీసుకుంది. ఐఎంఏ కేసుకు సంబంధించి ఇప్పటికే నోటీసులు అందుకున్న ఆయన రెండుసార్లు విచారణకు హాజరుకాలేదు. సోమవారం విమానాశ్రయం నుంచి ఆయన ముంబయికి వెళుతున్నారన్న సమాచారాన్ని అందుకున్న ఎస్‌ఐటీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం విచారణ తర్వాత ఆయన్ను విడిచిపెట్టారు.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.