close
ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌గా బిశ్వభూషణ్‌ 

ఒడిశా భాజపా నేత 
అయిదుసార్లు ఎమ్మెల్యే, ఒకసారి మంత్రిగా పనిచేసిన అనుభవం

ఈనాడు, దిల్లీ : ఆంధ్రప్రదేశ్‌కు కొత్త గవర్నర్‌ నియమితులయ్యారు. ఒడిశాకు చెందిన భాజపా నేత, మాజీ మంత్రి బిశ్వభూషణ్‌ హరిచందన్‌ను నవ్యాంధ్ర గవర్నర్‌గా నియమిస్తూ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టంలోని సెక్షన్‌ 7 ప్రకారం ఇప్పటివరకూ ఇరురాష్ట్రాలకు ఉమ్మడి గవర్నర్‌గా నరసింహన్‌ కొనసాగుతూ వచ్చారు. 85 ఏళ్ల బిశ్వభూషణ్‌ హరిచందన్‌ 1971లో భారతీయ జన్‌సంఘ్‌లో చేరి ఆ పార్టీ జాతీయ కార్యనిర్వాహక సభ్యుడిగా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 1975 ఎమర్జెన్సీ సమయంలో మీసా చట్టం కింద జైలుకెళ్లారు. భాజపా ఏర్పడిన తర్వాత ఆ పార్టీలో చేరి 1980 నుంచి 1988 వరకు ఒడిశా భాజపా అధ్యక్షుడిగా పనిచేశారు. 1988లో జనతాపార్టీలో చేరి రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా సేవలందించారు. 1996లో తిరిగి భాజపాలో చేరారు. న్యాయ విద్యలో పట్టభద్రుడైన ఈయన భాజపా-బీజేడీ  సంకీర్ణ ప్రభుత్వంలో తొమ్మిదేళ్లు (రెండు పర్యాయాలు) మంత్రిగా సేవలందించారు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. హరిచందన్‌ రచయిత కూడా. శేష ఝలక్‌, అస్తాశిఖా, రాణాప్రతాప్‌, మానసి, మారు బతాస్‌ తదితర పుస్తకాలు రచించారు. 
ప్రధానికి కృతజ్ఞతలు : హరిచందన్‌ 
తనకు  గవర్నర్‌గా అవకాశం కల్పించినందుకు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్రమంత్రులు అమిత్‌ షా, ధర్మేంద్ర ప్రధాన్‌లకు హరిచందన్‌ కృతజ్ఞతలు తెలిపారు.  భువనేశ్వర్‌లోని తన నివాస భవనంలో విలేకరులతో మాట్లాడుతూ.. ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల మధ్య సన్నిహిత సంబంధాలున్నాయని, పొరుగు రాష్ట్రం గవర్నర్‌గా ఉభయ ప్రాంతాల మధ్య స్నేహబంధం పెంచేందుకు తాను కట్టుబడతానని చెప్పారు. ఒడిశాకు ప్రధాని మోదీ అధిక ప్రాధాన్యం కల్పించడం ఆనందంగా ఉందని ఆయన చెప్పారు. 
నేతల డిమాండ్ల వల్లనే.. 
ఈయన నియామకంతో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల మధ్య ఉన్న మరో బంధం తెగిపోయింది. పదేళ్లకు మించకుండా హైదరాబాద్‌ ఉమ్మడి రాజధానిగా ఉండటానికి విభజన చట్టంలోని సెక్షన్‌ 5(1) అవకాశం కల్పించింది. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేక హైకోర్టు ఏర్పడేవరకూ హైదరాబాద్‌లో ఉన్న హైకోర్టే ఇరురాష్ట్రాలకు ఉమ్మడిగా సేవలందించే అవకాశాన్ని  సెక్షన్‌ 30(1) కల్పించింది. 2016లో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం హైదరాబాద్‌ నుంచి పూర్తిగా అమరావతికి తరలిపోవడం, 2019 జనవరి 1 నుంచి అమరావతి కేంద్రంగా ప్రత్యేక హైకోర్టు ఏర్పడటంతో ఆ రెండు అంశాలు ముగిసిపోయాయి. ఆంధ్రప్రదేశ్‌ పాలన అమరావతికి వచ్చినప్పుడే  కొత్తరాష్ట్రానికి ప్రత్యేక గవర్నర్‌ను నియమించాలని అప్పటి భాజపా అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు అప్పటి హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు లేఖరాశారు. చంద్రబాబు ఎన్డీయే భాగస్వామిగా ఉన్నప్పుడే ఆయన ఆ మేరకు డిమాండ్‌చేశారు. మోదీ ప్రభుత్వం రెండోసారి కేంద్రంలో అధికారం చేపట్టిన తర్వాత భాజపా తెలంగాణ అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ రెండురాష్ట్రాలకు ఇద్దరు వేర్వేరు గవర్నర్లు ఉండాలని డిమాండ్‌ చేశారు. వీరందరి డిమాండ్లను దృష్టిలో పెట్టుకొని కేంద్రం ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక గవర్నర్‌ను నియమించింది. 
ఛత్తీస్‌గఢ్‌ గవర్నర్‌గా అనసూయ ఉయికె 
ఛత్తీస్‌గఢ్‌  గవర్నర్‌గా మధ్యప్రదేశ్‌ భాజపా నేత అనసూయ ఉయికె నియమితులయ్యారు. ఆ రాష్ట్రానికి గవర్నర్‌గా ఉన్న బలరాందాస్‌ టాండన్‌ 2018 ఆగస్టు 14న కన్నుమూయడంతో మధ్యప్రదేశ్‌ గవర్నర్‌ ఆనందీబెన్‌పటేల్‌కు ఇన్‌ఛార్జి బాధ్యతలు అప్పగించారు. గత 11 నెలలుగా ఆమె ఇరురాష్ట్రాల గవర్నర్‌గా వ్యవహరిస్తూ వచ్చారు. సోమవారం హిమాచల్‌ప్రదేశ్‌ గవర్నర్‌గా భాజపా సీనియర్‌నేత కల్‌రాజ్‌మిశ్రాను నియమించి, అక్కడి గవర్నర్‌ ఆచార్య దేవవ్రత్‌ను గుజరాత్‌కు బదిలీచేశారు. దీంతో రెండురోజుల్లో నలుగురు గవర్నర్ల నియమాకం జరిగినట్లయింది. 
వెంకయ్యనాయుడు అభినందనలు 
ఆంధ్రప్రదేశ్‌ నూతన గవర్నర్‌గా నియమితులైన బిశ్వభూషణ్‌ హరిచందన్‌కు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభినందనలు తెలిపారు. ‘‘ఒడిశాకు చెందిన ఆయన న్యాయవాదిగా, కవిగా, రాష్ట్రమంత్రిగా నాకు సుపరిచితులు, మంచి మిత్రులు. అలాంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌గా నియమితులు కావడం ఆనందదాయకం’’ అని వెంకయ్యనాయుడు ట్విటర్‌లో పేర్కొన్నారు.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.