close
ఈఎస్‌ఐ... అవినీతికి సై 

నిర్ధారణ పరీక్షల కిట్‌లలో కొను‘గోల్‌మాల్‌’ 
వినియోగంపై లెక్కాపత్రాల్లేవు 
ఈఎస్‌ఐ ఆసుపత్రుల్లో అవసరాలకు మించి కొనుగోళ్లు 
నిబంధనలకు పాతరేసిన అధికారులు 
అంతర్గత విచారణలో వెలుగులోకి 
రూ.21 కోట్లు అక్రమంగా చెల్లించినట్లు గుర్తింపు 
అనిశాతో సమగ్ర దర్యాప్తునకు ఆదేశాలు 
మూడు రోజులుగా ఈఎస్‌ఐ సంచాలకుని కార్యాలయంలో సోదాలు

ఈనాడు, హైదరాబాద్‌: ఈఎస్‌ఐ రాష్ట్ర కార్యాలయంలో మరో అవినీతి బాగోతం వెలుగులోకి వచ్చింది. కొందరు ఉన్నతాధికారులు చేతివాటం ప్రదర్శించారు. ఔషధ కొనుగోళ్లలో నిబంధనలకు పాతరేశారు. ఈఎస్‌ఐ ఆసుపత్రులు, డిస్పెన్సరీల్లో నిర్ధారణ పరీక్షల కిట్‌లను అవసరానికి మించి కొన్నట్టుగా అంతర్గత విచారణలో తేలింది. ప్రభుత్వ వైద్య సంస్థలకు సరఫరా చేసే ధరలకే కొనుగోలు చేయాల్సి ఉండగా.. అంతకుమించిన ధరలకు కొన్నారు. 2015-2019 వరకూ కేవలం ఈ కిట్‌ల కోసమే దాదాపు రూ.21 కోట్ల మేరకు అదనంగా చెల్లించినట్లు అంతర్గత విచారణాధికారి ప్రభుత్వానికి నివేదించారు. ఈ నేపథ్యంలో కార్మిక ఉపాధి శిక్షణ శాఖ ముఖ్యకార్యదర్శి శశాంక్‌ గోయల్‌ సమగ్ర దర్యాప్తునకు ఆదేశించారు. అవినీతి నిరోధక శాఖ(అనిశా)కు బాధ్యతలు అప్పగించారు. మూడు రోజులుగా సికింద్రాబాద్‌లోని ఈఎస్‌ఐ రాష్ట్ర కార్యాలయంలో అనిశా అధికారులు సోదాలు చేపట్టారు. మంగళవారం పలు కీలక దస్త్రాలను స్వాధీనపర్చుకున్నారు. ఈఎస్‌ఐ ఆసుపత్రులకు సరఫరా చేసే ఔషధాలు, నిర్ధారణ పరీక్షల కిట్లు, రసాయనాలు, వైద్య పరికరాల కొనుగోళ్లలో అక్రమాలు చోటుచేసుకుంటున్నట్లుగా ఐదేళ్లుగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. టెండరు నిబంధనలను కాలదన్ని అంతర్గత ఒప్పందాలతో  ప్రత్యేకంగా ‘ఎంపిక చేసిన సంస్థల’కే అప్పగిస్తున్నారనే ఆరోపణలు మూడేళ్ల కిందట బయటకొచ్చాయి. ఇదే విషయాన్ని ఈ ఏడాది ఫిబ్రవరిలో నిఘా వర్గాలు ధ్రువీకరించాయి. 2016-17, 2017-18, 2018-19 సంవత్సరాలలో ఎటువంటి టెండర్‌ కమిటీలను ఏర్పాటు చేయకుండా ఔషధాల కొన్నారని నిఘా నివేదిక స్పష్టం చేసింది. బహిరంగ విపణి కంటే ఎక్కువ ధర పెట్టి ఔషధాలను కొంటున్నారని పేర్కొంది. ఈ నేపథ్యంలోనే సనత్‌నగర్‌ ఈఎస్‌ఐ ఆసుపత్రిలో స్పెషల్‌గ్రేడ్‌ సివిల్‌ సర్జన్‌ డాక్టర్‌ సి.గీతను ప్రత్యేక విచారణాధికారిగా ప్రభుత్వం నియమించింది. అంతర్గత విచారణ చేపట్టిన ఆమె నిర్ధారణ పరీక్షల కిట్‌ల కొనుగోలులో అక్రమాలు చోటుచేసుకున్నట్లుగా గుర్తించారు. మే 27న నివేదికను అందజేశారు. సంబంధిత సరఫరా సంస్థలపై, బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేశారు. 
ప్రభుత్వ ఆసుపత్రులకు నిర్ధారణ పరీక్షల కోసం కిట్‌లను, రసాయనాలను సరఫరా చేస్తున్న తెలంగాణ రాష్ట్ర వైద్యసేవలు మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ(టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ) నిర్ధారించిన టెండర్‌ ధరల కంటే ఈఎస్‌ఐ ఆసుపత్రుల కోసం కొనుగోలు చేసిన ధరలు అధికంగా ఉన్నాయి. 
‘ట్రోపోనిన్‌’ కిట్‌ను గుండె రక్తనాళాల్లో పూడికలు ఏర్పడి గుండెపోటు సంకేతాలు వెలువడినప్పుడు.. అత్యవసరంగా పరీక్షించడానికి వినియోగిస్తారు. అలాగే ‘హెచ్‌బీఎస్‌ ఏజీ’ కిట్‌ను ‘హెపటైటిస్‌ బి’ అనే కాలేయ ఇన్‌ఫెక్షన్‌ను గుర్తించడానికి వాడతారు. అత్యంత ఖరీదైన, అతి ముఖ్యమైన ఈ పరీక్షలను సాధారణంగా ఆసుపత్రుల్లోనే చేస్తుంటారు. డిస్పెన్సరీల్లో చేయరు. వీటి కొనుగోళ్లలోనూ అక్రమాలకు పాల్పడ్డారు. 
కేవలం సంయుక్త సంచాలకుల కార్యాలయంలో మాత్రమే నిర్ధారణ పరీక్షల కిట్‌ల కొనుగోలు, నిల్వ సమాచారాన్ని పొందుపర్చి, క్షేత్రస్థాయిలో, కేంద్ర గోదాముల్లో సంబంధిత సమాచారాన్ని పొందుపర్చలేదు. 
2015-16 నుంచి 2017-18 వరకూ మూడేళ్లలో హైదరాబాద్‌ సంయుక్త సంచాలకుల పరిధిలో సుమారు రూ.15 కోట్లు, వరంగల్‌ సంయుక్త సంచాలకుల పరిధిలో సుమారు రూ.11.86 లక్షల విలువైన ఔషధాల కొనుగోళ్లలో ఆర్థిక వ్యత్యాసాలు గుర్తించినట్లుగా నివేదికలో పొందుపర్చారు.

మచ్చుకు కొన్ని కేంద్రాల్లో..

ఉదాహరణకు శామీర్‌పేట ఈఎస్‌ఐ డిస్పెన్సరీకి 28.07.2015లో 20 ట్రోపోనిన్‌ కిట్లు, 15.10.2016లో 10 కిట్‌లను సరఫరా చేశారు. ఇక్కడ ట్రోపోనిన్‌ కిట్‌లను ఎన్నడూ వినియోగించలేదని ఈ డిస్పెన్సరీలో పనిచేసే ల్యాబ్‌ టెక్నీషియన్‌ వెల్లడించారు. సమాచార పుస్తకంలోనూ వినియోగించినట్లుగా నమోదు చేయలేదు. అయితే అదే ల్యాబ్‌ టెక్నీషియన్‌ 2016 జూన్‌, జులైల్లో ‘ట్రోపోనిన్‌’ కిట్‌లను వైద్యశిబిరాల్లో వినియోగించినట్లు పేర్కొన్నారు. సాధారణంగా వైద్య శిబిరాల్లో ఈ కిట్‌లను వినియోగించరు. 
కోహెడ డిస్పెన్సరీలో 2016 ఏప్రిల్‌లో 24 హెచ్‌బీఎస్‌ ఏజీ కిట్‌లను, అదే ఏడాది మేలో 74 కిట్‌లను సరఫరా చేయగా.. అన్నింటినీ వినియోగించారు గానీ ఒక్కదాని సమాచారమూ లేదు. 
ఐడీఏ బొల్లారంలోని ఈఎస్‌ఐ డిస్పెన్సరీకి 20 ట్రోపోనిన్‌ కిట్‌లను సరఫరా చేయగా.. వీటిని కూడా వైద్య శిబిరాల్లోనే వినియోగించినట్లుగా అక్కడి వైద్యాధికారి పేర్కొన్నారు. 
బొంతపల్లి ఈఎస్‌ఐ డిస్పెన్సరీలోనూ 2015లో కేవలం 15 రోజుల వ్యవధిలో రెండు విడతలుగా మొత్తం 70 ట్రోపోనిన్‌ కిట్‌లను సరఫరా చేయగా.. ఒక్కదాని వినియోగం కూడా వినిమయ సమాచార పుస్తకంలో లేదు. 
చర్లపల్లి, జహీరాబాద్‌, మహబూబ్‌నగర్‌ జిల్లా బాలానగర్‌, కాటేదాన్‌, శామీర్‌పేట, ఐడీఏ బొల్లారం, బొంతపల్లి, సదాశివపేట తదితర ఈఎస్‌ఐ డిస్పెన్సరీల్లో సాధారణంగా రోజూ వచ్చే ఓపీ సేవల కంటే అధికంగా నిర్ధారణ పరీక్షల కిట్‌లను వినియోగించారు. 
కేంద్ర ఔషధ గోదాములº మందులను సరఫరా చేసినప్పుడు నమోదు చేయాల్సి ఉండగా నిబంధనలను పాటించడంలేదు. అసలు ఎన్ని ఔషధాలున్నాయనే లెక్కాపత్రం కూడా సరిగ్గా నిర్వహించడంలేదు. 
కొన్ని మందులకు ఇటు కేంద్ర ఔషధ గోదాములో అటు ఈఎస్‌ఐ డిస్పెన్సరీల్లో కూడా నమోదు చేయలేదు. ఈఎస్‌ఐ సంయుక్త సంచాలకుల కార్యాలయంలో మాత్రం  సమాచారం ఉంది. 
కొన్ని రకాల ఔషధాలను ఏడాదికి సరిపడేంత నిల్వనూ ఒకేసారి కొనేందుకు ఉత్తర్వులిచ్చారు. సరఫరా సంస్థ మాత్రం విడతల వారీగా సరఫరా చేసింది.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.