close
ఈఎస్‌ఐలో గుత్తాధిపత్యం

ఇక్కడ ఒకరిద్దరిదే రాజ్యం
బినామీ పేర్లతో టెండర్లు దక్కించుకుంటున్న వైనం
కార్మిక శాఖలో అన్ని స్థాయిల్లోనూ చక్రం తిప్పేది వీరే
వీరికి అండగా నిబంధనలకు తూట్లు పొడుస్తున్న అధికారులు

ఈనాడు, హైదరాబాద్‌: ఈఎస్‌ఐ ఆసుపత్రుల వ్యవహారాలను పర్యవేక్షించే తెలంగాణ రాష్ట్ర బీమా వైద్య సేవల సంచాలకుల కార్యాలయం అక్రమాలకు అడ్డాగా, ఒకరిద్దరు గుత్తేదార్ల గుత్తాధిపత్యానికి కేంద్రంగా మారింది. ఉన్నతస్థాయిలో అండదండలు ఉండటంతో ఈఎస్‌ఐ కొనుగోళ్లలో వారు ఆడింది ఆటగా, ఇష్టారాజ్యంగా దోపిడీపర్వం నిరాటంకంగా కొనసాగుతోంది. ఆసుపత్రులు, డిస్పెన్సరీలకు అవసరమైన ఔషధాలు, నిర్ధారణ పరీక్షలకు అవసరమైన రసాయనాలు, కిట్ల కొనుగోలులో యథేచ్ఛగా అక్రమాలకు తెగబడుతున్నారు. బినామీ పేర్లతో కుటుంబ సంస్థలను నిర్వహిస్తూ.. కొనుగోలు టెండర్లను తమకే దక్కేలా అన్ని స్థాయిల్లోనూ కార్మిక శాఖలో ఈ గుత్తేదార్లే చక్రం తిప్పుతున్నారనే విమర్శలున్నాయి. ఇటీవల విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం ఇచ్చిన నివేదికలోనూ నిబంధనలకు విరుద్ధంగా కుటుంబ సంస్థలకే టెండర్లను కట్టబెట్టారని స్పష్టం చేసింది. ఈ వ్యవహారంలో అన్ని స్థాయిల్లోనూ భారీగానే ముడుపులు చేతులు మారినట్లు ఆరోపణలున్నాయి.

ఆ సంస్థలకు అనుకూలం
* అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఒప్పంద ధర పరిధిలోలేని సంస్థల నుంచి కొనుగోలు చేయాల్సి ఉండగా.. 2016-17, 2017-18లలో దాదాపు రూ.210 కోట్లకు పైగా సరఫరా బాధ్యతలను ఇలాంటి సంస్థలకే అప్పగించారు.
* ఇందులోనూ కొన్ని కుటుంబ సంస్థలే ఉండటం గమనార్హం. వీటిలో ఒక సంస్థకూ మరోదానికి మధ్య అంతర్గత సంబంధాలున్నట్లు గుర్తించారు.
* ఒక సరఫరా సంస్థ అయితే ఏడాది(2016-17లో) అమ్మకాలు, సరఫరాలో 73 శాతం, మరో సంస్థ 95 శాతం అమ్మకాలు, సరఫరాను ఈఎస్‌ఐకే చేయడం విజిలెన్స్‌ విభాగ నివేదికలో ప్రస్తావించింది.
* ఒకే కుటుంబానికి చెందిన వేర్వేరు సంస్థలు స్వల్పంగా ధరలను మార్చి, టెండర్లను దక్కించుకున్నాయి.
* ఔషధ కొనుగోళ్లలో తప్పనిసరిగా ‘ఔషధ నిల్వ కమిటీ’ని ఏర్పాటుచేసి, ఆ కమిటీ ఆమోదం పొందాలి. 2016-17, 2017-18, 2018-19 సంవత్సరాల కొనుగోళ్లలో ఎలాంటి కమిటీలను ఏర్పాటు చేయలేదు.
* ఏ ఔషధాలు కావాలనే జాబితాను సంబంధిత ఔషధ సంస్థల ప్రతినిధులకే నేరుగా అందజేశారు. కనీసం ఎవరు తీసుకెళ్తున్నారో వారి సమాచారం కూడా ఈఎస్‌ఐ కార్యాలయంలో లేదు. కేవలô ఆ ప్రతినిధి పొట్టి సంతకం మాత్రం ‘ఔట్‌వార్డు నమోదు పుస్తకం’లో పొందుపరిచారు. కొన్నింటిని సాధారణ తపాలా ద్వారా పంపించారు. ఆయా సంస్థలకు జాబితా ముట్టిందో లేదో తెలిపే పత్రాన్ని కూడా తపాలా పంపిణీలో జత చేయలేదు. నమోదు పుస్తకంలోనూ ఔషధ అవసర పత్రాలు ముట్టాయా? లేదా? అనే సమాచారాన్ని పొందుపరచలేదు. దీన్నిబట్టి ఉద్దేశపూర్వకంగానే వ్యవహరించారని స్పష్టమవుతోంది.
* సాధారణంగా టెండరులో తక్కువ ధరను పొందుపరిచిన(ఎల్‌1) సంస్థకు ఔషధ సరఫరా బాధ్యతను అప్పగిస్తారు. ఒకవేళ ఆ సంస్థ ఔషధాలను సరఫరా చేయలేని పరిస్థితుల్లో తక్కువ ధరను పొందుపరచడంలో రెండో, మూడో స్థానంలో ఉన్న సంస్థలకు అవకాశమిస్తారు. ఇక్కడ అలాంటి ప్రయత్నమే జరగలేదు. ఔషధాలను సరఫరా చేయనందుకు ఎల్‌1 సంస్థపై చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ఎల్‌2, ఎల్‌3లతో సంప్రదించకుండా నేరుగా విపణిలో అత్యధిక ధరలతో కొత్తగా ఔషధాలను కొనుగోలు చేశారు.
* ఉదాహరణకు ముందే కుదుర్చుకున్న ఔషధ ధరలో ఎల్‌1 టెండర్‌ ధర ‘హ్యుమన్‌ ఇన్సులిన్‌’ 10ఎంఎల్‌ వైల్‌కు రూ.66.72 ఉండగా.. దీన్ని బహిరంగ విపణిలో ఒక్కోదానికి రూ.139.59 చొప్పున కొన్నింటిని, రూ.122.82 చొప్పున మరికొన్నింటిని కొనుగోలు చేశారు. ఇలా పలురకాల ఔషధాలను కొనడంతో రూ.కోట్లలో వ్యత్యాసం వచ్చింది.
* 2016-17లో ఒప్పంద ధరల ప్రకారం రూ.113.91 కోట్లకు కొనుగోలు చేయగా.. ఒప్పంద ధర కాకుండా విపణి ధర ప్రకారం 101.66 కోట్ల ఔషధాలు కొన్నారు. 2017-18లోనూ ఒప్పంద ధరలో రూ.142.87 కోట్ల మందులు కొనుగోలు చేయగా.. ఒప్పంద ధర లేకుండా రూ.66.60 కోట్ల మందులు కొన్నారు.
* ఆన్‌లైన్‌లో టెండరు విధానాన్ని నిర్వహించకుండా గోప్యంగా తమకు నచ్చిన సంస్థలకు టెండర్లు కట్టబెట్టే విధంగా వ్యవహరించారు.
* కొనుగోళ్లలో ఎక్కువ సంస్థలకు అవకాశమివ్వడానికి అనుకూలంగా విస్తృత స్థాయిలో అసలు ప్రచారమే నిర్వహించలేదు. రూ.25 లక్షలు, ఆ పైన నిధులను ఖర్చు పెట్టాలంటే తప్పనిసరిగా టెండరుకు వెళ్లాలి. పేరున్న పత్రికల్లో టెండరుకు సంబంధించిన ప్రకటనలివ్వాలి. పత్రికా ప్రకటన ఇవ్వకుండా కొనుగోలు చేయాల్సి వస్తే.. ఎలాంటి అత్యవసర పరిస్థితుల్లో సమయాభావం కారణంగా కొనుగోలు చేశారనే సమాధానాన్ని లిఖితపూర్వకంగా పొందుపర్చాలి. ఈ నిబంధనలేవీ పాటించలేదు. కేవలం కార్యాలయ ప్రకటన బోర్డుపై సంబంధిత సమాచారాన్ని అతికిస్తున్నారు. ఎవరైతే క్రమం తప్పకుండా టెండర్లు పొందుతున్నారో వారికే ఆ సమాచారం తెలుస్తోంది.

అక్రమార్కులపై వేటుకు రంగం సిద్ధం

ఈనాడు, హైదరాబాద్‌: కార్మికశాఖ పరిధిలోని రాష్ట్ర బీమా వైద్యసేవల విభాగంలో మందులు, పరికరాల కొనుగోలులో అక్రమాలకు కారకులపై వేటుకు రంగం సిద్ధమైంది. అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) విచారణ కొనసాగిస్తూనే, ఇప్పటికే ఇచ్చిన విజిలెన్సు నివేదిక ఆధారంగా చర్యలపై ముందుకు వెళ్లాలని ప్రభుత్వం నిశ్చయించింది. తొలుత ఈ అక్రమాలకు పాల్పడిన ఇద్దరు ఉన్నతాధికారులను పక్కనపెట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు త్వరలో అధికారికంగా నిర్ణయం వెలువడనుంది. ఈఎస్‌ఐలో అక్రమాలను తీవ్రంగా పరిగణించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఇప్పటికే ఆ శాఖ మంత్రి, ఉన్నతాధికారులను పిలిచి ఆరా తీశారు. అవినీతి అధికారులపై వేటు వేయాలని ఇప్పటికే ఆదేశించినట్లు తెలిసింది. రాష్ట్రపరిధిలోని ఈఎస్‌ఐ, ప్రభుత్వాసుపత్రుల్లో మందులు, పరికరాల కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం వద్ద నమోదైన సరఫరా సంస్థలను టెండరు ప్రక్రియలో ఎంపిక చేయాలి. ఒకవేళ నమోదైన సరఫరాదారు అత్యవసర సమయంలో (రోగి ప్రాణాలు కాపాడేందుకు) పంపిణీ చేయలేనప్పుడు బయట కొనేందుకు అనుమతి ఉంది. ఈ నిబంధనను అడ్డుపెట్టుకుని బీమా వైద్యసేవల విభాగంలో ఏటా ఇదే పద్ధతిలో మందులు, కిట్‌లు కొంటున్నట్లు అంతర్గత విచారణలో గుర్తించింది.


 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.