close
ఆ రూ. 93 లక్షలు ఎక్కడివి?

తహసీల్దారు లావణ్యను ప్రశ్నించనున్న అనిశా

ఈనాడు, హైదరాబాద్‌: అవినీతి కేసులో అరెస్టయిన తహసీల్దారు లావణ్య ఇంట్లో దొరికిన రూ.93 లక్షలు ఎక్కడివి? అసలు ఆమె అక్రమార్జన ఎంత? ఆస్తులు ఎక్కడెక్కడ.. ఎవరిపేర్లతో ఉన్నాయి? ఇప్పుడు అవినీతి నిరోధకశాఖ (అనిశా) అధికారుల మదిని తొలుస్తున్న ప్రశ్నలివే. వీటికి సమాధానం రాబట్టడానికి ఆమెను విచారించేందుకు అనుమతివ్వాలంటూ అధికారులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. రెండు రోజుల విచారణకు న్యాయస్థానం అనుమతివ్వడంతో శుక్రవారం లావణ్యను అదుపులోకి తీసుకోనున్నారు. రంగారెడ్డి జిల్లా కేశంపేట తహసీల్దారుగా పనిచేస్తున్న లావణ్య భారీగా అక్రమాలకు పాల్పడినట్లు అనిశా అధికారులు అనుమానిస్తున్నారు. ఆమె ఇంట్లో రూ.93 లక్షల నగదు దొరకడం వారిని ఆశ్చర్యానికి గురి చేసింది. అవినీతికి పాల్పడ్డప్పటికీ ఉద్యోగులు ఎవరూ తమ ఇంట్లో ఇంత పెద్దమొత్తంలో నగదు నిల్వ చేసుకోరు. పైగా రెవెన్యూశాఖపై అనిశా వరుసగా సోదాలు చేస్తున్న నేపథ్యంలో మరింత జాగ్రత్తగా ఉంటున్నారు. అయినప్పటికీ లావణ్య అంత డబ్బు ఇంట్లో ఎందుకు పెట్టుకున్నారనేది అధికారులకు అంతుపట్టడంలేదు. గతంలోనూ ఆమెపై అవినీతి ఆరోపణలున్నాయని, లోతుగా దర్యాప్తు జరిపితే మరిన్ని ఆస్తులు, అక్రమాలు బయటపడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. కేశంపేట మండలం దత్తాయపల్లికి చెందిన మామిడిపల్లి భాస్కర్‌ అనే రైతు పొలం వివరాలు సర్వే రికార్డుల్లో నమోదు చేసేందుకు కొందుర్గు వీఆర్వో అనంతయ్య రూ.8లక్షలు లంచం డిమాండ్‌ చేసిన సంగతి తెలిసిందే. రైతు ఫిర్యాదు మేరకు అనిశా అధికారులు తొలుత అనంతయ్యను, అనంతరం ఆయన ఇచ్చిన సమాచారం ఆధారంగా లావణ్యను అరెస్టు చేశారు. హయత్‌నగర్‌లోని లావణ్య ఇంట్లో ఏకంగా రూ.93లక్షల నగదు దొరికింది. దర్యాప్తులో ఆమె సోదరుడి బ్యాంకు ఖాతాలో రూ.20లక్షలు, బంధువు ఖాతాలో రూ.10లక్షలు. మరో బంధువు ఖాతాలో రూ.8 లక్షలు దొరికాయి. ఇవి కూడా అక్రమార్జన తాలూకు సొమ్మేనని అధికారులు అనుమానిస్తున్నారు. మరోవైపు లావణ్య బ్యాంకు ఖాతాల వివరాలేవీ లభించలేదు. వేతనం తీసుకోవడానికైనా బ్యాంకు ఖాతా నిర్వహించాలి. ఆమె ఖాతా వివరాలేవీ లభించలేదంటే పాసుబుక్కులు ఎక్కడయినా దాచిపెట్టి ఉంటారా? అని అధికారులు అనుమానిస్తున్నారు. కేశంపేట చుట్టుపక్కల ఈ మధ్యకాలంలో స్థిరాస్తి వ్యాపారం జోరందుకుంది. దీని తాలూకు లావాదేవీలో భాగంగానే ఒకేసారి ఎవరో రూ.93లక్షలు ఇచ్చి ఉంటారని, తర్వాత సర్దుబాటు చేయొచ్చనే ఉద్దేశంతో ఆ డబ్బును తన ఇంట్లో తెచ్చి పెట్టుకొని ఉండవచ్చని, ఈలోపే అనూహ్య సోదాలతో నగదు పట్టుబడిందని అధికారులు అనుమానిస్తున్నారు. అదే నిజమైతే పెద్దమొత్తంలో డబ్బు ముట్టజెప్పి ఉంటారంటే దానికి సంబంధించిన లావాదేవీ అదే స్థాయిలో ఉండి ఉంటుందని భావిస్తున్నారు. అసలు ఈ డబ్బు ఎలా వచ్చిందో తేలితే మిగతా వివరాలు తెలుస్తాయని అనుకుంటున్నారు.

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.