close
ఇప్పటికిప్పుడు నోటిఫికేషన్‌ ఇవ్వడం లేదు

మున్సిపల్‌ ఎన్నికలపై హైకోర్టుకు హామీ ఇచ్చిన ఎన్నికల సంఘం
వార్డుల విభజన చట్టబద్ధంగా జరగాలి
ఎన్ని అభ్యంతరాలు వచ్చాయి.. ఎన్ని పరిష్కరించారో చెప్పండి
పూర్తి వివరాలు సమర్పించాలంటూ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
ఈ నెల 22కి విచారణ వాయిదా
ఈనాడు - హైదరాబాద్‌

రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణ నిమిత్తం ఇప్పటికిప్పుడు హడావుడిగా ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ చేయడం లేదని రాష్ట్ర ఎన్నికల సంఘం గురువారం హైకోర్టుకు నివేదించింది. వార్డుల విభజన ప్రక్రియలో అభ్యంతరాల కారణంగా కొన్ని మున్సిపాలిటీల ఎన్నికలను నిలిపివేస్తూ సింగిల్‌ జడ్జి మధ్యంతర ఉత్తర్వుల జారీ చేసిన నేపథ్యంలో.. ఇప్పటికిప్పుడు ఎన్నికలను నిర్వహించడం లేదన్న హామీని హైకోర్టు రికార్డు చేసుకుంది. మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వం హడావుడిగా తీసుకుంటున్న నిర్ణయంపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. వార్డుల విభజన చట్ట ప్రకారం జరగాలని స్పష్టం చేసింది. వార్డుల విభజనపై ఎన్ని అభ్యంతరాలు వచ్చాయి? ఎన్నింటిని పరిష్కరించారు? తదితర వివరాలతో కౌంటరు దాఖలు చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

మున్సిపల్‌ ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఓటర్ల గుర్తింపు, వార్డుల విభజన తదితరాలకు గడువు విధిస్తూ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్‌లను సవాలు చేస్తూ నిర్మల్‌ జిల్లాకు చెందిన న్యాయవాది కె.అంజున్‌ కుమార్‌రెడ్డి ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌.ఎస్‌.చౌహాన్‌, జస్టిస్‌ షమీమ్‌ అక్తర్‌లతో కూడిన ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. పిటిషనర్‌ తరఫు న్యాయవాది సీహెచ్‌ నరేష్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ..గత నెల 25న సింగిల్‌ జడ్జి ముందు దాఖలైన పిటిషన్‌లలో ఎన్నికల ముందస్తు ప్రక్రియకు 109 రోజులు పడుతుందని ప్రభుత్వం చెప్పిందని, మరో 10రోజులు అదనంగా కలుపుకుని 119 రోజుల్లో పూర్తి చేయాలని సింగిల్‌ జడ్జి ఉత్తర్వులు జారీ చేశారన్నారు. ప్రభుత్వం 30 రోజుల్లోనే ఎన్నికలకు ముందు ప్రక్రియను పూర్తి చేస్తోందన్నారు. హడావుడిలో వార్డుల విభజనపై అభ్యంతరాలను పరిష్కరించడం లేదని తెలిపారు. ధర్మాసనం జోక్యం చేసుకుంటూ సింగిల్‌ జడ్జి వద్ద ఇచ్చిన హామీకి విరుద్ధంగా ఎన్నికల ప్రక్రియను ఎలా కొనసాగిస్తున్నారని ప్రశ్నించింది.

10 మున్సిపాలిటీల్లోనే అభ్యంతరాలు: ఏఏజీ
గడువులోగా ఎన్నికలను నిర్వహించడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ (ఏఏజీ) జె.రామచంద్రరావు తెలిపారు. వార్డుల విభజన ప్రక్రియ ఒక్కటే పూర్తికావాల్సి ఉందన్నారు. 132 మున్సిపాలిటీలకుగాను పదింటిలోనే అభ్యంతరాలు వ్యక్తమయ్యాయని, వాటిని పరిష్కరించే పనిలో అధికారులున్నారని తెలిపారు. గతేడాది నుంచి వెంటవెంటనే వస్తున్న అసెంబ్లీ, పార్లమెంట్‌, పంచాయతీ, మున్సిపాలిటీ ఎన్నికలతో అధికారులు తీరిక లేకుండా ఉన్నారని చెప్పారు. గత ఎన్నికల్లోని ఓటర్ల జాబితానే పురపోరులోనూ కొనసాగిస్తున్నట్లు వివరించారు. ధర్మాసనం జోక్యం చేసుకుంటూ..ఎన్నికల్లో ముఖ్యమైన వార్డుల విభజనను హడావుడిగా ఎలా చేస్తారని ప్రశ్నించింది. అభ్యంతరాలను సమర్పించడానికి నాలుగు రోజులు గడువిచ్చి, ఒక్క రోజులో ఎలా పరిష్కరిస్తారని అడిగింది. వందల కొద్దీ అభ్యంతరాలను రాత్రికిరాత్రి పరిష్కరించడం మానవ సాధ్యమా?అని ప్రశ్నించింది. ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా ఉండాలని, లేదంటే ప్రజాస్వామ్యంపై విశ్వాసం సన్నగిల్లుతుందని వ్యాఖ్యానించింది. ప్రపంచంలోనే ఆదర్శంగా మన ప్రజాస్వామ్యం ఉందన్నారు. ఎన్నికల నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వం సహకరించలేదంటూ ఎన్నికల సంఘం హైకోర్టును ఆశ్రయించడం ఇదే మొదటిసారి కావచ్చని వ్యాఖ్యానించింది. ఎన్నికలను సజావుగా నిర్వహించడంలో మీ పాత్ర లేదా? అంటూ ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించగా ఎన్నికల సంఘం తరఫు సీనియర్‌ న్యాయవాది జి.విద్యాసాగర్‌ సమాధానమిస్తూ.. ఇప్పటికే మున్సిపల్‌ కమిషనర్లకు లేఖ రాసినట్లు చెప్పారు. ఓటర్లు లేవనెత్తిన అభ్యంతరాలతోపాటు సింగిల్‌ జడ్జి ఇచ్చిన స్టే ఉత్తర్వులను పరిగణనలోకి తీసుకోవాలని ఆదేశించినట్లు తెలిపారు. ఇప్పటికిప్పుడు ఎన్నికల నోటిఫికేషన్‌ జారీచేసే అవకాశం లేదని చెప్పారు. ఇదే హామీని రికార్డు చేసుకున్న ప్రభుత్వం పూర్తివివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఎన్నికల సంఘం, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశిస్తూ విచారణను ఈనెల 22వ తేదీకి వాయిదా వేసింది.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.