close
కర్నాటకం వాయిదా

కాంగ్రెస్‌-భాజపా మాటల యుద్ధం
అభ్యంతరాల నేపథ్యంలో సభ 4సార్లు వాయిదా
గవర్నర్‌ జోక్యంపై సభలో రచ్చ
కుమారస్వామి విశ్వాస తీర్మానంపై నేడు చర్చ
రాత్రివేళ కూడా సభలోనే భాజపా ఆందోళన

ఈనాడు డిజిటల్‌, బెంగళూరు: కర్ణాటక విధానసభలో గురువారం ప్రవేశపెట్టిన విశ్వాస తీర్మానం రణగొణధ్వనుల మధ్య ఎంతకూ తేలలేదు. తీవ్ర గందరగోళం తలెత్తి చివరకు సభ శుక్రవారానికి వాయిదా పడింది. ఈ క్రమంలో రాజ్యాంగ, రాజకీయ సంక్షోభం ఏర్పడింది. ముఖ్యమంత్రి కుమారస్వామి తనకు తానుగా విశ్వాస పరీక్షకు గడువు కోరి స్పీకర్‌ అనుమతితో గురువారం ఓటింగ్‌కు హాజరయ్యారు. తీర్మానానికి ఉదయం 11.15 గంటలకు స్పీకర్‌ అనుమతినిచ్చారు. విశ్వాస పరీక్షకు దారి తీసిన అంశాలపై ముఖ్యమంత్రి కుమారస్వామి ప్రసంగిస్తుండగానే.. నేరుగా తీర్మానాన్ని ప్రవేశపెట్టాలంటూ విపక్షాలు పట్టుబట్టాయి. ఈ తీర్మానంపై కాంగ్రెస్‌ అభ్యంతరాన్ని లేవనెత్తడంతో మొదలైన గందరగోళం చివరి వరకు కొనసాగింది. సభాపర్వంలో పాలక, ప్రతిపక్షాల మధ్య వాదోపవాదాల నేపథ్యంలో గవర్నర్‌ వజూభాయివాలా సైతం జోక్యం చేసుకుని విశ్వాస పరీక్షపై సూచనలిచ్చారు. గవర్నర్‌ జోక్యాన్ని కూడా సభ్యులు సవాలు చేయటంతో చివరకు సభ వాయిదాల బాట పట్టింది.

సభ నడిచిన తీరు..
భాజపాకు చెందిన 105 మంది ఎమ్మెల్యేలు సభకు వచ్చారు. మిత్రపక్షాలకు చెందిన 20 మంది మినహా మిగిలిన వారంతా హాజరయ్యారు. సభలో తొలుత విశ్వాస పరీక్షకు తాము సిద్ధమైన నేపథ్యాన్ని వివరిస్తూ 15 నిమిషాల పాటు కొనసాగిన ముఖ్యమంత్రి ప్రసంగాన్ని ప్రతిపక్ష నేత యడ్యూరప్ప అడ్డుకున్నారు. గతంలో ఐదుసార్లు  ఎలాంటి చర్చలు లేకుండానే నేరుగా విశ్వాస పరీక్షను ఎదుర్కొన్నట్లు గుర్తుచేశారు. తీర్మానంలో భాగంగానే చర్చలకు అవకాశం ఉందని స్పీకర్‌ స్పష్టం చేశాక సభలో నాటకీయ పరిణామాలు మొదలయ్యాయి. పలు రాజ్యాంగ నిబంధనలపై కాంగ్రెస్‌, జనతాదళ్‌ అభ్యంతరాలు తెలిపాయి. సభ్యుల అభ్యంతరాలపై న్యాయనిపుణుల సలహాలు తీసుకునేందుకు మధ్యలో నాలుగు సార్లు స్పీకర్‌ సభను వాయిదా వేస్తూ వచ్చారు. గవర్నర్‌ సందేశం, విప్‌ హక్కులు, సుప్రీంకోర్టు తీర్పులకు సంబంధించిన వ్యవహారాలపై కూడా వారితో చర్చించారు.

మేం నష్టపోయాం: కాంగ్రెస్‌
‘విప్‌తో రాజీనామా చేసిన సభ్యులపై ఒత్తిడి తేవద్దన్న సుప్రీంకోర్టు ఆదేశం అన్ని పార్టీల హక్కులనూ ఉల్లంఘించేలా ఉంది’ అని కాంగ్రెస్‌ శాసనసభా పక్ష నేత సిద్ధరామయ్య తీవ్ర స్థాయిలో అభ్యంతరం తెలిపారు. ‘పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం వాటి హక్కులపై తీర్పు వెల్లడించాలంటే ఆ పార్టీల వాదనను కూడా వినాలి. మా ఎమ్మెల్యేల విషయంలో మా వాదనను పరిగణించ లేదు’ అని తప్పుపట్టారు. ‘విప్‌పై సుప్రీంకోర్టు తీర్పుతో రాజీనామా చేసిన ఎమ్మెల్యేలకు మానసిక స్థైర్యం పెరిగింది. కేవలం ఈ తీర్పుతోనే మా ప్రభుత్వ బలం క్షీణించింది’ అని సిద్ధరామయ్య ఆరోపించారు. ఇదే సందర్భంగా శాసనసభ వ్యవహారాల మంత్రి కృష్ణభైరేగౌడ మాట్లాడుతూ.. రాజీనామాలు అంగీకరించని ఎమ్మెల్యేలు సభలో సభ్యులా? కాదా? ముందు తేల్చండని స్పీకర్‌పై ఒత్తిడి తెచ్చారు. ఈ రెండు అంశాలపై స్పష్టత కోసం న్యాయపోరాటానికైనా సిద్ధమని కాంగ్రెస్‌ సభ్యులు ప్రకటించారు. భోజన విరామం తర్వాత మళ్లీ సభ ప్రారంభం కాగా పాలకపక్ష సభ్యులు తమ ఎమ్మెల్యేలను భాజపా నేతలు అపహరించారంటూ గురువారం సభకు హాజరుకాని శ్రీమంత్‌ పాటిల్‌ వ్యవహారంపై రాద్ధాంతం చేశారు. ఎమ్మెల్యేలను భాజపా నేతలే దగ్గరుండి ముంబయికి పంపించారని దాఖలాలతో ఆందోళనకు దిగారు.

సమయం వృథానే: భాజపా
విశ్వాస పరీక్షలో నెగ్గలేమనే భయంతోనే మిత్రపక్షాలు సభాకాలాన్ని వృథా చేస్తున్నాయని భాజపా సభ్యులు ఆందోళన చేశారు. తీర్మానంలో విప్‌కు సంబంధించిన అంశాలపై చర్చ ఎందుకని ప్రశ్నించారు. సుప్రీంకోర్టు తీర్పుపై అభ్యంతరం ఉంటే అక్కడే తేల్చుకోవాలని, సభలో చర్చించకూడదని ప్రతిపక్ష నేత యడ్యూరప్ప అభ్యంతరం తెలిపారు. తామంతా విశ్వాస పరీక్ష కోసమే సభకు హాజరయ్యామన్నారు. ముఖ్యమంత్రి స్వయంగా కోరిన గడువు మేరకే ఈ తీర్మానానికి స్పీకర్‌ అనుమతిచ్చారని, లేదంటే తామే తీర్మానాన్ని ప్రవేశపెట్టేవారమని భాజపా అసహనం వ్యక్తం చేసింది.

గవర్నర్‌కు భాజపా ఫిర్యాదు
సభను ఉద్దేశపూర్వకంగా వాయిదా వేస్తున్నారని, సభా వ్యవహారాలపై జోక్యం చేసుకోవాలని మాజీ ముఖ్యమంత్రి జగదీశ్‌ శెట్టర్‌ నేతృత్వంలోని భాజపా బృందం గవర్నర్‌ వజూభాయివాలాను కలిసి కోరింది. వీరి ఫిర్యాదు మేరకు స్పీకర్‌కు గవర్నర్‌ సందేశాన్ని పంపారు. గురువారమే విశ్వాస పరీక్షకు అవకాశం కల్పించాలని గవర్నర్‌ సూచించారు. దీన్ని పరిశీలించిన స్పీకర్‌.. ఇది సందేశమేనని, ఆదేశం కాదని అన్నారు. సభా వ్యవహారాల్లో గవర్నర్‌ జోక్యం కలుగజేసుకోరాదని కాంగ్రెస్‌ సభ్యులంతా పట్టుబట్టారు. రాత్రి వేళ గవర్నర్‌ పంపిన మరో లేఖలో శుక్రవారం మధ్యాహ్నంలోగా విశ్వాస తీర్మానంపై ఓటింగ్‌ జరపాలని సూచించారు.

సభలోనే ఆందోళన
విశ్వాసపరీక్ష లేకుండానే సభ వాయిదా పడటంతో భాజపా ఆందోళనకు దిగింది. గురువారం రాత్రంతా సభలోనే నిద్రిస్తామని యడ్యూరప్ప ప్రకటించారు. మరో వైపు విప్‌ అంశంపై సుప్రీంకోర్టు తీర్పును సవాలు చేస్తూ కాంగ్రెస్‌ పార్టీ సుప్రీంకోర్టు తలుపు తట్టేందుకు సిద్ధమైంది.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.