close
పతాక స్థాయి సంక్షోభం 

కర్ణాటక అసెంబ్లీలో విశ్వాస పరీక్ష మళ్లీ వాయిదా 
గవర్నర్‌ ఆదేశాలు రెండుసార్లు బేఖాతరు చేసిన సీఎం! 
విప్‌ హక్కులపై సుప్రీం మెట్లెక్కిన మిత్రపక్షాలు 
అర్ధరాత్రి దాటినా ఓటింగ్‌కు సిద్ధమన్న భాజపా 
సోమవారానికి సభను వాయిదా వేసిన స్పీకర్‌

ఈనాడు డిజిటల్‌, బెంగళూరు: కర్ణాటక రాజకీయ నాటకానికి ఇంకా తెరపడలేదు. విశ్వాస పరీక్షను ముగించాలని గవర్నర్‌ వజూభాయివాలా రెండుసార్లు ముఖ్యమంత్రి కుమారస్వామికి ఇచ్చిన ఆదేశాలు బేఖాతరయ్యాయి. విశ్వాస తీర్మానంపై చాలామంది మాట్లాడాల్సి ఉండటంతో సభను వాయిదా వేయాలని అధికారపక్ష సభ్యులు పలువురు స్పీకర్‌కు విన్నవించారు. అవసరమైతే మంగళవారం కూడా చర్చకు అవకాశమివ్వాలని ప్రతిపాదించారు. స్పీకర్‌ అందుకు అంగీకరించలేదు. సోమవారమే ఓటింగ్‌ ముగించాలని స్పీకర్‌ స్పష్టంగా తెలిపి ఆ రోజుకు సభను వాయిదా వేశారు. అర్ధరాత్రి దాటినా విశ్వాస పరీక్ష శుక్రవారమే ముగించాలని ప్రతిపక్ష భాజపా పట్టుబట్టింది. సభాపర్వం కొనసాగుతున్న తరుణంలోనే ‘విప్‌’ ఆదేశాల వర్తింపుపై సుప్రీంకోర్టు తీర్పును సవాలు చేస్తూ మిత్రపక్షాలు ఆ కోర్టులోనే వ్యాజ్యం వేశాయి. 
కేంద్రానికి గవర్నర్‌ నివేదిక 
రాజకీయ పరిణామాలను పర్యవేక్షిస్తున్న గవర్నర్‌ వజూభాయివాలా గురువారం స్పీకర్‌కు సందేశంతోపాటు ముఖ్యమంత్రికి ఆదేశాలు పంపిన విషయం తెలిసిందే. ఓటింగ్‌ను శుక్రవారం మధ్యాహ్నం 1:30కల్లా ముగించాలని గవర్నర్‌ పంపిన రాతపూర్వక ఆదేశాన్ని ముఖ్యమంత్రి అందుకున్నారు. ఉదయం 11 గంటలనుంచి చర్చలు కొనసాగుతుండగా గవర్నర్‌ పంపిన ఆదేశాన్ని అమలు చేయలేదు. గవర్నర్‌ విధించిన గడువు ముగుస్తున్నప్పుడు భాజపా సభ్యులు ఓటింగ్‌పై పట్టుబట్టారు. స్పీకర్‌ అందుకు నిరాకరించారు. చర్చిస్తుండగా మీ కోసం నిబంధనలు మార్చుకోలేనని కరాఖండిగా చెప్పారు. గవర్నర్‌ మరో మారు ముఖ్యమంత్రికి ఆదేశాలిస్తూ.. సాయంత్రం ఆరింటిలోపు విశ్వాస పరీక్ష ముగించాలని పేర్కొన్నారు. అప్పటికింకా మాట్లాడాల్సిన పాలకపక్ష సభ్యుల జాబితా పెద్దదిగా ఉండటంతో గవర్నర్‌ ఆదేశాన్ని పరిగణనలోకి తీసుకోలేదు. కర్ణాటక రాజకీయ పరిణామాలు, సభా వ్యవహారాలను గవర్నర్‌ శుక్రవారమే కేంద్ర హోంశాఖ కార్యదర్శికి నివేదించారు. 
సుప్రీంలో సవాలు 
గత మంగళవారం రాజీనామా చేసిన ఎమ్మెల్యేల ఫిర్యాదుపై విచారించిన సుప్రీంకోర్టు మధ్యంతర తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. ఈ తీర్పు తమ హక్కులను కాలరాస్తోందని కాంగ్రెస్‌ ఆరోపిస్తోంది. పార్టీల విప్‌ అధికారంపై స్పష్టత కోరుతూ కాంగ్రెస్‌, జేడీఎస్‌లు సుప్రీంకోర్టులో అర్జీ వేశాయి. మరో వైపు తాను విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టినా గవర్నర్‌ తనను ఆదేశాలతో అడ్డుకుంటున్నారంటూ ముఖ్యమంత్రి సుప్రీంకోర్టులో అర్జీ వేశారు. గవర్నర్‌ ఆదేశాల నుంచి రక్షణ కల్పించాలని స్పీకర్‌కు కూడా విన్నవించారు. 
అసమ్మతీయులకు గవర్నరే బాసట: కుమార 
రాజీనామాలు సమర్పించిన ఎమ్మెల్యేలకు ముంబయికి పారిపోయేలా చేసి తన ప్రభుత్వం కూలిపోయేందుకు పరోక్షంగా ప్రతిపక్షానికి గవర్నర్‌ సహకరించారని ముఖ్యమంత్రి కుమారస్వామి మండిపడ్డారు. తాను 13 నెలలపాటు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినా వాటిని ప్రజలకు అందకుండా చేసేందుకు ప్రతిపక్షం ప్రయత్నించిందని ఆరోపించారు. కాంగ్రెస్‌ సభ్యుడు శ్రీనివాసగౌడ తనకు భాజపా నేతలు రూ.5 కోట్లిచ్చి పార్టీలోకి ఆహ్వానించారని ఆరోపించారు. రాజీనామా చేసిన తమ పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు విశ్వనాథ్‌కు ఉన్న అప్పులు రూ.28 కోట్లను తీర్చే ఒప్పందంతోనే భాజపా ఆయన్ను ముంబయిలో ఉంచినట్లు జేడీఎస్‌ మంత్రి సారా మహేశ్‌ ఆరోపించటం సభలో గందరగోళానికి తావిచ్చింది. పాలకపక్ష సభ్యులు ఎన్ని ఆరోపణలు చేసినా ప్రతిపక్ష సభ్యులు సహనంతో ఉంటూ వ్యూహాత్మకంగా వ్యవహరించారు. మరోవైపు తాను కిడ్నాప్‌ కాలేదని, అనారోగ్యం వల్లే ముంబయి ఆసుపత్రిలో చేరానని కాంగ్రెస్‌ సభ్యుడు శ్రీమంత్‌ పాటిల్‌ స్పీకర్‌కు సమాచారం పంపారు.

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.