close
ఆషామాషీ కాదు

ఎంతో పకడ్బందీగా మున్సిపల్‌ చట్టం తెచ్చాం.. అక్రమాలను సహించం 
నిర్మాణ అనుమతులను సరళీకరించాం 
75 చ. గజాలలోపు ఇంటికి అనుమతులు అక్కర్లేదు 
ఈ తరహా ఇళ్లకు ఏడాదికి పన్ను వందేే 
అనుమతి లేని నిర్మాణాలను కూల్చేస్తాం 
నాటిన మొక్కల్లో 85% బతకాల్సిందే 
లేదంటే సర్పంచ్‌, మున్సిపల్‌ ఛైర్‌పర్సన్లకు ఉద్వాసనే 
పచ్చదనానికి ప్రథమ ప్రాధాన్యం 
కొత్త మున్సిపల్‌ చట్టంలో కఠిన నిబంధనలు 
అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలకూ వర్తింపు 
శాసనసభలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ వెల్లడి 
ఈనాడు - హైదరాబాద్‌

కొత్త పురపాలక చట్టంలోని నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తప్పవని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు హెచ్చరించారు. ఉల్లంఘించినవారు ప్రజలైనా, అధికారులైనా, ప్రజాప్రతినిధులైనా సరే శిక్ష అనుభవించాల్సిందేనని స్పష్టంచేశారు. చట్టంలో ఏదో ఆషామాషీగా నిబంధనలను చేర్చలేదని, ప్రతి వాక్య నిర్మాణంలో తాను స్వయంగా పాలుపంచుకున్నానన్నారు. అన్ని కోణాల్లో ఆలోచించే కఠిన నిబంధనలను తెచ్చామని చెప్పారు. పచ్చదనానికి ప్రథమ ప్రాధాన్యమిస్తున్నామని, ఇంటి పన్నును ఎవరికి వారే స్వీయ ధ్రువీకరణ చేసుకునే వెసలుబాటు కల్పించామని వివరించారు. ఇళ్ల నిర్మాణ అనుమతులను సరళీకరించామని, అక్రమ నిర్మాణాలను సహించబోమని అన్నారు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో వేర్వేరు ఎన్నికలు జరగడంతో పాలనపై పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరించలేకపోయామని ఆగస్టు 15 నుంచి అద్భుతాలు చేస్తామని చెప్పారు.  ప్రజలను కేంద్ర బిందువుగా చేసుకొని ఆలోచిస్తున్నామని దేశమే మన దగ్గర నేర్చుకునేలా కొత్త సంస్కరణలు తీసుకొస్తామని అన్నారు. హైదరాబాద్‌లో 25 ఎకరాల్లో ‘సెంటర్‌ ఫర్‌ అర్బన్‌ ఎక్స్‌లెన్స్‌’ను నెలకొల్పనున్నట్టు తెలిపారు. శాసనసభలో శుక్రవారం ‘పురపాలక సంఘాల బిల్లు 2019’పై సీఎం కేసీఆర్‌ సవివరంగా ప్రసంగించారు. 
50% రిజర్వేషన్లతోనే పుర ఎన్నికలకు 
‘‘బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించాలనేది తెరాస ప్రభుత్వ నిర్ణయం. చట్టం చేసి కేంద్రానికి పంపాం. సుప్రీంకోర్టు 50 శాతం రిజర్వేషన్లు మించకూడదని చెప్పింది. ఈ నేపథ్యంలోనే 50 శాతం రిజర్వేషన్లతో పంచాయతీరాజ్‌ ఎన్నికలు నిర్వహించాం. 50 శాతం రిజర్వేషన్లతోనే పురపాలక ఎన్నికలకు వెళ్తున్నాం. సభానాయకుడు సమయం ఉందని ఏదంటే అది మాట్లాడటం సరికాదని కాంగ్రెస్‌ పక్షనేత భట్టి విక్రమార్క అంటున్నారు. అంటే సభా నాయకుడిని శాసిస్తారా? సీఎం ఏం మాట్లాడాలో మీరే చెబుతారా? కొత్త చట్టంపై ప్రజలను తప్పుదోవ పట్టించేలా మాట్లాడుతున్నారు. అది సరైన పద్ధతి కాదు. 
ప్రజల మేలు కోసమే కలెక్టర్లకు బాధ్యతలు 
పురపాలక సంఘాలపై ప్రభుత్వం పెత్తనం చేయడంలేదు. ఇతర అధికారులకంటే అఖిలభారత సర్వీసు అధికారులకు అవగాహన, పరిజ్ఞానం ఎక్కువ ఉంటుందని వారి ద్వారా అధిక మేలు జరుగుతుందనే కలెక్టర్లకు బాధ్యతలు అప్పగించాం. అంతమాత్రాన పురపాలక సంఘాల హక్కులను హరిస్తున్నట్లు కాంగ్రెస్‌ వారు చెప్పడం సరికాదు. పరిపాలన సజావుగా సాగాలంటే భయం లేదా భక్తి ఉండాలి. తప్పులు జరగకుండా చర్యలు తీసుకోవడం తప్పెలా అవుతుంది? పురపాలక సంఘాల్లో పనులు జరగాలంటే ఇప్పుడు ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో.. ఎంత అవినీతి ఉందో అందరికీ తెలుసు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగాలా? మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా చట్టాలను మార్చుకోకుంటే భవిష్యత్‌ తరాలు నష్టపోతాయి. పంచాయతీ, పురపాలక నిధుల వినియోగంపై పర్యవేక్షణ, చర్యలు తీసుకునే అధికారం కలెక్టర్లదే. 
తోక కుక్కను ఊపుతుందా? 
ఇప్పటి వరకూ పురపాలికల్లో కొలువులు చేసే ఉద్యోగులు ఒకేచోట దీర్ఘకాలంగా పనిచేస్తుండడం వల్ల అవినీతి, అహంకారం పెచ్చుమీరిపోయాయి. ఒక ఎంపీ తన పని కోసం ఒక పురపాలక కార్యాలయానికి వెళ్తే.. నెలల తరబడి తిప్పించుకున్నారు. కమిషనర్‌తో చెప్పించినా కూడా పనిచేయలేదు. అదేంటయ్యా అని అడిగితే.. ‘కమిషనర్లు వస్తారు వెళ్తారు.. మేం మాత్రం ఇక్కడే ఉంటాం’ అనేది ఆ పురపాలక ఉద్యోగి సమాధానం. చివరకు వారికి ‘కావాల్సింది’ ఇచ్చాక పని పూర్తిచేశారు. అటెండరు కూడా డబ్బులిస్తేనే ధ్రువీకరణ పత్రాన్ని తపాలాలో పంపుతానని చెప్పడం పురపాలికల్లో అవినీతికి పరాకాష్ఠ. మేం మాత్రమే చేయగలమనే భావన వస్తేనే ఈ దుస్థితి దాపురిస్తుంది. కుక్క తోకను ఊపాలా? తోక కుక్కను ఊపుతుందా? అర్థం కాని పరిస్థితి. ప్రజల మేలు కోసం ఎంత వరకైనా వెళ్తాం. 
పంచాయతీ వ్యవస్థ పటిష్ఠానికి నాటి 
కేంద్ర మంత్రి ఎస్‌కే డె అనన్య కృషి 
దిల్లీ నుంచి మొత్తం పరిపాలన సాధ్యం కాదనే  సౌలభ్యం కోసం రాష్ట్రాలు ఏర్పడ్డాయి. పురపాలికలు, పంచాయతీలు వచ్చాయి. ఎస్‌కే డె కేంద్ర మంత్రిగా ఉన్న కాలంలో పంచాయతీ వ్యవస్థను పటిష్ఠ పరిచే చర్యలకు శ్రీకారం చుట్టారు. హైదరాబాద్‌లోనే జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థను స్థాపించి దేశవ్యాప్తంగా పంచాయతీరాజ్‌ వ్యవస్థను విస్తృతం చేశారు. ఎస్‌కే డె సూచనల మేరకు నాటి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ రెండో పంచవర్ష ప్రణాళికలో సమూల మార్పులు చేపట్టారు. ఆధునిక దేవాలయాల పేరిట ప్రాజెక్టులకు రూపకల్పన చేశారు. పంచాయతీరాజ్‌ను నాడు సామాజిక అభివృద్ధి(కమ్యూనిటీ డెవలప్‌మెంట్‌) అనేవారు. అదే స్ఫూర్తితో పురపాలికలు ఏర్పడ్డాయి. రానురాను దేశంలో భయంకరమైన రాజకీయ జబ్బులు అలముకొని ఆ స్ఫూర్తి నీరుగారింది. ఇప్పుడది తిరిగి పొందాల్సిన ఆవశ్యకత ఉంది. 
పురపాలికల్లో ఏ మార్పులు 
చేయాలన్నా శాసనసభ ద్వారానే 
స్థానిక సంస్థలకు ఇప్పటి వరకూ విశేష అధికారాలే ఉన్నాయి. వాటిని దుర్వినియోగం చేశారు. కఠిన చట్టాలు అమల్లో లేకపోవడంతో ఇష్టానుసారంగా నిర్మాణాలకు అనుమతులిచ్చారు. హైదరాబాద్‌లో ఇప్పడు భాగమైన నిజాంపేటలో అరాచకాలు విజృంభిస్తున్నాయి. కనీసం అగ్నిమాపక వాహనం తిరగడానికి దారిలేనిచోట బహుళ అంతస్తుల భవనాలకు అనుమతులిచ్చారు. సమకాలీన పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చేయాలి. అందుకే ఈ కొత్త చట్టం తెచ్చాం. ఇక నుంచి నగర పంచాయతీల వ్యవస్థ ఉండదు. పురపాలికలు, నగర పాలక సంస్థలు, హెచ్‌ఎండీఏ తరహా సంస్థలు- ఈ మూడే ఉంటాయి. పురపాలికల్లో ఏ మార్పులు చేయాలన్నా ఇక శాసనసభ ద్వారానే. 
నిధులు మురిగిపోవు 
నిధులు ఇవ్వకుంటే పంచాయతీలు, పురపాలికల్లో అభివృద్ధి జరగదు. అందుకే 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు కేంద్రం నుంచి ఎన్ని నిధులు వస్తాయో.. అంతే మొత్తం రాష్ట్ర ప్రభుత్వం కూడా జమచేస్తుంది. ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం గ్రామీణానికి రూ.1,600 కోట్లు, పట్టణ ప్రాంతాలకు రూ.1,030 కోట్లు వస్తాయి. రాష్ట్ర ప్రభుత్వ నిధులతో కలిపి పంచాయతీలకు రూ.3,200 కోట్లు, పురపాలికలకు రూ.2,060 కోట్లు అందుబాటులోకి వస్తాయి. పంచాయతీలు, పురపాలికల స్వీయ ఆదాయానికి ఈ నిధులు అదనం. ఏటా కేటాయించే నిధులను ఒకవేళ ఖర్చుచేయకపోతే అవేమీ మురిగిపోవు. ఆ విధంగా చట్టంలో మార్పులు తెచ్చాం. గ్రామీణ ఉపాధి హామీ పథక నిధులను కూడా పంచాయతీల ద్వారానే ఖర్చుపెట్టాలని చట్టంలో చేర్చాం. తద్వారా మరో రూ.3వేల కోట్లు అభివృద్ధి కోసం అందుబాటులోకి వస్తాయి. 
కలెక్టర్‌ చర్యలపై స్టే ఇచ్చే అధికారం 
పంచాయతీరాజ్‌ శాఖ మంత్రికి ఉండదు 
పనిచేయని సర్పంచులు, ఛైర్‌పర్సన్లు, వార్డు సభ్యులు, కౌన్సిలర్లపై చర్యలు తప్పవు. కలెక్టర్‌ తీసుకునే చర్యలను నిలిపివేసే(స్టే) అధికారం ఇప్పటి వరకూ పంచాయతీరాజ్‌ శాఖ మంత్రికి ఉండేది. కొత్త చట్టంలో మంత్రికి ఆ అధికారాన్ని తొలగించాం. నియంత్రణ జరగాలనే సదుద్దేశంతోనే ఈ నిబంధనను కొత్తచట్టంలో పొందుపర్చాం. పురపాలికల్లో పోటీచేసే అభ్యర్థులు ఈ చట్టం చదువుకోవాలి. ప్రజాప్రతినిధులందరూ కచ్చితంగా శిక్షణ పొందాలి. చట్టం అమల్లోకి వచ్చిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని నేనే కోరాను.
ప్రజలారా... ప్రభుత్వమిచ్చిన స్వేచ్ఛను 
దుర్వినియోగం చేయొద్దు 
మాకు మీ(ప్రజల)పై సంపూర్ణ విశ్వాసం ఉంది. అందుకే ఎవరింటి పన్నును వారే నిర్ణయించుకునే అధికారాన్ని కల్పించాం. మీరు అంతే పవిత్రతతో పౌర బాధ్యతను నిర్వర్తించాలి. ప్రభుత్వమిచ్చిన స్వేచ్ఛను దుర్వినియోగం చేయొద్దు. మీరిచ్చిన కొలతల ప్రాతిపదికనే మీకు తెలియకుండానే మీ ఇంటిని అధికారులు కొలుస్తారు. తప్పుడు ధ్రువీకరణ అని తేలితే కఠిన చర్యలు తప్పవు. 
పోడు భూముల పరిష్కారానికి ప్రజాదర్బార్‌ 
పోడు భూముల సమస్య పరిష్కారానికి నేనే క్షేత్రస్థాయికి వెళ్తా. ఆ జిల్లా మంత్రులు, శాసనసభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు, కలెక్టర్‌, ఉన్నతాధికారులతో ప్రజాదర్బార్‌ నిర్వహిస్తాం. పేద గిరిజనులకూ రైతుబంధు, రైతు బీమా అందించే విధంగా చర్యలు చేపడతాం’’ అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలిపారు. 
బిల్లుకు మద్దతిస్తున్నాం.. 
ప్రభుత్వం ప్రవేశపెట్టిన పురపాలక బిల్లుకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు ఎంఐఎం శాసనసభ్యుడు జాఫర్‌ హుస్సేన్‌ తెలిపారు. ఆస్తిపన్నుపై పెనాల్టీలు ఎక్కువగా ఉన్నాయని అనగా ఈ  అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుందని సీఎం చెప్పారు. బిల్లుకు మద్దతిస్తున్నట్లు తెరాస సభ్యుడు గంగుల కమలాకర్‌ తెలిపారు.

మొక్కలు పెంచాలని గడ్డాలు పట్టుకొని 
బతిమాలినా ప్రయోజనం లేకపోయింది

నేను ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక మొదట సమీక్షించింది హరితహారాన్నే. 4వేల నర్సరీలు ఏర్పాటుచేసి కోట్లలో మొక్కలు నాటాం. గడ్డాలు పట్టుకొని బతిమిలాడినా పంచాయతీల్లో మొక్కలు పెంచలేదు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. మరి మొక్కల్ని ఎవరు పెంచాలి? హైదరాబాద్‌లో కొత్తగా ఆక్సిజన్‌ క్లబ్బులు వచ్చాయి. ఇది సిగ్గుచేటు. స్థానిక సంస్థల ప్రతినిధులందరూ కలిసి పట్టుబడితే హరితహారం విజయవంతం కాదా? ఎంత సంపద ఉన్నా దాన్ని అనుభవించగలిగే పరిస్థితులు ఉండాలి కదా! బతకగలిగే పరిస్థితులను ప్రజలకు ఇస్తేనే మనం గొప్పవాళ్లం. 
ఇలా చేయబోతున్నాం 
పట్టణాలు, పల్లెల్లో పచ్చదనం పెంపొందించే విధానానికి అత్యధిక ప్రాధాన్యం. 
జిల్లా కలెక్టర్‌ ఆధ్వర్యంలో వార్డుల వారీగా పచ్చదన కమిటీల ఏర్పాటు. 
పచ్చదనం పెంపొందించడంలో అధికారులు, ప్రజాప్రతినిధులు బాధ్యులుగా ఉంటారు. 
హరితహారం లక్ష్యాలపై అశ్రద్ధ వహించే పంచాయతీ కార్యదర్శులు, అధికారులు, ప్రజాప్రతినిధులను విధుల నుంచి తొలగిస్తారు. 
నాటిన మొక్కల్లో కనీసం 85 శాతం బతకాలి. అలా బతకకపోతే సర్పంచ్‌, మున్సిపల్‌ ఛైర్‌పర్సన్లకు పదవీ గండం తప్పదు.

ప్రధానాంశాలు

75 గజాలలోపు స్థలంలో జీ ప్లస్‌ వన్‌ వరకూ ఇల్లు కట్టుకోడానికి అనుమతులు అవసరం లేదు. 
వీరికి ఇంటి పన్ను ఏడాదికి రూ.100 మాత్రమే. 
తప్పనిసరిగా ఇంటిని పురపాలికల్లో నమోదు చేసుకోవాలి. నమోదుకు ఒక్క రూపాయి చెల్లిస్తే చాలు. 
500 చదరపు మీటర్ల విస్తీర్ణం, 10 మీటర్ల ఎత్తు వరకూ నిర్మాణాలకు సంబంధించి అనుమతులకు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. 
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటే.. ఆన్‌లైన్‌లోనే నిర్ణీత గడువులోగా అనుమతిస్తారు. ఎటువంటి సమాధానం రాకపోతే అనుమతి వచ్చినట్లుగా దరఖాస్తుదారు భావించాలి. 
యజమానే తన ఇంటి నిర్మాణ వివరాలను ధ్రువీకరించాలి. ఆ ధ్రువీకరణ ప్రాతిపదికనే పన్ను నిర్ణయిస్తారు. 
ఒకవేళ తప్పుడు సమాచారాన్ని ధ్రువీకరించినట్లు తేలితే ఇంటి యజమానిపై భారీగా.. అంటే అసలు చెల్లించాల్సిన పన్ను కంటే 25రెట్లు అధికంగా జరిమానా విధిస్తారు. అంటే రూ.10వేల పన్ను చెల్లించాల్సిన చోట.. రూ.2.5 లక్షలు జరిమానాగా కట్టాల్సి వస్తుంది. 
ఎటువంటి తాఖీదులు ఇవ్వకుండా అక్రమ నిర్మాణాలను నేరుగా కూల్చేస్తారు. 
పురపాలక ఉద్యోగులు, అధికారులను ఎక్కడ్నించి ఎక్కడికైనా బదిలీ చేయొచ్చు. 
ఎన్నికల సంఘం విధి విధానాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోదు. ఎన్నికలు నిర్వహించే తేదీల నిర్ణయంలో కలుగజేసుకుంటుంది. ఎందుకంటే రాష్ట్రంలో వరదలు, శాంతిభద్రతలు, పండుగలు, పరీక్షలు.. ఇలా రకరకాల అంశాలను పరిగణనలోకి తీసుకొని ఎన్నికలను నిర్వహించాల్సి ఉంటుంది. 
ప్రభుత్వ కార్యాలయాల కరెంటు బిల్లుల బకాయిలు ఇక కొనసాగొద్దు. కచ్చితంగా ఎప్పటికప్పుడూ కట్టాల్సిందే. కట్టకపోతే సంబంధిత అధికారిపై వేటు పడుతుంది. 
గ్రామాల్లో కొత్త ఇంటి నంబర్లను ఇవ్వనున్నాం. క్యూఆర్‌ కోడ్‌, ఎలక్ట్రానిక్‌ పర్యవేక్షణ ఉంటుంది. నేరపరిశోధనకు ఇది దోహదపడుతుంది.
హైదరాబాద్‌ను రెండు జిల్లాలు చేద్దాం అనుకున్నా కానీ.. 
తెలంగాణను 33 జిల్లాలుగా విభజించుకున్నాం. హైదరాబాద్‌ను కూడా రెండు జిల్లాలుగా విభజించాలనేది నా బలమైన కోరిక. హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ జిల్లాలుగా చేస్తే పరిపాలనా సౌలభ్యం పెరుగుతుంది. దేశంలో హైదరాబాద్‌కున్న ప్రాధాన్యం దృష్ట్యా విడదీయవద్దని ఇక్కడి శాసనసభ్యులు కోరడంతో విరమించుకున్నా. భవిష్యత్‌లో చూద్దాం.
శాసనసభ నిరవధిక వాయిదా 
‘పురపాలక సంఘాల బిల్లు 2019’ బిల్లుని శాసనసభ శుక్రవారం ఆమోదించింది. అనంతరం సభను సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి నిరవధికంగా వాయిదా వేశారు. శాసనసభ గురువారం, శుక్రవారం సమావేశమైంది. మొత్తం 4.44 గంటలు సభ జరిగినట్లు సభాపతి తెలిపారు. సభలో 16 మంది సభ్యులు మాట్లాడారు. ఐదు బిల్లులను ప్రవేశ పెట్టగా ఐదూ ఆమోదం పొందాయి.

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.