close
వృద్ధిరేటులో రాష్ట్రం దూసుకెళ్తోంది

పెరుగుతున్న ఆదాయం పేదలకు పంపిణీ
పురపాలక చట్టాన్ని అర్థం చేసుకున్నాకే టికెట్లకు రావాలి
తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌
ఈనాడు డిజిటల్‌ - సిరిసిల్ల

‘‘దేశం అబ్బురపడేలా ఏటా రాష్ట్ర వృద్ధిరేటు 17శాతం సగటుతో దూసుకుపోతోంది.. ఇలా పెరుగుతున్న సంపదను పేదలకు పంచాలనేది రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం’’ అని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, సిరిసిల్ల ఎమ్మెల్యే కె.తారకరామారావు అన్నారు. శనివారం సిరిసిల్లలో ఆసరా పింఛన్‌ పెంపు పత్రాల పంపిణీ కార్యక్రమాల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ బలహీనవర్గాల కుటుంబాల ఆర్థిక ఇబ్బందులను తొలగించేలా సంక్షేమ పథకాలను విస్తరిస్తున్నారన్నారు. ఆసరా పింఛన్ల పెంపుతోపాటు.. పింఛను వయసు 65 నుంచి 57 ఏళ్లకు తగ్గించినట్లు చెప్పారు. వయసు తగ్గింపు జులై నుంచే అమలవుతోందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అదనంగా 7-8లక్షల మందికి కొత్తగా పింఛన్లు అందబోతున్నాయని చెప్పారు. బీడీ కార్మికుల పీఎఫ్‌ కటాఫ్‌ తేదీని 2014 నుంచి 2019కు చేయడంతో సుమారు రెండు లక్షల మందికి కొత్త పింఛన్లు రాబోతున్నాయన్నారు.

కేంద్రం ఇచ్చేది రూ.200 కోట్లు
రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెలా పింఛన్ల కోసం రూ.12వేల కోట్లు కేటాయిస్తే.. దానిలో కేంద్రం నుంచి రూ.200కోట్లు మాత్రమే వస్తాయని కేటీఆర్‌ తెలిపారు. పింఛన్ల కేటాయింపులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఎంత తేడా ఉందో ప్రజలు గ్రహించాలన్నారు. రాష్ట్ర బడ్జెట్‌లో సింహభాగం రూ.43వేల కోట్లు పేదల సంక్షేమానికి ఖర్చు చేస్తున్న దేశంలోనే ఏకైక ప్రభుత్వం తెరాస అని కేటీఆర్‌ చెప్పారు. చాలాచోట్ల రెండు పడక గదుల నిర్మాణం పూర్తయిందని వాటి పంపిణీకి ప్రభుత్వం మంచి ముహూర్తం కోసం ఎదురుచూస్తోందని చెప్పారు. ఇళ్ల కేటాయింపులో దళారులను ఆశ్రయించొద్దని, సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా అర్హులను కలెక్టర్లే నిర్ధారిస్తారన్నారు. నిర్మాణాలు తక్కువగా ఉండి.. అర్హులు ఎక్కువగా ఉన్నట్లైతే.. బహిరంగ లాటరీ ద్వారా ఎంపిక చేస్తారని చెప్పారు. సీఎం కేసీఆర్‌ హామీ ఇచ్చినట్లు సొంత స్థలం ఉండి ఇళ్లులేని నిరుపేదలకు ఇంటి నిర్మాణం చేయించి ఇచ్చే ప్రణాళికలు సిద్ధమవుతున్నాయని తెలిపారు. కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌, ఆర్డీవో శ్రీనివాసరావు, టెస్కాబ్‌ ఛైర్మన్‌ కొండూరి రవీందర్‌రావు, జడ్పీ ఛైర్మన్‌ న్యాలకొండ అరుణ, సీఈవో గౌతంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

తప్పుడు ఆలోచనలుంటే పోటీ చేయొద్దు
కొత్త పురపాలక చట్టాన్ని పూర్తిగా అర్థం చేసుకున్నాకే.. టికెట్ల కోసం రావాలని కేటీఆర్‌ అన్నారు. సిరిసిల్లలో నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..‘పురపాలన అంటే పౌరుల భాగస్వామ్యంతో కూడిన పాలన’ అని అర్థమని, దేశంలో మొదటిసారిగా మన రాష్ట్రంలో ఈ పదానికి కొత్త నిర్వచనం చెప్పేలా చట్టాన్ని రూపొందించామని చెప్పారు. ‘‘రూ.లక్షలు ఖర్చు చేసి పదవిని దక్కించుకున్నాక.. మాకేం వస్తుందనే ఆలోచన ఉన్నవారు పోటీ చేయడం మానుకోండి’’ అని హితవు పలికారు. కొన్ని పురపాలికలపై న్యాయస్థానంలో స్టే ఉందని, వాటిపై హైకోర్టులో సోమవారం విచారణ జరగనుందన్నారు. తర్వాతే రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటన వెలువడే అవకాశం ఉందని చెప్పారు.

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.