close
షీలాదీక్షిత్‌ కన్నుమూత

పెద్ద దిక్కును కోల్పోయిన కాంగ్రెస్‌ పార్టీ
ప్రముఖుల సంతాపం

ఈనాడు, దిల్లీ: దిల్లీ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ దిగ్గజ నేత షీలాదీక్షిత్‌ (81) కన్నుమూశారు. శనివారం ఉదయం తీవ్ర గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు ఆమెను ఇక్కడి ఫోర్టిస్‌ ఎస్కార్ట్స్‌ హార్ట్‌ ఇన్‌స్టిట్యూట్‌లో చేర్పించారు. ఆసుపత్రి ఛైర్మన్‌ అశోక్‌ సేథ్‌ నేతృత్వంలోని బృందం ఆమెకు అత్యాధునిక వైద్యసేవలు అందించింది. పరిస్థితి మెరుగుపడినప్పటికీ రెండోసారి గుండెపోటు రావడంతో వారి ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో సాయంత్రం 3.55 గంటలకు ఆమె తుదిశ్వాస విడిచారు. హృద్రోగ సమస్య షీలాను చాలాకాలంగా వెంటాడుతూ వచ్చింది. 2012లో యాంజియోప్లాస్టీ చేయించుకున్న ఆమెకు 2018లో ఫ్రాన్స్‌లోని ఓ ఆసుపత్రిలో గుండెకు శస్త్రచికిత్స జరిగింది. ఇందిరాగాంధీ ప్రోద్బలంతో అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చిన షీలా.. అంచెలంచెలుగా ఎదిగి 1998 నుంచి 2013 వరకు ఏకబిగిన 15 ఏళ్లపాటు దిల్లీ సీఎంగా పనిచేశారు. వరుసగా మూడుసార్లు హస్తినలో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి, శక్తిమంతమైన నాయకురాలిగా గుర్తింపు పొందారు. ఆమె హయాంలోనే దేశ రాజధాని కొత్త రహదారులు, ఫ్లైఓవర్లు వంటి ఆధునిక సొబగులు అద్దుకున్నాయి. రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవమున్న ఆమె ‘సిటిజన్‌ దిల్లీ: మై టైమ్స్‌, మై లైఫ్‌’ పేరున నిరుడు ఆత్మకథను ప్రచురించారు. నిరాడంబరంగా ఉండే షీలాకు పాశ్చాత్య సంగీతమంటే ప్రాణం. చదవడమన్నా, రకరకాల పాదరక్షలను ధరించడమన్నా బాగా ఇష్టపడేవారు.

ప్రేమించి పెళ్లాడి...
నేత చీర.. ముదిమి వయసు.. ముగ్గుబుట్ట లాంటి తల.. కళ్లలో ఆప్యాయత.. మాటల్లో మృదుత్వంతో బామ్మను తలపించే షీలా... 1938 మార్చి 31న పంజాబ్‌లోని కపుర్తలలో జన్మించారు. విద్యాభ్యాసమంతా దిల్లీలోనే సాగింది. ఆమె అసలు పేరు షీలాకపూర్‌. పశ్చిమ బెంగాల్‌ మాజీ గవర్నర్‌ ఉమాశంకర్‌ దీక్షిత్‌ కుమారుడు, ఐఏఏస్‌ అధికారి వినోద్‌ దీక్షిత్‌ను ప్రేమ వివాహం చేసుకుని షీలాదీక్షిత్‌గా మారారు. అత్తవారిది ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఉన్నావ్‌ పార్లమెంటు నియోజకవర్గం కావడంతో ఆమె ఒకసారి అక్కడి నుంచి పోటీచేసి గెలుపొందారు. షీలాకు ఒక కుమారుడు, ఒక కుమార్తె. కుమారుడు సందీప్‌ దీక్షిత్‌ దిల్లీ నుంచి ఎంపీగా పనిచేశారు. 1984 నుంచి 1989 వరకు ఉత్తర్‌ప్రదేశ్‌లోని కన్నౌజ్‌ నియోజకవర్గం నుంచి షీలా లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించారు. 1986-89 మధ్య ప్రధానమంత్రి కార్యాలయం, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిగా పనిచేశారు. 1998 ఎన్నికల్లో దిల్లీలో కాంగ్రెస్‌ గెలవడంతో సీఎంగా బాధ్యతలు చేపట్టారు. అప్పట్నుంచి 2013 వరకు సుదీర్ఘకాలం ఆ పదవిలోనే కొనసాగారు. ఆ ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌ సీఎం అభ్యర్థి కేజ్రీవాల్‌ చేతిలో ఓటమిపాలయ్యారు.తర్వాత ఆమెను అప్పటి యూపీయే ప్రభుత్వం కేరళ గవర్నర్‌గా నియమించింది. 2014 మార్చి 11నుంచి ఆగస్టు 25వరకు షీలా ఆ హోదాలో కొనసాగారు. కేంద్రంలో మోదీ సర్కారు ఏర్పడిన తర్వాత ఆమె గవర్నర్‌ పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. అప్పటినుంచి ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చిన షీలా.. ఈ ఏడాది మేలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఈశాన్య దిల్లీ నుంచి పోటీచేసి, భాజపా అభ్యర్థి మనోజ్‌ తివారీ చేతిలో ఓడిపోయారు. వచ్చే ఏడాది దిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరుగబోతున్న తరుణంలో ఆమె తుదిశ్వాస విడవడం కాంగ్రెస్‌కు పెద్ద దెబ్బ. గాంధీ కుటుంబానికి షీలా అత్యంత ఆప్తురాలు. అపాయింట్‌మెంట్‌ లేకుండానే సోనియా, రాహుల్‌ నివాసాలకు వెళ్లగలిగే చొరవ, సాన్నిహిత్యం ఆమెకు ఉన్నాయి. అనారోగ్యంతో బాధపడుతున్న కారణంగా.. దిల్లీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా ఉన్న ఆమె అధికారాలను పార్టీ ఇన్‌ఛార్జి 3రోజుల కిందటే ముగ్గురు కార్యనిర్వాహక అధ్యక్షులకు అప్పగించారు.

* ప్రధాని మోదీ, యూపీఏ ఛైర్‌పర్సన్‌ సోనియాగాంధీ, లోక్‌సభ స్పీకర్‌ ఓంబిర్లా తదితరులు షీలా నివాసానికి వెళ్లి.. నివాళులర్పించారు.

సంతాపాల వెల్లువ...
షీలాదీక్షిత్‌ హయాంలో దిల్లీ గణనీయమైన అభివృద్ధి సాధించిందని, ఇందుకామె చిరకాలం గుర్తుండిపోతారని రాష్ట్రపతి కోవింద్‌ తన సంతాప సందేశంలో పేర్కొన్నారు. ఆమె మృతిపట్ల ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రగాఢ సంతాపం తెలిపారు. షీలా గొప్ప మృదుస్వభావి అని, దిల్లీ అభివృద్ధిలో ఆమె కీలకపాత్ర పోషించారని ప్రధాని మోదీ అన్నారు. జీవితాంతం కాంగ్రెస్‌కే అంకితమైన ముద్దుబిడ్డను పార్టీ కోల్పోయిందని రాహుల్‌గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘షీలాదీక్షిత్‌ మరణవార్త విని భీతావహుడినియ్యా.ఆమె కాంగ్రెస్‌పార్టీ ముద్దుబిడ్డ. వ్యక్తిగతంగా ఎంతో అనుబంధముంది. సీఎంగా దిల్లీకి అలుపెరుగని సేవ చేసిన ఆమె మృతి తీరనిలోటు’’అని పేర్కొన్నారు. ప్రియాంక ట్విట్టర్‌లో సంతాపం వ్యక్తం చేశారు. మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌, భాజపా అగ్రనేత అడ్వాణీ, ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్‌ షా, దిల్లీ సీఎం కేజ్రీవాల్‌, పలువురు కేంద్రమంత్రులు విచారం వెలిబుచ్చారు. 


 

కేసీఆర్‌, టీపీసీసీ నేతల సంతాపం

ఈనాడు, హైదరాబాద్‌: దిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్‌ మృతిపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంతాపం తెలిపారు. ఆమె కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.ఆమె అరుదైన రాజకీయవేత్త అని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌, నిజామాబాద్‌ మాజీ ఎంపీ కవితలు సంతాపం తెలిపారు. షీలా దీక్షిత్‌ మృతి పట్ల టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టివిక్రమార్క, కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి వి.హనుమంతరావు, టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్‌లు సంతాపం వ్యక్తం చేశారు.

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.