close
సైబర్‌ భద్రతకు త్వరలో కొత్త చట్టాలు

లైంగిక వేధింపులపై మరింత కఠినంగా వ్యవహరిస్తాం
నెలాఖరుకల్లా పోలీస్‌ స్టేషన్లన్నీ అనుసంధానం
తెలంగాణలో మతం పేరుతో సీట్లు గెలవలేదు
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి

ఈనాడు-హైదరాబాద్‌: ఉగ్రవాదం, మహిళల భద్రత దేశం ముందున్న అతిపెద్ద సవాళ్లని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. సైబర్‌ ఉగ్రవాదాన్ని అణచివేసేందుకు, సైబర్‌ భద్రత పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టాలను తీసుకురాబోతుందని వెల్లడించారు. లైంగిక వేధింపుల చట్టాలను మరింత కఠినతరం చేస్తోందని తెలిపారు. ఎఫ్‌ఐఆర్‌ నమోదు కాగానే దిల్లీలోని కేంద్ర హోంశాఖ మంత్రిత్వ కార్యాలయంలో తెలిసేలా దేశంలోని అన్ని పోలీస్‌స్టేషన్లను ఆన్‌లైన్‌తో అనుసంధానం చేసే ప్రక్రియ ఈ నెలాఖరుకు పూర్తవుతుందని చెప్పారు. పోలీసుశాఖ ఆధునికీకరణ, సైబర్‌ భద్రత తదితర అంశాల్లో రాష్ట్రాలతో కేంద్రం సమన్వయంతో పనిచేస్తోందన్నారు. కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టాక తొలిసారి శనివారం ఆయన హైదరాబాద్‌లో విలేకరులతో సమావేశమయ్యారు. పార్టీ ఎమ్మెల్సీ ఎన్‌.రామచంద్రరావుతో కలిసి ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు.

ఉగ్రవాదానికి హైదరాబాద్‌ అడ్డాగా మారిందని అనలేదు
‘‘జమ్మూకశ్మీర్‌, ఈశాన్య రాష్ట్రాలు, మహిళల భద్రత, కౌంటర్‌ టెర్రరిజం వంటి కీలక బాధ్యతలు నాకు అప్పగించారు. నిత్య విద్యార్థిలా హోంశాఖను అధ్యయనం చేస్తున్నా. వివిధ రాష్ట్రాల్లో పరిస్థితుల్ని తెలుసుకుంటున్నా. వామపక్ష తీవ్రవాదంపై ఆయా రాష్ట్రాలే చర్యలు తీసుకుంటాయి. కోరితే అదనపు బలగాల వంటి అంశాల్లో కేంద్రం సహకరిస్తుంది. పాస్‌పోర్టు, వీసా లేకుండా హైదరాబాద్‌ సహా దేశంలో అక్రమంగా ఉంటున్న విదేశీయులను వారి దేశాలకు పంపిస్తాం. ఉగ్రవాదానికి హైదరాబాద్‌ అడ్డాగా మారిందని నేను అనలేదు. ఇక్కడి యువత ఐఎస్‌ఐకి ఆకర్షితులవుతున్నారని, సురక్షిత ప్రాంతంగా, ఉగ్రవాదుల్ని తయారు చేసే ఒక కేంద్రంగా ఉందనే అన్నా’’ అని కిషన్‌రెడ్డి వివరణ ఇచ్చారు.

తెరాస పాలనపై ప్రజల్లో వ్యతిరేకత
2023లో తెలంగాణలో భాజపా అధికారంలోకి రావాలని యువత, మహిళలు, వృత్తి నిపుణులు కోరుకుంటున్నారని కిషన్‌రెడ్డి అన్నారు. ‘‘సారు.. కారు.. పదహారు.. దిల్లీ సర్కారు’’ నినాదంతో లోక్‌సభ ఎన్నికలకు వెళ్లిన తెరాసను ప్రజలు 9 సీట్లకే పరిమితం చేశారు. మున్సిపల్‌ ఎన్నికల్లోనూ ప్రజల నిర్ణయం ప్రకారమే ఫలితాలు వస్తాయి. తెరాస ప్రభుత్వంపై ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతను కప్పిపుచ్చడానికే సీఎం కేసీఆర్‌ భాజపాపై విమర్శలు చేసున్నారు. తెలంగాణలో భాజపా 4 ఎంపీ సీట్లను మతం పేరుతో గెలవలేదు. అభివృద్ధి ఎజెండాతోనే ప్రజల్లోకి వెళ్లాం. ఓవైసీ సోదరుల్ని చెరోవైపు కూర్చోబెట్టుకునే ముఖ్యమంత్రి మతం గురించి ఎలా మాట్లాడతారు?  భాజపాను విమర్శించే నైతిక హక్కు సీఎంకు లేదు’’ అని దుయ్యబట్టారు.


 

గవర్నర్‌ నరసింహన్‌తో కిషన్‌రెడ్డి భేటీ

ఈనాడు,హైదరాబాద్‌: గవర్నర్‌ నరసింహన్‌తో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి సమావేశమయ్యారు. శనివారం మధ్యాహ్నం రాజ్‌భవన్‌కు వెళ్లిన కిషన్‌రెడ్డి గవర్నర్‌తో దాదాపు 20నిమిషాలు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నరసింహన్‌కు శాలువా కప్పి సత్కరించారు. ఈ సమావేశం మర్యాదపూర్వకంగానే జరిగిందని కేంద్ర హోంశాఖవర్గాలు తెలిపాయి. ఇంటెలిజెన్స్‌ విభాగం చీఫ్‌గా ఉన్న సమయంలో తన అనుభవాలను గవర్నర్‌ పంచుకున్నట్లు సమాచారం. హోంశాఖకు సంబంధించిన అంశాలు చర్చకు వచ్చినట్లు తెలిసింది. గవర్నర్‌ నరసింహన్‌ ఇటీవల దిల్లీ వెళ్లినప్పుడు హోం మంత్రిత్వశాఖ కార్యాలయానికి వెళ్లి కిషన్‌రెడ్డిని కలిసిన విషయం తెలిసిందే. 


 

నూతన విద్యావిధానం రూపకల్పనకు కేంద్రం ప్రయత్నం

నారాయణగూడ, న్యూస్‌టుడే: ప్రపంచంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా నూతన విద్యావిధానం రూపకల్పనకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి తెలిపారు. శనివారం హైదరాబాద్‌ నారాయణగూడలోని కేశవ స్మారక విద్యాసంస్థల వ్యవస్థాపక దినోత్సవానికి మంత్రి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. గతంలో రెండుసార్లు విద్యా విధానంలో మార్పులు చేర్పులు జరిగాయన్నారు. ప్రస్తుతం వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యావిధానాన్ని తీసుకురావాల్సిన ఆవశ్యకత ఏర్పడిందని కిషన్‌రెడ్డి చెప్పారు. ఇదివరకు భారతీయులు ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లేవారని.. రాబోయే రోజుల్లో విదేశీయులే ఇక్కడికి వచ్చి చదువుకునేలా విద్యావిధానంలో మార్పులు తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం ప్రారంభించిందని చెప్పారు. ఈ సందర్భంగా మల్లఖంబ్‌ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో పతకం సాధించిన ఇంటర్‌ విద్యార్థిని జన్నాబాయి పాటిల్‌ను, వివిధ విభాగాల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను మంత్రి అభినందించారు. కార్యక్రమంలో కేశవ స్మారక విద్యా సంస్థల ఛైర్మన్‌ జస్టిస్‌ ఎల్‌.నరసింహారెడ్డి, శ్రీధర్‌జీ తదితరులు పాల్గొన్నారు.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.