close
గడ్డి పోచకూ నోచుకోలేక...

పచ్చిగడ్డి కొరతతో గ్రాసం దిగుమతి
పశువులు ఒట్టిపోయి తగ్గుతున్న పాల దిగుబడి
సాగు అనుబంధ రంగాల్లో సందిగ్ధ పరిస్థితి
‘ఈనాడు’ ప్రత్యేక ప్రతినిధులు

తడారిన పుడమి పులకరించలేదు. కరవు ఛాయ పచ్చదనాన్ని కబళిస్తోంది. పాడి పశువులు కళ తప్పి కనిపిస్తున్నాయి. పచ్చిగడ్డి దొరక్కపోవడంతో ఎండుగడ్డి ధర భగ్గుమంటోంది. వర్షాభావం సాగును దెబ్బతీయగా అనుబంధ రంగాలు ఆ కోరల్లో చిక్కి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, ఖమ్మం, మహబూబాబాద్‌, వికారాబాద్‌, పాలమూరు, కామారెడ్డి, మెదక్‌, నిజామాబాద్‌ జిల్లాల్లో క్షేత్రస్థాయి పరిస్థితులు కర్షకుడిని కంటతడి పెట్టిస్తున్నాయి. చెరువుల్లో చుక్కనీరు రాకపోవడంతో మత్స్యకారుల కుటుంబాల్లో ఆందోళన గూడు కట్టుకుంటోంది.

రాష్ట్రంలో పాడి పరిశ్రమ కళ తప్పింది. మూగజీవాలకు తినేందుకు మేత దొరక్క.. నిర్వహణ భారంగా మారింది. మే, జూన్‌ నెలల్లో పాల దిగుబడి సాధారణంగా తగ్గుతుంది. వానాకాలం రాగానే తిరిగి ఊపందుకుంటుంది. ఈ ఏడాది ఇప్పటికీ పరిస్థితి చక్కబడలేదు. విజయ డెయిరీ పరిధిలో మే నెలాఖరుకు రోజుకు 4.5 లక్షల లీటర్ల పాలు సేకరించేవారు. అలాంటిది మే, జూన్‌ రెండు నెలల్లో రోజుకు 2 నుంచి 2.7 లక్షల లీటర్ల పాలు డెయిరీలకు వచ్చాయి. నార్మూల్‌, ముల్కనూరు, కరీంనగర్‌ డెయిరీల్లో గడ్డు పరిస్థితులు కనిపిస్తున్నాయి. గ్రామాల్లో పశువుల విక్రయాలు పెరుగుతుండటంతో వాటి ధరలు తగ్గిపోతున్నాయి. నాలుగు నెలల క్రితం రూ.60 వేలు పలికిన ఓ మోస్తరు పశువు ధర సగానికి పడిపోయింది. ఆర్నెల్లుగా 16 జిల్లాల పరిధిలో 70 మండలాల్లో గడ్డికి కొరత ఏర్పడింది. పశుసంవర్ధక శాఖ అధికారుల అంచనాల ప్రకారం నల్గొండ, రంగారెడ్డి, యాదాద్రి జిల్లాల్లో గడ్డు పరిస్థితి కనిపిస్తోంది. నల్గొండలో 18 మండలాలు, రంగారెడ్డిలో 16, యాదాద్రిలోని 13 మండలాల్లో మేత దొరకలేదు. మంచిర్యాలలో ఐదు మండలాలు, భద్రాద్రి కొత్తగూడెం, నిర్మల్‌ జిల్లాల్లో మూడు మండలాలు, భూపాలపల్లి, మహబూబాబాద్‌, సిరిసిల్ల జిల్లాల్లో రెండు మండలాల్లోనూ ఇదే దుస్థితి కనిపించింది.

పాడి ఆవుకు కాడి కట్టి...

ఆర్థిక ఇబ్బందులతో ఒక ఎద్దును అమ్ముకున్నాడు ఈ రైతు. ఎంతో కొంత పంట వేద్దామని.. తప్పని పరిస్థితుల్లో పాడి ఆవుకు కాడి కట్టాడు. మహబూబ్‌నగర్‌ జిల్లా లింగపల్లి తండాలోనిదీ దృశ్యం. ఆర్థికంగా కుటుంబాన్ని నెట్టుకొచ్చేందుకు రైతులు చేతిలో ఉన్న ఎద్దులను అమ్మేసుకుంటున్నారు. సాగుపై ఆశ చావక ప్రత్యామ్నాయం వెతుక్కుంటున్నారు.

పశుపోషణ ఎలా?

ఇప్పటివరకు ఆర్థికంగా నిలబెట్టిన పాడి సంపద ప్రస్తుతం భారంగా మారింది. ఆరెకరాల ఆసామినైనా తీవ్ర వర్షాభావంతో ఒక్క గింజ కూడా విత్తలేకపోయాను. పాడితోనైనా బతుకు వెళ్లదీయాలని అనుకున్న రైతులకు పచ్చిగడ్డి కొరత ఎదురవుతోంది. దిక్కులేని పరిస్థితుల్లో ఎండుగడ్డిని దూర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. ఒక్కో మోపునకు రూ.140 వెచ్చిస్తున్నాం.

-ఎర్రగోని వెంకటేశ్‌, లింగోజిగూడెం, చౌటుప్పల్‌ మండలం యాదాద్రి జిల్లా

బక్కచిక్కుతున్న గేదెలు 

గ్రామ శివారుల్లో బీళ్లు ఎండిపోయాయి. మండుతున్న ఎండలకు పచ్చిగడ్డి ఆనవాలు లేకుండా పోయింది. ఆ వెంటనే వానాకాలం వచ్చినా వర్షాలు లేక గడ్డి మొలకెత్తలేదు. పశువులు గ్రాసానికి నోరెళ్లబెడుతున్నాయి. వాటిని కాపాడుకోవడానికి ఎంతని గడ్డి కొనాలి. పాడి పశువులు పాలు ఇవ్వడం లేదు. 

- సక్రూ నాయక్‌, కొందుర్గు, వికారాబాద్‌ జిల్లా

చేపలు పెంచితేనే నా నోట్లోకి బుక్కెడు

పాలేరు జలాశయం నుంచి వచ్చే నీటితో ఏటా మా ఊరచెరువు జల కళ సంతరించుకుంటుంది. ఈ పాటికే నీళ్లు వచ్చేవి. గుత్తేదారులు పాటపాడుకుని చేపలు వేసేందుకు సిద్ధమయ్యేవారు. ఈ ఏడాది ఆ ఊసేలేదు. చేపల పెంపకానికి ఇప్పటికైతే ఎవరూ రాలేదు. చెరువు కింద పొలాలు బీళ్లుగానే కనిపిస్తున్నాయి. నా నెల జీతం రూ.10 వేలు ఇచ్చేదెవరు?

-పుల్లయ్య, ఊరచెరువు కావలిదారు, జీళ్లచెరువు, ఖమ్మం జిల్లా

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.