close
గైర్హాజరీకి ముఖతాడు!

సర్కారు దవాఖానాల్లో ‘ముఖ గుర్తింపు’ హాజరు విధానం
గాంధీ సహా 12 ఆసుపత్రుల్లో ప్రయోగాత్మకంగా అమలు
రోగుల సమాచార సేకరణకూ వర్తింపు
వైద్యారోగ్య శాఖ కీలక నిర్ణయం
ఈనాడు - హైదరాబాద్‌

పుస్తకంలో సంతకాలు పెట్టడం. బయోమెట్రిక్‌ విధానంలో వేలిముద్రలు వేయడం. కనుపాపల ద్వారా గుర్తించడం. ఇప్పటి వరకూ హాజరు నిర్ధారణకు వినియోగిస్తున్న విధానాలివి. వీటికి భిన్నంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ‘ముఖ గుర్తింపు విధానం(ఫేస్‌ రికగ్నిషన్‌ సిస్టమ్‌)’ విధానాన్ని త్వరలో అమలు చేయనున్నారు. ఉస్మానియా, గాంధీ వంటి బోధనాసుపత్రులు మొదలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల స్థాయి వరకూ వైద్య సిబ్బంది పనితీరుపై ఇలా నిఘా పెట్టనున్నారు.

ప్రస్తుతం సంతకాల విధానమే అత్యధిక ఆసుపత్రుల్లో కొనసాగుతుండగా, కొన్నిచోట్ల మాత్రం బయోమెట్రిక్‌ అమలవుతోంది. సంతకాల పద్ధతిలో ఆచార్యుల స్థాయి వైద్యులే అవకతవకలకు పాల్పడుతున్నట్లుగా పలు సందర్భాల్లో వెల్లడైంది. తమ విభాగానికి చెందిన పీజీ వైద్య విద్యార్థులను పురమాయించి ‘ఆ విభాగానికి చెందిన అందరి వైద్యుల సంతకాలనూ’ చేయిస్తున్నట్టుగా ఉస్మానియా ఆసుపత్రిలో గతంలో గుర్తించారు. బయోమెట్రిక్‌ యంత్రాలు అమర్చినా అవి చాలాచోట్ల పనిచేయడం లేదు. ఉద్దేశపూర్వకంగానే వాటిని పనిచేయకుండా చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో సమీకృత హాజరు విధానాన్ని అమలు చేయాలని వైద్యారోగ్యశాఖ నిర్ణయించింది. ఇందులో భాగంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో హాజరు పరిశీలనకు ముఖ గుర్తింపు విధానం అమలు చేయబోతోంది. ఈ పరికరం ఏకకాలంలో హాజరు సహా వ్యక్తి పరిశీలన, వ్యక్తికి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని తెలుసుకునే సాధనంగా..మూడు విధాలుగా సేవలందించనుంది.

ఎక్కడెక్కడ?
తెలంగాణ ఐటీ విభాగం సహకారంతో రాష్ట్రంలోని 12 ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని అమలు చేయనున్నారు. బోధనాసుపత్రుల స్థాయిలో గాంధీ ఆసుపత్రి, జిల్లా, ప్రాంతీయ ఆసుపత్రుల స్థాయిలో కింగ్‌కోఠి, కొండాపూర్‌, వనస్థలిపురం తదితర ఆసుపత్రుల్లో నూతన విధానాన్ని అమలు చేయాలని వైద్యారోగ్యశాఖ ప్రాథమికంగా నిర్ధారించింది. వీటికి అదనంగా రాష్ట్రంలో కొన్ని ప్రాంతీయ ఆసుపత్రులు, సామాజిక, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను త్వరలో గుర్తించనున్నారు. ఏయే దవాఖానాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేయాలనే అంశంపై ఇప్పటికే వైద్యారోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి శాంతికుమారి సమక్షంలో ఉన్నత స్థాయిలో భేటీ జరిగింది. హైదరాబాద్‌లో గుర్తించిన నాలుగు ఆసుపత్రులు పోనూ మిగిలిన వాటి ఎంపిక బాధ్యతను ఆయా విభాగాల అధిపతులకు ముఖ్య కార్యదర్శి అప్పగించారు. ‘‘ఒకట్రెండు రోజుల్లోనే మిగిలిన ఆసుపత్రుల ఎంపిక పూర్తిచేసి, నూతన విధాన అమలుకు సంబంధించిన కార్యాచరణను ప్రారంభిస్తాం. ఇందుకయ్యే ఖర్చును భరించడానికి ఓ స్వచ్ఛంద సంస్థ ముందుకొచ్చింది. తొలుత ఈ 12 ఆసుపత్రుల్లో ప్రారంభించి దశల వారీగా రాష్ట్ర మంతటా విస్తరిస్తాం’’ అని  వైద్య వర్గాలు తెలిపాయి.

రోగుల కోసం కూడా..
ఇప్పటికే ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకిచ్చే ఔషధాల నమోదు సమాచారాన్ని ‘ఈ-ఔషధి’ విధానంలో పొందుపర్చే ప్రక్రియను ప్రయోగాత్మకంగా ఈ నెల 1 నుంచి అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో అమలు చేస్తున్నారు. ఇదే తరహాలో గుర్తింపు విధానాన్ని రోగులకు కూడా వర్తింపజేయాలని అధికారులు భావిస్తున్నారు. ‘‘రోగి ముఖాన్ని ఒక్కసారి సాంకేతిక పరిజ్ఞానానికి అనుసంధానం చేస్తే ఆ రోగి ఏ ఆసుపత్రికి వెళ్లినా వ్యాధి సంబంధ సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. దీనివల్ల మెరుగైన వైద్యసేవలు అందించడానికి వీలుంటుంది’’ అని వైద్య వర్గాలు తెలిపాయి. త్వరలోనే ఈ విధానాన్ని అమల్లోకి తేనున్నట్లు వెల్లడించాయి.

ఎలా పనిచేస్తుంది?

*  ఓ ఉద్యోగి ఈ పరికరం ఎదుట నిలబడగానే అది అతని ముఖాన్ని స్కాన్‌ చేస్తుంది.

*  ఆ ముఖ గుర్తింపునకు ప్రత్యేక సంఖ్యను కేటాయిస్తారు.

*  ఆధార్‌ కార్డుతోనూ అనుసంధానం చేస్తారు.

*  ఆ వ్యక్తికి సంబంధించి సమగ్ర సమాచారాన్ని అందులో పొందుపరుస్తారు. ఉదాహరణకు గాంధీ ఆసుపత్రిలో పనిచేసే సహాయ ఆచార్యులైతే..అతను/ఆమె ఎప్పుడు ఎంబీబీఎస్‌ పూర్తిచేశారు? సహాయ ఆచార్యుడుగా ఎప్పుడు చేరారు? ఎక్కడ విధులు నిర్వర్తిస్తున్నారు? అనే సమాచారం అందులో నిక్షిప్తమవుతుంది. అతను ఆ పరికరం ముందు నిలబడగానే సదరు సమాచారమంతా అందులో ప్రత్యక్షమవుతుంది.

*  సదరు ఉద్యోగి ఏ రోజు, ఏ సమయానికి విధులకు హాజరయ్యారు? ఎప్పుడు వెళ్లారు? తదితర సమాచారం నమోదవుతున్న నేపథ్యంలో సదరు వివరాలను ఒక్క క్లిక్‌తో తెలుసుకునే వీలవుతుంది.

*  ఆ వ్యవస్థను రాష్ట్ర కార్యాలయంలోని కమాండ్‌ కంట్రోల్‌తోనూ అనుసంధానిస్తున్న కారణంగా ఉన్నతాధికారులు ఏ సమయంలోనైనా అతని హాజరును పరిశీలించే వీలుంటుంది.

*  తద్వారా హాజరు విషయంలో అవకతవకలకు అడ్డుకట్ట వేయవచ్చు.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.