close
45 ఏళ్లకే పింఛనుపై గరంగరం 

అధికార, ప్రతిపక్ష సభ్యుల నడుమ వాగ్యుద్ధం 
ముగ్గురు తెదేపా సభ్యుల సస్పెన్షన్‌ 
పింఛను బదులుగా వైఎస్సార్‌ చేయూత తెచ్చామన్న ఏపీ సీఎం జగన్‌ 
సభాపతి అనుమతితో ప్రసంగాల వీడియోల ప్రదర్శన

ఈనాడు-అమరావతి :  ‘ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు 45ఏళ్లకే పింఛను’ అంశంపై మంగళవారం ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో పెనుదుమారం రేగింది. అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదాలు చోటు చేసుకున్నాయి. తెదేపా శాసనసభాపక్ష ఉపనేత కె.అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నిమ్మల రామానాయుడుల సస్పెన్షన్‌కు దారి తీసింది. 45 ఏళ్లకు పింఛను స్థానంలో వైఎస్సార్‌ చేయూత తెచ్చామని సీఎం జగన్‌ వివరణ ఇవ్వడంతోపాటు తాను గతంలో చేసిన ప్రసంగాల వీడియో క్లిప్పింగులను సభాపతి అనుమతితో సభలో ప్రదర్శింపజేశారు. ఆ తర్వాత కూడా తెదేపా సభ్యుల ఆందోళన సాగింది. 45 ఏళ్లున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, అల్ప సంఖ్యాక వర్గాల మహిళలకు పింఛన్లు మంజూరు చేయడంపై తెదేపా సభ్యులు డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి, నిమ్మల రామానాయుడులు అడిగిన ప్రశ్నకు అలాంటిదేమీ లేదని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమాధానమిచ్చారు. ‘‘సాక్షి పత్రికలోనే 45 ఏళ్లు దాటితే పింఛను అని వచ్చింది. జగన్‌ అప్పుడు ప్రతి సభలో ఈ అంశాన్ని ప్రస్తావించారు. అది వాస్తవమా కాదా? ’’ అని తెదేపా ఎమ్మెల్యే రామానాయుడు నిలదీశారు. గతంలో జగన్‌ ప్రసంగాల వీడియోలను సభలో ప్రదర్శించేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. ‘‘జగన్‌ ఏది చెప్పినా అది శాసనమే.. మడమ తిప్పని నాయకుడు.. చంద్రబాబు తీరుగా రంగులు మార్చడం మా నాయకుడికి అలవాటు లేదు. 45 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు నాలుగేళ్లలో నాలుగు దఫాలుగా రూ.75వేలు ఇస్తామని చెప్పారు. వాటిని వక్రీకరించి మాట్లాడటం దురదృష్టకరం’’ అని మంత్రి పెద్దిరెడ్డి సమాధానమిచ్చారు.

మోసం చేయడం మా ఇంటా వంటా లేదు 
చర్చ నడుస్తున్న సమయంలో సభలోకి వచ్చిన ముఖ్యమంత్రి.. తాను ఎన్నికల ప్రచారంలో ఏం మాట్లాడానో  చూడండి అంటూ తాను పాదయాత్రలో చేసిన ప్రసంగాల వీడియో క్లిప్పింగును సభాపతి అనుమతితో ప్రదర్శింపజేశారు. ‘‘మోసం చేయడం.. అబద్ధాలాడటం మా ఇంటా వంటా లేదు.. ఇది మా మేనిఫెస్టో’’ అంటూ వివరించారు. తెదేపా సభ్యులు ఆందోళన విరమించకపోవడంతో ...రాష్ట్ర ప్రజలకు తెదేపా సభ్యుల ద్వంద్వ ప్రమాణాలు తెలియాల్సిన అవసరం ఉందంటూ మరోసారి వీడియో క్లిప్పింగ్‌ ప్రదర్శించారు.

తెదేపా సభ్యుల సస్పెన్షన్‌ 
సీఎం జగన్‌ మాట్లాడిన తర్వాత తెదేపా సభ్యులు తమ ఆందోళన కొనసాగించారు. ‘‘ముఖ్యమంత్రి ఏమి హామీ ఇచ్చారో రెండుసార్లు వీడియో చూపారు. మేం పంపిన వీడియో కూడా చూపండి. నిర్ణయం ప్రజలకు వదులుదాం’’ అని అచ్చెన్నాయుడు కోరారు. ఇదే సమయంలో కొందరు తెదేపా సభ్యులు 45 ఏళ్లకు పింఛన్లు ఇవ్వాలని డిమాండు చేస్తూ పోడియంలోకి వచ్చారు. కొందరు సభాపతి స్థానంలో ఉన్న కోన రఘుపతి చుట్టూ చేరి పత్రికా క్లిప్పింగులు చూపిస్తూ నిరసనకు దిగారు. దీంతో సభా వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి తెదేపా సభ్యుల సస్పెన్షన్‌కు ప్రతిపాదించారు. సభామర్యాద, ప్రజల శ్రేయస్సు కోసం తెదేపా సభ్యులు అచ్చెన్నాయుడు, బుచ్చయ్య చౌదరి, రామానాయుడును బడ్జెట్‌ సమావేశాలు ముగిసే దాకా సస్పెండ్‌ చేయాలని తీర్మానం ప్రవేశ పెట్టారు. దీనికి ఆమోదం లభించడంతో ముగ్గురూ బయటకు వెళ్లాలని సభాపతి కోరారు.

అధ్యక్షా ఇది పద్ధతి కాదు! 
అనంతరం సభలోకి వచ్చిన చంద్రబాబు.. 45 ఏళ్లకు పింఛనుపై గతంలో జగన్‌ ఇచ్చిన హామీని ప్రస్తావించారు. అది వారి గెజిట్‌ అయిన సాక్షి పత్రికలోనే వచ్చిందంటూ క్లిప్పింగ్‌ చూపెట్టారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ జోక్యం చేసుకుంటూ దాన్ని తనకు పంపాలని కోరారు. తాను ఏ సందర్భంలో అలా మాట్లాడానో ఆ తర్వాత వైఎస్సార్‌ చేయూత ఎలా తెచ్చామో వివరించారు. వీడియో క్లిప్పింగ్‌ను మరోమారు ప్రదర్శింపజేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సంక్షేమానికి తెచ్చిన బిల్లులతో తమ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందనే దుర్బుద్ధితో ఇలా చేస్తున్నారని మండిపడ్డారు. తర్వాత చంద్రబాబుకు మరోసారి మాట్లాడే అవకాశం ఇచ్చిన సభాపతి త్వరగా ముగించాలని సూచించారు. దీంతో జగన్‌ ఆగ్రహం వెలిబుచ్చారు. ‘‘అధ్యక్షా! ఇది పద్ధతి కాదు. ఒకే అంశంపై ఇంతసేపు చర్చించడం సరికాదు. ఆయన(చంద్రబాబు) మాట్లాడిన తర్వాత ఆ క్లిప్పింగ్‌ తెప్పించి నేను వివరణ ఇచ్చా మళ్లీ మైకు ఆయనకు ఇవ్వడంలో అర్ధం ఏముంది? వేరే అంశాలేవీ వద్దా! వక్రీకరణలోనే ఉందామా!’ అని ప్రశ్నించారు. దీంతో సభాపతి కోన రఘుపతి అన్ని ప్రశ్నలకు సమాధానం పూర్తయినట్లే అని ప్రకటించారు.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.