close
విశ్వప్రయత్నాలు 

ఉపకులపతిగా నేనూ అర్హుడినే 
100 మందికి పైగా దరఖాస్తు 
ఒక్కొక్కరు నాలుగైదు వర్సిటీలకు పోటీ 
ప్రస్తుత వీసీల్లో కొందరు రెండోసారి అవకాశం కోసం యత్నం 
ఈనాడు - హైదరాబాద్‌

చార్యులుగా పదేళ్ల అనుభవం పూర్తయిన వారు రాష్ట్ర విశ్వవిద్యాలయాల ఉపకులపతుల పోటీకి సై అంటున్నారు. అధిక శాతం మంది కనీసం నాలుగు విశ్వవిద్యాలయాలకు దరఖాస్తు చేస్తున్నారు. దరఖాస్తు చేయడానికి ఈ నెల 23తో గడువు ముగిసింది. ఇప్పటికే దరఖాస్తు చేసిన వారి సంఖ్య 170కి చేరినట్టు, దరఖాస్తుల సంఖ్య 900 దాటినట్టు అధికార వర్గాలు స్పష్టం చేశాయి. ప్రస్తుతం ఆచార్యులుగా వర్సిటీల్లో పనిచేస్తున్న వారితోపాటు పలువురు పదవీ విరమణ పొందిన వారు సైతం ఉపకులపతి పదవిని ఆశిస్తున్నారు. రాష్ట్రంలోని తొమ్మిది రాష్ట్ర విశ్వవిద్యాలయాలకు నూతన ఉపకులపతుల ఎంపికకు దరఖాస్తులు ఆహ్వానించిన నేపథ్యంలో ఏ వర్సిటీలో చూసినా కొత్త వీసీలపైనే చర్చ సాగుతోంది. విద్యాశాఖ కార్యదర్శికి ఆచార్యులు దరఖాస్తులు సమర్పిస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సన్నిహితులైన వారిని కలిసి తమ పేర్లను సిఫార్సు చేయాలని కోరుతున్నట్లు తెలిసింది. ఆంధ్రప్రదేశ్‌ స్థానికత ఉండి రాష్ట్రంలో పనిచేస్తున్న కొందరు ఆచార్యులు కూడా ఈ సారి దరఖాస్తుకు ముందుకు రావడం విశేషం.

ఇదీ పరిస్థితి 
ఒక్క ఓయూలోనే 70 మంది పదేళ్ల అనుభవం పూర్తయిన ఆచార్యులు ఉండగా వారిలో 60 మంది వరకు ఉపకులపతుల రేసులో ఉన్నట్లు వర్సిటీ వర్గాలు చెబుతున్నాయి. పదవీ విరమణ పొందిన వారు మరో 20 మంది వరకు ఉంటారని అంచనా. వారిలో కూడా పలువురు పోటీ పడుతున్నారు. ప్రస్తుత వీసీ రామచంద్రం సైతం మరోసారి అవకాశం వస్తుందని భావిస్తున్నారు. రిజిస్ట్రార్‌ గోపాల్‌రెడ్డి, జంతుశాస్త్రం ఆచార్యుడు ప్రతాప్‌రెడ్డి, ఓఎస్‌డీ కృష్ణారావు, విశ్రాంత ఆచార్యుడు భూపతిరావు తదితరులు గట్టిగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఉపాధ్యక్షుడు ఆర్‌.లింబాద్రి, వెంకట్రమణలు సైతం పోటీలో ఉన్నారు. 
కేయూలో అర్హులు 17 మంది ఉండగా వారిలో 10 మంది, విశ్రాంత ఆచార్యులు మరో 10 మంది వరకు దరఖాస్తు చేశారు. 
జేఎన్‌టీయూహెచ్‌ ప్రస్తుత వీసీ వేణుగోపాల్‌రెడ్డి మరోసారి అవకాశం కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. ఇంకా రెక్టార్‌ గోవర్ధన్‌, రిజిస్ట్రార్‌ యాదయ్య, ఇంజినీరింగ్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ సాయిబాబారెడ్డి, మెకానికల్‌ ఆచార్యులు విజయకుమార్‌ రెడ్డి, చెన్నకేశవరెడ్డి తదితరులు దరఖాస్తు చేశారు. 
అంబేడ్కర్‌ సార్వత్రిక వర్సిటీ ఉపకులపతి సీతారామారావు, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉపకులపతి ఎస్‌వీ సత్యనారాయణ మరోసారి అవకాశం కోసం యత్నిస్తున్నారు. తెలుగు వర్సిటీ కోసం కేయూ ఆచార్యుడు బన్న అయిలయ్య, ఓయూ ఆచార్యులు వి.నిత్యానందరావు, తండేగు కిషన్‌రావు తదితరులు పోటీపడుతున్నారు.

విశ్వవిద్యాలయ నామినీ ఎంపిక పూర్తి 
ప్రస్తుత ఉపకులపతుల పదవీ కాలం ఈ నెల 24వ తేదీతో ముగియనుండగా వారి ఎంపిక కోసం అన్వేషణ కమిటీలకు విశ్వవిద్యాలయం నామినీ తప్పనిసరి. నామినీని ఎంపిక చేయాల్సింది పాలకమండలి(ఈసీ) సభ్యులే. ఈ మేరకు తొమ్మిది విశ్వవిద్యాలయాల పాలక మండళ్ల(పర్యవేక్షణ, అభివృద్ధి కమిటీ-ఎండీసీ) సమావేశం మంగళవారం జరిగింది. నామినీలను ఎంపిక చేశారు.

కొద్దిరోజులు ఇన్‌ఛార్జి ఉపకులపతులే! 
రాష్ట్రంలోని మరో ఏడు విశ్వవిద్యాలయాల ఉపకులపతుల పదవీకాలం బుధవారంతో ముగియనున్న నేపథ్యంలో వారి స్థానంలో కొత్త వారిని నియమించే వరకు ఇన్‌ఛార్జి ఉపకులపతులను నియమించనున్నారని తెలిసింది. రాష్ట్రంలో 2016లో ఉపకులపతులను నియమించినప్పుడు కొందరు సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఆ సమయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ప్రస్తుత ఉపకులపతులకు పదవీకాలం పొడిగించడానికి వీల్లేదు. ఆనాటి తీర్పును క్షుణ్నంగా పరిశీలించిన ప్రభుత్వం ప్రస్తుత వీసీలకు పదవీకాలం పొడిగించరాదని నిర్ణయించినట్లు సమాచారం. ప్రస్తుతం శాతవాహన విశ్వవిద్యాలయానికి స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ విభాగం కమిషనర్‌ చిరంజీవి ఇన్‌ఛార్జి వీసీగా ఉన్నారు. మిగిలిన ఎనిమిది వర్సిటీలకు ఇన్‌ఛార్జులుగా ఐఏఎస్‌లను నియమించనున్నారని సమాచారం. ఒకవేళ అంతమంది అందుబాటులో లేకుంటే ఉన్నత విద్యామండలి ఉపాధ్యక్షులకు కూడా బాధ్యతలు అప్పగించనున్నారని తెలుస్తోంది.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.