close
‘సాగు’నంపుతున్నారు 

దశాబ్దంలో వ్యవసాయాన్ని వదిలేసినవారు 85 లక్షలు 
తెలుగు రాష్ట్రాల్లో 10 లక్షల మంది

ఈనాడు, దిల్లీ: దేశంలో 2001-11 మధ్య 80 లక్షల మంది రైతులు వ్యవసాయాన్ని వదిలిపెట్టినట్లు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ తెలిపారు. మంగళవారం లోక్‌సభలో భాజపా ఎంపీ గౌతం గంభీర్‌ అడిగిన ప్రశ్నకు ఆయన లిఖితపూర్వక సమాధానమిచ్చారు. 2001 జనాభా లెక్కల ప్రకారం దేశంలో 12.7 కోట్ల మంది రైతులుండగా 2011 నాటికి 11.8 కోట్లకు తగ్గినట్లు తెలిపారు. వీరంతా ఏ రంగానికి మళ్లారన్నది తెలియదని పేర్కొన్నారు. ఈ పదేళ్లలో మహారాష్ట్ర, ఉత్తరాఖండ్‌, రాజస్థాన్‌, అరుణాచల్‌ప్రదేశ్‌, మణిపుర్‌, మేఘాలయ, అసోంలలో తప్ప మిగిలిన అన్ని రాష్ట్రాల్లో వ్యవసాయదారులు తగ్గినట్లు చెప్పారు. ఆయన సమాధానం ప్రకారం...

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2001లో రైతుల సంఖ్య 70.86 లక్షలు ఉండగా 2011 నాటికి 60.49 లక్షలకు తగ్గిపోయింది. 
మహారాష్ట్రలో ఆ పదేళ్లలో 7.6 లక్షల మంది రైతులు పెరిగారు.

మూడేళ్లలో 191 కిలోల బంగారం స్వాధీనం 
ఈనాడు, దిల్లీ: శంషాబాద్‌ విమానాశ్రయంలో 2016 నుంచి 2019 జూన్‌ వరకు విమాన ప్రయాణికులు అక్రమంగా తరలిస్తున్న 191.892 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్‌ సింగ్‌ ఠాకూర్‌ తెలిపారు. బంగారం అక్రమ రవాణాపై రాజ్యసభ సభ్యుడు ఎం.ఏ.ఖాన్‌ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. మూడేళ్లలో 352 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వ పథకాలపై అధ్యయనం చేయాలి 
తెరాస ఎంపీ బండ ప్రకాశ్‌ సూచన 

ఈనాడు, దిల్లీ కేంద్రం కొత్తగా పథకాలు తీసుకొచ్చే సమయంలో రాష్ట్ర ప్రభుత్వ పథకాలపై అధ్యయనం చేయాలని తెరాస ఎంపీ బండ ప్రకాశ్‌ సూచించారు. మంగళవారం రాజ్యసభలో ఆయన మాట్లాడారు. రైతుల కోసం కొత్త పథకాలు తీసుకురావడంకన్నా రాష్ట్రాల్లో అమల్లోఉన్న పథకాలకు రీయంబర్స్‌ చేయడం ఎంతో ఉపయోగకరమన్నారు. 2030 నాటికి దేశంలో 40 శాతం ప్రజలకు తాగు నీరు ఉండదన్న నీతి ఆయోగ్‌ వ్యాఖ్యలను గుర్తుచేశారు. మిషన్‌ కాకతీయ, భగీరథలకు రూ.24 వేల కోట్లు ఇవ్వాలని నీతి ఆయోగ్‌ సిఫార్సు చేసిందని.. మిషన్‌ భగీరథకు తక్షణమే కనీసం రూ.2 వేల కోట్లను విడుదల చేయాలని కోరారు. రైతుబంధు, రైతు బీమా ద్వారా అన్నదాతల సంక్షేమానికి కృషిచేస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం సహకరించాలని కోరారు.

2018-19 నాలుగో త్రైమాసికంలో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 5.8 శాతంతో గత ఐదేళ్లలో అతి తక్కువగా ఉందని ఠాకూర్‌ తెలిపారు. రాజ్యసభ సభ్యుడు వై.ఎస్‌.చౌదరి అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 
పురుషులకు వచ్చే కేన్సర్లలో నోటి కేన్సర్‌ ప్రథమ స్థానంలో ఉందని.. మహిళల్లో ఇది నాలుగో స్థానంలో ఉందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అశ్వినీ కుమార్‌ చౌబే తెలిపారు. రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్‌ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి సమాధానం ఇచ్చారు.

కరీంనగర్‌-జగిత్యాల రహదారి విస్తరణ చేపట్టాలి 
ఈనాడు, దిల్లీ: కరీంనగర్‌-జగిత్యాల రహదారి విస్తరణ చేపట్టాలని కేంద్ర జాతీయ రహదారులు, రహదారి రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీకి భాజపా ఎంపీ బండి సంజయ్‌ విజ్ఞప్తి చేశారు. వేములవాడ నుంచి కోరుట్ల వరకు నాలుగు వరుసలుగా రహదారిని అభివృద్ధి చేయాలని కోరారు. వినతులను పరిశీలించి తగిన నిర్ణయం తీసుకుంటామని గడ్కరీ.. ఎంపీ సంజయ్‌కి హామీ ఇచ్చారు.

వాహన పన్ను బాధిత రాష్ట్రం తెలంగాణ 
తెరాస లోక్‌సభాపక్ష ఉప నేత ప్రభాకర్‌రెడ్డి 

ఈనాడు, దిల్లీ: ఒక్కో రాష్ట్రంలోకి వాహనం ప్రవేశించినప్పుడు ఒక్కో విధంగా పన్ను వసూలు చేస్తున్నారని తెరాస లోక్‌సభాపక్ష ఉప నేత కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. ‘కొన్ని రాష్ట్రాల్లో ఈ పన్నులు మరీ ఎక్కువగా ఉన్నాయి. తెలంగాణలో తక్కువ పన్ను ఉంది. పన్ను బాధిత రాష్ట్రంగా మారింది’ అని తెలిపారు. మోటార్‌ వెహికల్‌ (సవరణ) బిల్లు-2019పై లోక్‌సభలో మంగళవారం ఆయన మాట్లాడారు. ఈ బిల్లును తెరాస తరఫున సమర్థిస్తున్నట్లు చెప్పారు. ‘‘రోడ్డు ప్రమాదాలతో ఏడాదికి 1.50 లక్షల మందికిపైగా ప్రాణాలు కోల్పోతున్నారు. 5 లక్షల మందికిపైగా క్షతగాత్రులవుతున్నారు. ప్రమాదాల నివారణ చర్యలతో పాటు బాధితులకు ఇచ్చే పరిహారం పెంచాలి. దేశంలో 25 లక్షల మంది డ్రైవర్ల కొరత ఉంది. ప్రభుత్వం ఐటీఐల ద్వారా శిక్షణ ఇచ్చి వైద్య సదుపాయం, బీమా, ఇతర సౌకర్యాలు కల్పిస్తే యువత చోదక వృత్తిలోకి వస్తారు’’ అని ప్రభాకర్‌రెడ్డి వివరించారు.

ఐడీపీఎల్‌ భూముల విక్రయాలకు నిర్ణయం 
ఈనాడు, దిల్లీ: కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్‌ డ్రగ్స్‌, ఫార్మాస్యూటికల్స్‌ లిమిటెడ్‌(ఐడీపీఎల్‌) మూసివేయాలని 2016లోనే నిర్ణయించగా భూమి కూడా విక్రయించాలని 14.6.2018న నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం పేర్కొంది. తెరాస ఎంపీ గడ్డం రంజిత్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి డీవీ సదానంద గౌడ మంగళవారం లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానమిచ్చారు. మిషన్‌ ఫర్‌ ఇంటిగ్రేటెడ్‌ డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ హార్టికల్చర్‌ వార్షిక ప్రణాళికలో తెలంగాణకు ఒక కోల్డ్‌ స్టోరేజీ ప్రాజెక్టు చేర్చినట్లు కేంద్రం తెలిపింది. పసుపు నిల్వల నిమిత్తం తెలంగాణలో కోల్డ్‌స్టోరేజీ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా ప్రతిపాదన చేసిందా అని కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు ఈ సమాధానమిచ్చింది. తెలంగాణలోని రైతు బంధు, ఆంధ్రప్రదేశ్‌లోని రైతు భరోసా పథకాలకు కేంద్రం ఆర్థిక సాయం చేసే ప్రతిపాదన ఏదీ లేదని కూడా పేర్కొంది. ఆ పథకాలు ఆయా రాష్ట్ర ప్రభుత్వాల పథకాలని తెరాస ఎంపీ బొర్లకుంట వెంకటేశ్‌నేత అడిగిన ప్రశ్నకు జవాబ్చింది.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.