close
ట్రంప్‌ వ్యాఖ్యలపై దద్దరిల్లిన పార్లమెంట్‌ 

కశ్మీర్‌ విషయంలో మూడో పక్షం జోక్యమేంటని విపక్షాల నిలదీత 
అమెరికా అధ్యక్షుడితో ఏం మాట్లాడారో మోదీ వివరణ ఇవ్వాలని పట్టు 
ఉభయ సభల నుంచి వాకౌట్‌ 
తాజా పరిణామాలతో ట్రంప్‌ సర్కారు నష్ట నివారణ చర్యలు 
కశ్మీర్‌ ద్వైపాక్షిక అంశమేనని స్పష్టీకరణ 
దిల్లీ

శ్మీర్‌ విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలపై మంగళవారం పార్లమెంటు ఉభయ సభలు దద్దరిల్లాయి. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌... పాకిస్థాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌తో కలిసి సోమవారం వాషింగ్టన్‌లో అత్యంత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘‘ఇటీవల జపాన్‌లో జీ-20 సదస్సు సందర్భంగా మోదీ నన్ను కలిశారు. కశ్మీర్‌ విషయంలో మధ్యవర్తిత్వం వహించాలని అడిగారు. ఉభయ దేశాలు కోరితే నేను అందుకు సిద్ధం. నేను ఏదైనా సాయం చేయగలనంటే చేస్తాను’’ అని అన్నారు. విషయం తెలియగానే భారత్‌లో రగడ మొదలైంది. ఇది పూర్తిగా భారత్‌-పాకిస్థాన్‌లకు సంబంధించిన అంశమని, ఉభయ పక్షాలు చర్చలు, సంప్రదింపుల ద్వారా దీన్ని పరిష్కరించుకోవాలన్నది ప్రజల ఆకాంక్ష అని కాంగ్రెస్‌ తదితర విపక్షాలు గొంతెత్తాయి. ట్రంప్‌ మధ్యవర్తిత్వాన్ని ప్రధాని కోరడం అనుచితమని, దీనికి మోదీ సమాధానం చెప్పాల్సిందేనని పట్టుబట్టాయి. దీంతో విపక్షాల ఆరోపణలను ఖండిస్తూ రాత్రి వేళ విదేశాంగశాఖ ఓ ప్రకటనను విడుదల చేసింది. పాకిస్థాన్‌తో ఉన్న వివాదాలన్నింటిని ద్వైపాక్షిక చర్చల ద్వారా పరిష్కరించుకోవాలన్న దృఢమైన వైఖరినే తమ ప్రభుత్వమూ కొనసాగిస్తుందని అందులో స్పష్టం చేసింది. అయితే దీనికి విపక్షాలు సంతృప్తి చెందలేదు. ‘బలహీనమైన’ విదేశీ వ్యవహారాలశాఖ సమాధానం సంతృప్తికరంగా లేదని, ట్రంప్‌తో ఏం మాట్లాడారన్నది ప్రధాని మోదీయే జాతికి స్పష్టం చేయాలని కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ డిమాండ్‌ చేశారు. ట్రంప్‌ చెప్పింది నిజమైతే.. భారత ప్రయోజనాలనూ, 1972 శిమ్లా ఒప్పందాన్నీ మోదీ మోసగించినట్టేనని దుయ్యబట్టారు.

రెండు చోట్లా అదే రగడ 
పార్లమెంటు ఉభయ సభలు మంగళవారం ప్రారంభం కాగానే ట్రంప్‌ వ్యాఖ్యలను విపక్షాలు ప్రస్తావించాయి. లోక్‌సభలో కాంగ్రెస్‌ తదితర ప్రతిపక్షాల సభ్యులు నుంచొని మోదీ సమాధానం చెప్పాలంటూ నినాదాలు చేశారు. శూన్య గంటలోనూ ఇదే అంశాన్ని ప్రస్తావించారు. కాంగ్రెస్‌ సభ్యుడు మనీశ్‌ తివారి, అన్నాడీఎంకే సభ్యుడు టి.ఆర్‌.బాలు మాట్లాడుతూ... మధ్యవర్తిత్వం వహించాలని మోదీ కోరినట్టు ట్రంప్‌ చెప్పినందున దీనికి ప్రధానే సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. మంత్రి జయ్‌శంకర్‌ ప్రకటన చేసేందుకు ప్రయత్నిస్తుండగా విపక్షలన్నీ అభ్యంతరం తెలిపాయి. ‘‘మధ్యవర్తిత్వం వహించాలని ట్రంప్‌ను మోదీ అసలు అడగనే లేదు. కశ్మీర్‌ విషయంలో మూడో పక్షం జోక్యానికి తావులేదు’’ అని మంత్రి స్పష్టం చేశారు.

తెదేపా, వైకాపా, తెరాస, బిజద మినహా... 
రాజ్యసభలోనూ అధికార, విపక్షాల నడుమ మాటల తూటాలు పేలాయి. దీంతో ఛైర్మన్‌ వెంకయ్యనాయుడు పలుమార్లు సభను వాయిదా వేశారు. కశ్మీర్‌ విషయంలో జోక్యం చేసుకోవాలని మోదీ అసలు ట్రంప్‌ను అడగనే లేదని మంత్రి జయ్‌శంకర్‌ సమాధానమిచ్చినా విపక్షాలు శాంతించలేదు. తెదేపా, వైకాపా, తెరాస, బిజద సభ్యులు మినహా మిగతా విపక్ష సభ్యులంతా సభ నుంచి వాకౌట్‌ చేశారు.

ఆజాద్‌తో మంతనాలు 
మరోవైపు ప్రతిపక్ష నేతలంతా రాజ్యసభ విపక్ష నేత గులాంనబీ ఆజాద్‌ ఛాంబర్‌లో సమావేశమయ్యారు. ప్రధాని మోదీ ఉభయ సభలకూ వచ్చి ట్రంప్‌ వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాల్సిందేనని పట్టుబట్టారు. సీపీఐ, ఎస్పీ, ఆప్‌ నేతలు డి.రాజా, రాంగోపాల్‌ యాదవ్‌, సంజయ్‌సింగ్‌ తదితరులతో కలిసి ఆజాద్‌ మాట్లాడుతూ... ప్రధాని చెప్పే ‘కథ’ను నమ్మడానికి తాము సిద్ధంగా ఉన్నామని, అయితే ముందు ఆయన సభకు వచ్చి వివరణ ఇవ్వాలన్నారు. కశ్మీర్‌ ముమ్మాటికి ద్వైపాక్షిక వ్యవహారమని, మధ్యవర్తిత్వం వహించాలని మోదీ కోరినట్టు పాక్‌ ప్రధానికి ట్రంప్‌ చెప్పి ఉండరని భావిస్తున్నామన్నారు. మూడోపక్షం జోక్యానికి తావులేదన్న ప్రభుత్వ వైఖరిని స్వాగతిస్తున్నామని, అయితే ట్రంప్‌ వ్యాఖ్యలపై ప్రధాని ఎందుకు మౌనం వహిస్తున్నారని కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన అధికార ప్రతినిధి రణ్‌దీప్‌ సూర్జేవాలా ప్రశ్నించారు. భారత ప్రధాని పార్లమెంటుకు వచ్చి, ట్రంప్‌ వ్యాఖ్యలపై దేశానికి వివరణ ఇవ్వాలని తృణమూల్‌ ఎంపీ డెరెక్‌ ఓబ్రియన్‌ డిమాండ్‌ చేశారు. మోదీ నిజం చెబుతున్నారో, ట్రంప్‌ నిజం చెబుతున్నారో కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేయాలని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కోరారు.

విపక్షాల వైఖరి అనుచితం: భాజపా 
విపక్షాల విమర్శలను కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌ తిప్పికొట్టారు. ట్రంప్‌ వ్యాఖ్యల పట్ల మంత్రి జయ్‌శంకర్‌ విస్పష్టమైన సమాధానం ఇచ్చిన తర్వాత కూడా విపక్షాలు అనుచితంగా, బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నాయన్నారు.

పత్రాలు పట్టుకుని సోనియా సాయం... 
ట్రంప్‌ వ్యాఖ్యలపై లోక్‌సభలో యూపీఏ ఛైర్‌పర్సన్‌ సోనియాగాంధీ మాట్లాడకపోయినా... ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు అవసరమైన పత్రాలను మాత్రం ఆమె ఓ ఫోల్డరులో సిద్ధం చేసుకుని మంగళవారం సభకు తీసుకొచ్చారు. కాంగ్రెస్‌ ఎంపీ మనీశ్‌ తివారి మాట్లాడుతున్నప్పుడు... తన వద్దనున్న ఓ పత్రాన్ని ఆయనకు ఇచ్చారు. అందులో ఉన్న ట్రంప్‌ వ్యాఖ్యలను తివారి యథాతథంగా చదివారు. అనంతరం ఆ కాగితాన్ని మళ్లీ సోనియాగాంధీకి ఇవ్వగా... ఆమె దాన్ని అత్యంత జాగ్రత్తగా మళ్లీ ఫోల్డరులో సర్దిపెట్టుకున్నారు.

ఆహ్వానించిన ఎన్సీ, పీడీపీ 
ట్రంప్‌ మధ్యవర్తిత్వ ప్రతిపాదనను హురియత్‌ కాన్ఫరెన్స్‌ అధ్యక్షుడు మీర్వాయిజ్‌ ఉమర్‌ ఫరూఖ్‌ స్వాగతించారు. కశ్మీర్‌ సమస్యకు చర్చల ద్వారా పరిష్కారం కనుగొనాలన్నదే తమ చిరకాల అభిమతమన్నారు. కశ్మీర్‌లో శాంతిని నెలకొల్పేందుకు ఉభయ దేశాలు ఈ మధ్యవర్తిత్వ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పీడీపీ అధ్యక్షురాలు మెహబూబూ ముఫ్తి అన్నారు. 

మోదీ చిత్తశుద్ధికి నిదర్శనం: ఫరూక్‌ 
శ్రీనగర్‌: కశ్మీర్‌ వివాద పరిష్కారం కోసం ప్రధాని మోదీ మధ్యవర్తిత్వం కోరడం స్వాగతించదగిన విషయమని నేషనల్‌ కాన్ఫెరెన్స్‌(ఎన్‌సీ) అధ్యక్షుడు ఫరూక్‌ అబ్దుల్లా అన్నారు. దీర్ఘకాలంగా వేధిస్తున్న సమస్యను పరిష్కరించేందుకు మోదీ చిత్తశుద్ధితో చేస్తున్న ప్రయత్నాలకు ఇది నిదర్శనమంటూ ఆయన్ను అభినందించారు. భారత్‌, పాక్‌ శత్రుత్వాన్ని పక్కనపెట్టాల్సిన సమయం వచ్చేసిందన్నారు. కశ్మీర్‌ వివాదంలో మధ్యవర్తిత్వం జరపాల్సిందిగా మోదీ కోరారని ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలపై ఫరూక్‌ ఈ మేరకు స్పందించారు.

దిద్దుబాటు బాటలో ట్రంప్‌ సర్కారు 
‘కశ్మీర్‌’ ద్వైపాక్షిక అంశమేనని స్పష్టీకరణ 

వాషింగ్టన్‌: ట్రంప్‌ వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి తెరతీయడంతో ఆయన ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు మొదలుపెట్టింది. కశ్మీర్‌ సమస్య భారత్‌, పాక్‌ మధ్య ద్వైపాక్షిక అంశమని మంగళవారం ప్రకటించింది. వివాదాన్ని పరిష్కరించుకునేందుకు ఇరుదేశాలు కూర్చొని మాట్లాడుకోవడాన్ని తాము స్వాగతిస్తామని తెలిపింది. ట్రంప్‌ వివాదాస్పద వ్యాఖ్యలపై అడిగిన ప్రశ్నకు అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఒకరు ఈ మేరకు స్పందించారు. ‘‘పాక్‌ తమ భూభాగంలోని ఉగ్రవాదులపై ఉక్కుపాదం మోపితే.. భారత్‌తో ద్వైపాక్షిక చర్చలకు బీజం పడుతుంది. ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ ఇప్పుడు ఆ దిశగా పని ప్రారంభించారు’’ అని కూడా ఆయన పేర్కొన్నారు. భారత్‌, పాక్‌ కోరితే కశ్మీర్‌ వివాద పరిష్కార ప్రక్రియలో సహాయం చేసేందుకు అమెరికా సిద్ధంగా ఉందని శ్వేతసౌధం సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు.

భారత్‌కు అమెరికా చట్టసభ సభ్యుల మద్దతు 
వాషింగ్టన్‌: ట్రంప్‌ వ్యాఖ్యలను అమెరికాలో పలువురు చట్టసభ సభ్యులు ఖండించారు. భారత్‌కు తమ మద్దతు ప్రకటించారు. డెమోక్రటిక్‌ పార్టీ కీలక నేత బ్రాడ్‌ షెర్మాన్‌ ఏకంగా ట్రంప్‌ వ్యాఖ్యలపై భారత రాయబారికి క్షమాపణలు తెలిపారు. ‘‘కశ్మీర్‌ వివాదంలో తృతీయ పక్షం జోక్యానికి భారత్‌ వ్యతిరేకమని దక్షిణాసియాలో విదేశాంగ విధానం గురించి అవగాహన ఉన్నవారందరికీ తెలుసు. మోదీ మధ్యవర్తిత్వాన్ని కోరరని కూడా తెలుసు. ట్రంప్‌ వ్యాఖ్యలు అపరిపక్వంగా, ఆందోళనకరంగా ఉన్నాయి. ఆయన వ్యాఖ్యలపై భారత రాయబారి హర్ష్‌ శృంగ్లాకు క్షమాపణలు చెప్పా’’ అని షెర్మాన్‌ తెలిపారు. విదేశీ వ్యవహారాలపై హౌస్‌ కమిటీకి ఛైర్మన్‌గా ఉన్న ఎలియట్‌ ఎంజెల్‌ కూడా భారత్‌కు మద్దతు ప్రకటించారు. కశ్మీర్‌ వివాదాన్ని భారత్‌, పాక్‌ ద్వైపాక్షిక చర్చలతో పరిష్కరించుకోవాలని అభిప్రాయపడ్డారు.

ట్రంప్‌ వ్యాఖ్యలపై మాజీ దౌత్యవేత్తల ఆందోళన 
వాషింగ్టన్‌: ట్రంప్‌ వివాదాస్పద వ్యాఖ్యలతో భారత్‌-అమెరికా సంబంధాలు దెబ్బతినే ముప్పుందని  పలువురు మాజీ దౌత్యవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. కశ్మీర్‌ విషయంలో ట్రంప్‌ సరైన అవగాహన లేకుండా మాట్లాడారని అమెరికా విదేశాంగ శాఖ మాజీ దౌత్యవేత్త అలైసా ఏరెస్‌ పేర్కొన్నారు. ‘‘ట్రంప్‌ సరైన సన్నద్ధత లేకుండా సమావేశాలకు హాజరవుతున్నారు. ఏది తోస్తే అది మాట్లాడుతున్నారు. దౌత్యపరమైన వ్యవహారాల్లో అత్యంత అప్రమత్తంగా ఉండాలి. సరైన భాష వాడాలి. వాస్తవాలను వక్రీకరించకూడదు. కానీ అవేమీ ట్రంప్‌ ఈరోజు పాటించలేదు’’ అని ఆమె వ్యాఖ్యానించారు. ‘భారత్‌తో సంబంధాలకు ట్రంప్‌ చాలా నష్టం చేశారు. కశ్మీర్‌, అఫ్గానిస్థాన్‌ విషయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు సరికాదు’ అని భారత్‌లో అమెరికా మాజీ రాయబారి రిచర్డ్‌ వర్మ అన్నారు. అమెరికాలో పాకిస్థాన్‌ మాజీ రాయబారి హుస్సేన్‌ హక్కానీ స్పందిస్తూ.. ‘‘అఫ్గానిస్థాన్‌ విషయంలో ఒప్పందం కోసం పాక్‌ సహాయాన్ని ట్రంప్‌ కోరుకుంటున్నారు. అదే కోవలో పాకిస్థాన్‌ కూడా కశ్మీర్‌ విషయంలో తన సహాయం కోరుకుంటున్నట్లు ఆయన భ్రమపడుతున్నారు’’ అని పేర్కొన్నారు.

అఫ్గాన్‌ను పూర్తిగా తుడిచిపెట్టేయగలను: ట్రంప్‌ 
కాబూల్‌: కశ్మీర్‌పై వ్యాఖ్యలతో కలకలం సృష్టించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ అఫ్గానిస్థాన్‌ విషయంలోనూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను తల్చుకుంటే అఫ్గాన్‌ యుద్ధంలో సులభంగా గెలవగలనని.. అయితే, కోటిమందిని చంపాలని తాను కోరుకోవడం లేదని పేర్కొన్నారు. పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌తో సోమవారం భేటీ అయిన ట్రంప్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. అఫ్గాన్‌ సంక్షోభానికి త్వరగా తెరదించగల ప్రణాళికలు తన వద్ద ఉన్నాయని ట్రంప్‌ అన్నారు. కానీ అవి కేవలం 10 రోజుల్లో భూమిపై నుంచి ఆ దేశాన్ని పూర్తిగా తుడిచిపెట్టేస్తాయని వ్యాఖ్యానించారు. అందుకే ఆ మార్గాన్ని ఎంచుకోవడం లేదని తెలిపారు.

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.