close
పుర సవరణ 

పురపాలక ఎన్నికల తేదీలపై సర్కారుకు అధికారమేంటి?: గవర్నర్‌ అభ్యంతరం 
కొత్త చట్టంలోని నిబంధన మార్చాలని సూచన 
సవరించి ఆర్డినెన్స్‌ జారీచేసిన రాష్ట్ర ప్రభుత్వం

ఈనాడు, హైదరాబాద్‌: పురపాలక ఎన్నికల తేదీలను నిర్ణయించే అధికారం రాష్ట్ర ఎన్నికల సంఘానికే ఉంటుంది. ఈ అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి కల్పిస్తూ రూపొందించిన కొత్త పురపాలక బిల్లుకు గవర్నర్‌ నరసింహన్‌ అభ్యంతరం చెప్పారు. ఆయన సూచనను పరిగణనలోకి తీసుకొని సవరణ చేస్తూ ప్రభుత్వం ఆర్డినెన్స్‌ జారీ చేసింది. దీంతో కొత్త పురపాలక చట్టం-2019 అమల్లోకి వచ్చింది. చట్టానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం త్వరలో విధివిధానాలు ప్రకటించనుంది. ఈ కొత్త చట్టం ప్రకారమే పురపాలక ఎన్నికలు జరుగుతాయి. పరిపాలనా సంస్కరణల్లో భాగంగా ప్రభుత్వం కొత్త పురపాలక చట్టం తెచ్చేందుకు పూనుకున్న విషయం తెలిసిందే. ఉభయసభలు ఆమోదం తెలపడంతో బిల్లును గవర్నర్‌ ఆమోదానికి పంపింది. పరిశీలించిన గవర్నర్‌, న్యాయనిపుణుల సలహాలు తీసుకున్నారు.

బిల్లులో ఒక అంశంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. పట్టణ ప్రాంత స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ తేదీలను రాష్ట్ర ప్రభుత్వం సూచించేలా బిల్లులో పొందుపర్చడం సబబు కాదని, ఆ అధికారం ఎన్నికల సంఘానికే ఉండాలని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆ మేరకు సవరణ చేసి ఆర్డినెన్స్‌ తెచ్చింది.

ఇది ప్రజాస్వామిక శక్తుల విజయం: దత్తాత్రేయ 
ఈనాడు, హైదరాబాద్‌: కొత్త పురపాలక బిల్లులోని అంశాలు రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయని భాజపా ముందే చెప్పిందని కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. ఈ బిల్లుపై గవర్నర్‌ నరసింహన్‌ అభ్యంతరాలు చెబుతూ తిప్పిపంపడం ప్రజాస్వామిక శక్తుల విజయంగా ఆయన అభివర్ణించారు. మంగళవారమిక్కడ పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఇకనైనా తన తీరు మార్చుకోవాలని, అఖిలపక్ష సమావేశం పెట్టి కొత్త పురపాలక చట్టంపై ప్రతిపక్షాల సలహాలు తీసుకోవాలని సూచించారు. తెలంగాణలో భాజపా ఎదుగుదలను చూసి ఓర్వలేకే పార్టీ నేతలు, కార్యకర్తలపై అధికార తెరాస దాడులు చేస్తోందని దత్తాత్రేయ విమర్శించారు.

చకచకా పరిణామాలు 
రాజ్‌భవన్‌లో గవర్నర్‌ కొత్త పురపాలక బిల్లులో సవరణను సూచించిన సమాచారం ముఖ్యమంత్రికి అందగా ఆయన పరిస్థితిని సమీక్షించినట్లు తెలిసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జోషి, పురపాలక ముఖ్య కార్యదర్శి అర్వింద్‌కుమార్‌, న్యాయశాఖ కార్యదర్శి నిరంజన్‌రావు ఇతర ఉన్నతాధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. రాష్ట్రంలో కొత్త చట్టం మేరకే పురపాలక ఎన్నికలకు ప్రభుత్వం సన్నద్ధమవుతున్నట్టు ఇప్పటికే సీఎం ప్రకటించిన దృష్ట్యా తిరిగి చట్టసభలను సమావేశపరచి గవర్నర్‌ సూచనల ప్రకారం బిల్లును సవరించడానికి సమయం లేదు. ఈ పరిస్థితుల్లో స్వల్ప సవరణతో ఆర్డినెన్స్‌ జారీకి ప్రభుత్వం మొగ్గుచూపినట్లు తెలుస్తోంది.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.