close
నాగర్జన సాగర్‌

పదేళ్ల అనంతరం సాగర్‌ అన్ని గేట్ల ఎత్తివేత
ఆగస్టులో నీటి విడుదల పదకొండేళ్లలో తొలిసారి
ఎగువ నుంచి 7.6 లక్షల  క్యూసెక్కులకు పైగా ప్రవాహం
మరో రెండు రోజుల పాటు వరద
కృష్ణాకు తోడైన తుంగభద్ర
శ్రీశైలానికి పది లక్షలకు పైగా క్యూసెక్కుల రాక
పులిచింతలకు భారీ వరద

పుష్కర ఘాట్‌లో ఈతకు వెళ్లి ఒకరి గల్లంతు

* కృష్ణవేణి కరుణించింది.. ఎగువ నుంచి వస్తున్న భారీ ప్రవాహం.. దానికితోడు పరీవాహక ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో కృష్ణమ్మ పొంగిపొర్లుతోంది!

తూర్పుకొండలు పచ్చటి పావడా కట్టుకుని నల్లటి కృష్ణమ్మకు స్వాగతం పలుకుతుండగా.. ఆ ఘట్టాన్ని చూడడానికి దట్టమైన నల్లటి మేఘాలు నేల మీదకు దిగిపోయాయన్నట్లుగా ఉండే సుందరదృశ్యం.. నాగార్జున సాగర్‌ ప్రాజెక్టు గేట్లన్నీ ఎత్తివేయడంతో అంతవరకు శివుని జటాఝూటంలో చిక్కుకున్న గంగమ్మ ఒక్కసారిగా బయటకు ఉరికినట్లు ప్రవాహం వెల్లువెత్తగా తెలుగురాష్ట్రాలు పులకించిపోతున్నాయి..

ఈనాడు, నల్గొండ, హైదరాబాద్‌, విజయపురిసౌత్‌ (గుంటూరు), న్యూస్‌టుడే: రెండు తెలుగురాష్ట్రాలకు వరప్రదాయిని అయిన నాగార్జునసాగర్‌ నిండుకుండలా మారింది. ప్రవాహం అంతకంతకూ పెరుగుతుండడంతో పదేళ్ల తర్వాత సోమవారం మొత్తం గేట్లు అన్నింటినీ ఎత్తి అధికారులు నీటిని దిగువకు విడుదల చేశారు. మొదట ఉదయం 7.25 గంటలకు 4 క్రస్ట్‌ గేట్ల ద్వారా నీటిని విడుదల ప్రారంభించారు. కొద్దిసేపటికే మరో రెండు.. ఆ తర్వాత మరికొన్ని చొప్పున మొత్తం 26 గేట్లనూ ఎత్తేశారు. సాగర్‌కు సోమవారం సాయంత్రానికి దాదాపు 7.6 లక్షల క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతోంది. కృష్ణా ప్రవాహానికి తుంగభద్ర తోడయింది. శ్రీశైలం ఎగువన రెండు నదుల ప్రవాహం కలిపి 10 లక్షల క్యూసెక్కుల వరద వస్తోంది. జూరాల నుంచి దిగువకు 8.21 లక్షల క్యూసెక్కులు, తుంగభద్ర నది నుంచి సుంకేశుల బ్యారేజీ వద్ద 2.08 లక్షల క్యూసెక్కులు విడుదలవుతున్నాయి. ఈ ప్రవాహమంతా శ్రీశైలం జలాశయానికి పరుగులు పెడుతోంది. ఎగువన ఆలమట్టి వద్ద 5.5 లక్షలు, నారాయణపూర్‌ వద్ద 5.90 లక్షలకు పైగా ప్రవాహాలు ఉన్నాయి. జూరాల వద్ద 8.5 లక్షల క్యూసెక్కుల వరద నమోదు అవుతోంది. భీమా నదిలోనూ లక్ష క్యూసెక్కుల ప్రవాహం దిగువకు వస్తోంది. ఇవన్నీ కలిసి శ్రీశైలం జలాశయానికి పెద్దఎత్తున పోటెత్తుతున్నాయి. అక్కడి నుంచి దిగువకు 8.26 లక్షల క్యూసెక్కులు నాగార్జునసాగర్‌కు వదులుతున్నారు. వరద అంతకంతకూ పెరగడంతో సాయంత్రానికి మొత్తం సాగర్‌కున్న మొత్తం 26 గేట్లనూ 12 అడుగుల మేర ఎత్తి 3.27 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. విద్యుదుత్పత్తి, ఎడమ కాల్వ, ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టుకు కలిపి మరో 40 వేల క్యూసెక్కుల నీరు కిందకు వెళుతోంది. ప్రాజెక్టుకు ఉన్న మొత్తం 26 క్రస్ట్‌ గేట్ల ద్వారా నీటిని విడుదల చేయడం 2009 తర్వాత ఇదే తొలిసారి. అలాగే గోదావరి నుంచి ధవళేశ్వరం ఆనకట్ట వద్ద 12 లక్షల క్యూసెక్కులు సముద్రంలో కలుస్తున్నాయి.

సాగర్‌ సంగతులివి..
*  సాగర్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు - 312 టీఎంసీలు.
*  కృష్ణా నదికి భారీ వరదలొచ్చిన 2009లో సాగర్‌ నీటిమట్టం 549 అడుగులు ఉన్నప్పుడే నీటిని దిగువకు విడుదల చేశారు.
*  ఇప్పుడు సాగర్‌ నీటిమట్టం 557 అడుగులు ఉన్నప్పుడు ప్రాజెక్టు క్రస్ట్‌ గేట్లు ఎత్తడం గమనార్హం.
*   సోమవారం సాయంత్రానికి ప్రాజెక్టులో 566.60 (246 టీఎంసీలు) అడుగుల మేర నీరు నిల్వ ఉంది.

పదకొండేళ్లలో ఇదే తొలిసారి
రెండు నెలల నుంచి వర్షాభావ పరిస్థితులతో అల్లాడుతున్న అన్నదాతలు ఈ ఏడాది ఆగస్టులోనే సాగర్‌ ఎడమ కాల్వకు నీటిని విడుదల చేయడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆగస్టు రెండో వారంలోనే కాల్వలకు, క్రస్ట్‌గేట్ల ద్వారా నీటిని విడుదల చేయడం 2008 తర్వాత ఇదే తొలిసారి.
*  అప్పుడు భారీ వర్షాలతో కృష్ణా బేసిన్‌లో వరదలు రావడంతో ఆగస్టు తొలి వారంలోనే నాగార్జునసాగర్‌ క్రస్ట్‌ గేట్లను ఎత్తామని అధికారులు తెలిపారు.
*  ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టానికి చేరుకోవడంతో గతేడాది సెప్టెంబరు 2న రెండు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు.
*  వచ్చే రెండు మూడు రోజుల్లో కృష్ణా బేసిన్‌కు 130 టీఎంసీల వరద ప్రవాహం వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించినట్లు ఎన్నెస్పీ చీఫ్‌ ఇంజినీరు నర్సింహ వెల్లడించారు.
*  ఈ ప్రవాహం ఇలాగే రెండు రోజులు స్థిరంగా కొనసాగితే రానున్న 36 గంటల్లో సాగర్‌ పూర్తి స్థాయి నీటిమట్టానికి చేరుకుంటుందన్నారు.

పులిచింతలను తాకిన కృష్ణమ్మ
సాగర్‌ నుంచి అన్ని క్రస్ట్‌ గేట్ల ద్వారా నీటి విడుదల కొనసాగుతుండటం.. కింద ఉన్న టెయిల్‌పాండ్‌ ప్రాజెక్టు గేట్లను సైతం ఎత్తడంతో కృష్ణమ్మ పులిచింతల వైపు పరుగులు పెడుతోంది. పులిచింతల ప్రాజెక్టుకు సోమవారం సాయంత్రానికి 2.4 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. మొత్తం 45 టీఎంసీలకు గాను ప్రస్తుతం 3.9 టీఎంసీల నీరు నిల్వ ఉంది. మంగళవారం సాయంత్రానికి ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టానికి చేరుకుంటుందని, అక్కడి నుంచి ప్రకాశం బ్యారేజీ వైపు కృష్ణమ్మ పరుగులు పెట్టనుందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

సాగర్‌లో పర్యాటకుల సందడి
పదేళ్ల అనంతరం సాగర్‌ అన్ని గేట్ల ఎత్తి నీటిని దిగువకు వదులుతుండడంతో ఆ సుందర జలదృశ్యాన్ని చూడడానికి ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల నుంచి పర్యాటకులు పోటెత్తుతున్నారు. ఘాట్‌రోడ్లపై ఎటుచూసినా కార్లే కనిపిస్తున్నాయి. కృష్ణమ్మ పరవళ్ల సుందర దృశ్యాలు మరో వారం పాటు ఉండే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి.

కర్నూలు నగరాన్ని తాకిన వరద

ఈనాడు డిజిటల్‌, కర్నూలు: ఒకవైపు కృష్ణా జలాలు, మరోవైపు తుంగభద్ర జలాశయం నుంచి వరదనీరు పోటెత్తుతుండడంతో కర్నూలు నగర ప్రజలు భయాందోళన చెందుతున్నారు. శ్రీశైలం వెనుక జలాలు నగరంలోని జమ్మి చెట్టు ప్రాంతాన్ని తాకడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. సంకలబాగ్‌ సమీపంలో గంగమ్మ తల్లి దేవాలయాన్ని వరద నీరు చుట్టుముట్టింది.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.