close
నెట్టింట విప్లవం

వచ్చే నెల నుంచే జియో ఫైబర్‌
ఒకే కనెక్షన్‌తో ఇంటర్నెట్‌, టీవీ, టెలిఫోన్‌

మీ ఇంట సాంకేతిక విప్లవం రాబోతోంది. ఒకే కనెక్షన్‌తో ఇంటర్నెట్‌, టీవీ, టెలిఫోన్‌ సౌకర్యాలను అందించేందుకు అత్యాధునిక జియో ఫైబర్‌ వచ్చేస్తోంది. ఉచితంగా టీవీ కనెక్షన్‌, దేశంలో ఎక్కడికైనా పైసా ఖర్చులేకుండా మాట్లాడుకునేలా ల్యాండ్‌లైన్‌ టెలిఫోన్‌,  ఒకేసారి దేశ విదేశాల్లోని నలుగురితో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడుకునే అవకాశం వంటి సదుపాయాలను ఇది అందించనుంది. అమెరికాలోని నెట్‌ సగటు వేగం కంటే దీని వేగం ఎక్కువ. రిలయన్స్‌ అధినేత ముకేశ్‌ అంబానీ జియో ఫైబర్‌ వివరాలను సోమవారం ముంబయిలో వెల్లడించారు.

ఇంట్లోనే సినిమా రిలీజ్‌
ప్రీమియం చందాదారులు థియేటర్లలో విడుదలైన రోజే తమ ఇంట్లోనూ కొత్త సినిమా చూసే సదుపాయాన్ని అందుబాటులోకి తెస్తాం.

-ముకేశ్‌ అంబానీ


జిల్‌..జిల్‌.. జియో ఫైబర్‌

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ 42వ వార్షిక సాధారణ సమావేశం
సెప్టెంబరు 5 నుంచి బ్రాడ్‌బ్యాండ్‌ సేవలు
ప్రీమియం చందాదార్లు ఇళ్లలోనూ కొత్త సినిమా చూసే వీలు
ఈ సేవలు వచ్చే ఏడాది నుంచి
రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఛైర్మన్‌ ముకేశ్‌ అంబానీ

‘సింబా.. చూడు.. సూర్యకిరణాలు పడే ప్రతీ చోటూ మన రాజ్యమే’ అంటూ ‘ద లయన్‌ కింగ్‌’ సినిమాలో యువరాజుకు రాజు ముఫాసా చెబుతుంటే.. ఎవరికైనా రోమాలు నిక్కబొడుచుకుంటాయి.

ముకేశ్‌ అంబానీ తమ ఫైబర్‌ సేవల ఆరంభంలో ఈ దృశ్యాన్నే చూపి, తమ కంపెనీ బ్రాడ్‌బ్యాండ్‌ ప్రణాళిక ఎంతటి శక్తిమంతమైందో చాటారు. మూడేళ్లలోనే జియో మొబైల్‌ కనెక్షన్లు 34 కోట్లను చేరగా, అత్యధిక వేగం బ్రాడ్‌బ్యాండ్‌ సేవలు అందించే జియో ఫైబర్‌ కూడా ప్రతి ఇంటికీ చేరేలా పథక రచన చేసి, అధికారిక ప్రకటన చేశారు. కంపెనీ రుణభారాన్ని తీర్చేందుకు తొలిసారిగా తమ సంస్థల్లో వాటాలు విక్రయిస్తున్నట్లు వెల్లడించారు. కొత్త సేవల గురించి  ముకేశ్‌, ఆకాశ్‌, ఈశా అంబానీ మాటల్లోనే..

సెప్టెంబరు 5 నుంచి

జియో ఫైబర్‌ సేవలను జియో మూడో వార్షికోత్సవ రోజైన సెప్టెంబరు 5 నుంచి మొదలుపెట్టనున్నాం. కనీసం 100 ఎమ్‌బీపీఎస్‌ వేగంతో బ్రాడ్‌బ్యాండ్‌ సేవలు నెలకు రూ.700 (జీఎస్‌టీ అదనం) నుంచి పొందవచ్చు. 1 జీబీపీఎస్‌ వేగం సేవలు పొందేందుకు నెలవారీ రూ.10,000 (జీఎస్‌టీ అదనం) వరకు అద్దె పథకాలున్నాయి.

ఎస్‌టీబీ ఇస్తాం

జియో ఫైబర్‌ సేవల కింద జియో 4కే సెట్‌ టాప్‌ బాక్స్‌ ఉచితంగా అందజేస్తారు. వైఫై రూటరు, సెట్‌టాప్‌ బాక్స్‌ కలిపే ఉంటాయి. వీటితో సాధారణ టీవీనీ స్మార్ట్‌ టీవీగా మార్చుకోవచ్చు.లైవ్‌ టీవీ ఛానళ్లు, ఉచితంగా అంతర్జాతీయ వీడియో కాన్ఫరెన్స్‌, కన్సోల్‌ క్వాలిటీ గేమింగ్‌, వీఆర్‌ (వర్చువల్‌ రియాలిటీ), ఏఆర్‌ (ఆగ్‌మెంటెడ్‌ రియాలిటీ) సొల్యూషన్లు పొందొచ్చు. హాట్‌స్టార్‌, నెట్‌ఫ్లిక్స్‌, అమెజాన్‌ ప్రైమ్‌, సోటీలైవ్‌, ఎరోస్‌నౌ, హోయ్‌చోయ్‌, ఆల్ట్‌బాలాజీ వంటి ఓటీటీ కంటెంట్‌ ప్రొవైడర్లకు సంబంధించిన ప్రీమియమ్‌ సబ్‌స్క్రిప్షన్లూ జియో ఫైబర్‌లో అందుబాటులో ఉంటాయి. (కేబుల్‌ ఫైబర్‌/డీటీహెచ్‌ ద్వారా ప్రసారమయ్యే టీవీ ఛానళ్లకు మాత్రం చందాదార్లు అదనంగా చెల్లించాల్సిందేనని కంపెనీ సీనియర్‌ అధికారి తెలిపారు.)

ఉచిత వాయిస్‌కాల్స్‌

చందాదార్లందరికీ ల్యాండ్‌లైన్‌ ఫోన్‌ ఉచితంగా ఇస్తాం. భారత్‌లోని ఏ మొబైల్‌/ల్యాండ్‌లైన్‌కైనా జీవితకాలం పాటు ఉచితంగా వాయిస్‌కాల్స్‌  చేసుకోవచ్చు. అత్యంత తక్కువ ధరకు అంతర్జాతీయ అపరిమతి కాలింగ్‌ ప్యాక్‌ను కూడా జియో అందిస్తోంది. ల్యాండ్‌లైన్‌ నుంచి అమెరికా, కెనడాలకు రూ.500 నెలవారీ సబ్‌స్క్రిప్షన్‌తో పొందొచ్చు. ప్రస్తుత మార్కెట్‌ టారిఫ్‌లను చూస్తే ఇవి 5-10వ వంతు మాత్రమే.

ఇంట్లోనే కొత్త సినిమా

భారత్‌లోనే తొలిసారిగా కొత్త సినిమాలను విడుదల రోజే, నేరుగా ఇంట్లో చూసే ఆలోచనతో ముందుకొచ్చాం. ప్రీమియం జియో ఫైబర్‌ వినియోగదార్లు తమ ఇంట్లోనే తిలకించవచ్చు. అయితే ఈ ‘జియో ఫస్ట్‌ డే ఫస్ట్‌ షో’ సేవలను 2020 మధ్యలో తీసుకురానున్నాం.

వేగంలో సాటి లేదు

ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత అభివృద్ధి చెందిన దేశమైన అమెరికాలో సగటు ఫిక్స్‌డ్‌ లైన్‌ డౌన్‌లోడ్‌ వేగం 90 ఎమ్‌బీపీఎస్‌గా ఉంది. భారత్‌లో జియో ఫైబర్‌ పథకాల్లో ప్రారంభ పథకంలోనే 100 ఎమ్‌బీపీఎస్‌ వేగాన్ని అందిస్తున్నాం. అంతర్జాతీయ రేట్లతో పోలిస్తే పదో వంతు ధరలకే వీటిని ప్రకటిస్తున్నాం. ఈ పథకాలకు అనుబంధంగా ప్రీమియమ్‌ ఓవర్‌ ద టాప్‌(ఓటీటీ) అప్లికేషన్లనూ సబ్‌స్క్రైబ్‌ చేసుకోవచ్చు. తొలి ఏడాదిలోనే దాదాపు 1600 పట్టణాలలో 2 కోట్ల గృహాలు,  1.5 కోట్ల వ్యాపార సంస్థలకు మేం సేవలందించాలని నిర్ణయించాం.

ఇంటా.. బయటా

జియో పోస్ట్‌పెయిడ్‌ ప్లస్‌తో ప్రయారిటీ సిమ్‌-సెటప్‌ సేవలను అందిస్తారు. ఇంటా.. బయటా అన్ని డివైజ్‌లకు డేటా, వాయిస్‌ అనుసంధాన సేవలు ఉంటాయి. వీటిలో కుటుంబపథకాలు, అంతర్జాతీయరోమింగ్‌ పథకాలుంటాయి.

టీవీ ఉచితం

జియో ఫైబర్‌, జియో సెట్‌టాప్‌ బాక్స్‌ల సేవల్లో అత్యుత్తమ నాణ్యత, అనుభవం కావాలంటే అది.. ఎల్‌ఈడీ టీవీ ఉంటేనే సాధ్యం. అందుకే వార్షిక పథకాలను(జియో ఫరెవర్‌ ప్లాన్స్‌) ఎంచుకునే వినియోగదార్లకు హెచ్‌డీ లేదా 4కే ఎల్‌ఈడీ టీవీ, 4కే సెట్‌ టాప్‌ బాక్స్‌లను ఉచితంగా ఇస్తాం.

రూ.3.5 లక్షల కోట్ల పెట్టుబడులు

రిలయన్స్‌ జియో పెట్టుబడులు పూర్తయ్యాయి. డిజిటల్‌ నెట్‌వర్క్‌ కోసం రూ.3.5 లక్షల కోట్లను పెట్టుబడులుగా పెట్టాం. అందుకే మూడేళ్లలోపే 34 కోట్ల మంది మొబైల్‌ వినియోగదార్లను సాధించాం. ఇక ఇపుడు ఇంటర్నెట్‌ ఆప్‌ థింగ్స్‌(ఐఓటీ), గృహ, కంపెనీలకు బ్రాడ్‌బ్యాండ్‌ సేవలు, ఎస్‌ఎమ్‌ఈలకు బ్రాడ్‌బ్యాండ్‌ వంటి కొత్త వృద్ధి బాటలను పట్టాం. ఈ ప్రతీ విభాగం నుంచీ ఈ ఆర్థిక సంవత్సరంలోనే ఆదాయాలు రావడం ప్రారంభమవుతుంది. జియోకు 50 కోట్ల మంది వినియోగదార్లను సాధించగలమన్న విశ్వాసం ఉంది. జియో ఐఓటీ ప్లాట్‌ఫాంను జనవరి 1, 2020న ప్రారంభిస్తాం.

జియో, రిలయన్స్‌ రిటైల్‌ నమోదు

జియో ఐఓటీ ప్లాట్‌ఫాంపై కనీసం 100 కోట్ల పరికరాలను అనుసంధానించాలన్నదే జియో లక్ష్యం. అంటే ఏటా రూ.20,000 కోట్ల ఆదాయ అవకాశం జియోకు ఉందన్నమాట. జియో, రిలయన్స్‌ రిటైల్‌ వ్యాపారాల కోసం వ్యూహాత్మక, ఆర్థిక పెట్టుబడుదార్ల నుంచి బలమైన ఆసక్తి కనిపిస్తోంది. వచ్చే కొద్ది త్రైమాసికాల్లో అంతర్జాతీయ దిగ్గజ సంస్థలను భాగస్వాములుగా తీసుకుంటాం. వచ్చే అయిదేళ్లలో ఈ రెండు కంపెనీలను స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో నమోదు చేస్తాం.

 

అంకురాలకు ఉచిత క్లౌడ్‌ సేవలు

దేశవ్యాప్తంగా త్వరలో డేటా కేంద్రాలు

మైక్రోసాఫ్ట్‌తో దీర్ఘకాల ఒప్పందం

దేశవ్యాప్తంగా భారీ స్థాయి డేటా కేంద్రాలను జియో ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం మైక్రోసాఫ్ట్‌తో దీర్ఘకాలిక ఒప్పందం కుదుర్చుకున్నట్లు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ప్రకటించింది. ఈ కేంద్రాల్లో మైక్రోసాఫ్ట్‌ తన ‘అజూర్‌’ క్లౌడ్‌ ప్లాట్‌ఫాంను తీసుకొస్తుంది. గుజరాత్‌, మహారాష్ట్రలో తొలి రెండు డేటా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. 2020 నుంచి పూర్తి స్థాయిలో కార్యకలాపాలు ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

ఎందుకీ డేటా కేంద్రాలు..
‘అంకురాల వ్యయాల్లో 80 శాతం క్లౌడ్‌, అనుసంధాన మౌలిక వసతులపైనే వెచ్చించాల్సి వస్తోంది. జియో ఈ వ్యయాలను భరిస్తుంది. అంటే అంకురాలకు ఉచితంగా క్లౌడ్‌ సేవలను అందించడానికి జియో సిద్ధంగా ఉంద’ని ముకేశ్‌ అంబానీ ప్రకటించారు. అంకురాలు తమకు కావలసిన ప్యాకేజీని జనవరి 1, 2020 నుంచి జియో.కామ్‌లో ఎంచుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. ‘భారత అవసరాలైన వ్యవసాయం, ఆరోగ్యసంరక్షణ, విద్య, నైపుణ్యాభివృద్ధి వంటి వాటికి పరిష్కారం చూపే అంకురాల్లో జియో పెట్టుబడులు పెడుతుంది. ఆర్థికంగా మద్దతు అందిస్తామ’ని ఆయన తెలిపారు.

ఎస్‌ఎమ్‌ఈల కోసం..
‘భారత ఆర్థిక వ్యవస్థకు సూక్ష్మ, చిన్న, మధ్య స్థాయి కంపెనీలు కీలకం. ఈ కంపెనీలకు అనుసంధాన, ఉత్పాదకత, ఆటోమేషన్‌ టూల్స్‌ వ్యయాలు ఎంత లేదన్నా రూ.15,000-20,000 వరకు అవుతున్నాయి.వీరికి ఈ అనుసంధాన సేవలను నెలకు రూ.1500 ప్రారంభ ధరతో అందజేయనున్నాం.అపరిమిత ఎంటర్‌ప్రైజ్‌-గ్రేడ్‌ వాయిస్‌, డేటా సేవలు, వీడియో కాన్ఫరెన్స్‌, సెక్యూరిటీ సొల్యూషన్స్‌, మార్కెటింగ్‌, విక్రయాలు, తదితర ఉత్పాదక టూల్స్‌ను మా నుంచి పొందొచ్చ’ని వివరించారు. ‘భారత్‌ కంపెనీలు వృద్ధి చెందడానికి మా సాంకేతికతను అందచేస్తామ’ని మైక్రోసాఫ్ట్‌ సీఈఓ సత్య నాదెళ్ల ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

-ముంబయి
 

 

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.