Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 176528
            [news_title_telugu_html] => 

భారతావనికి గర్వకారణం

[news_title_telugu] => భారతావనికి గర్వకారణం [news_title_english] => [news_short_description] => భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రతిష్ఠాత్మక ప్రయోగం చంద్రయాన్‌-2 కీలక దశను విజయవంతంగా చేరుకుంది. జాబిల్లిపైకి ప్రయాణంలో భాగంగా చంద్రుడి కక్ష్యలోకి ‘మంగళ’కరంగా అడుగుపెట్టింది [news_tags_keywords] => [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 1 [news_videolink] => |https://www.youtube.com/embed/b58hfPFzqcA [news_videoinfo] => |https://www.youtube.com/embed/b58hfPFzqcA [news_sections] => ,27,26, ) )
భారతావనికి గర్వకారణం - EENADU
close
భారతావనికి గర్వకారణం

చంద్రయాన్‌ నెలరాజును తొంగి చూసింది
విజయవంతంగా చంద్రుని కక్ష్యలోకి
సెప్టెంబరు 7న జాబిల్లిపై అడుగు
ప్రతి దశ కీలకమే: ఇస్రో

శ్రీహరికోట-న్యూస్‌టుడే: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రతిష్ఠాత్మక ప్రయోగం చంద్రయాన్‌-2 కీలక దశను విజయవంతంగా చేరుకుంది. జాబిల్లిపైకి ప్రయాణంలో భాగంగా చంద్రుడి కక్ష్యలోకి ‘మంగళ’కరంగా అడుగుపెట్టింది. ప్రయోగంలో ఇదో మైలురాయిగా ఇస్రో అభివర్ణించింది. ఇక చంద్రునిపై అడుగు పెట్టేంత వరకు ప్రతీ దశ కీలకమని పేర్కొంది. జులై 22న శ్రీహరికోట షార్‌ నుంచి ప్రస్థానాన్ని ప్రారంభించి, 29 రోజులు భూ స్థిర కక్ష్యలో చక్కర్లు కొట్టి మంగళవారం చంద్రుడి కక్ష్యలో అడుగుపెట్టింది. ఉదయం 9.02 గంటలకు ఉపగ్రహంలోని ద్రవ ఇంజిన్‌ను 1738 సెకన్లపాటు మండించి అంతరిక్ష నౌకను 114×18072 కిలోమీటర్ల చంద్రుని కక్ష్యలోకి ప్రవేశపెట్టారు.

బుధవారం మరో నాలుగు కీలక విన్యాసాలు జరగనున్నాయని, సెప్టెంబరు 7న చంద్రుని ఉపరితలంపై చంద్రయాన్‌-2 అనుబంధ ల్యాండర్‌- విక్రం అడుగుపెట్టనున్నదని తెలిపింది. చంద్రయాన్‌-1 ఈ దశను చేరుకోకపోవటం ప్రస్తావనార్హం. ఆ పాఠాల నుంచే ఈసారి మరిన్ని జాగ్రత్తలతో లక్ష్యాన్ని చేరుకోగలమన్న విశ్వాసాన్ని ఇస్రో వ్యక్తం చేసింది.

కక్ష్య వైపు మళ్లిన తీరు
ప్రయోగించిన నాటి నుంచి 54వ రోజున చంద్రుడి ఉపరితలంపై చంద్రయాన్‌-2ను అడుగుపెట్టాలి. అవసరానికి తగ్గట్లుగా కక్ష్య దూరాల్ని పెంచుతూ సెప్టెంబరు 7న లక్ష్యాన్ని చేరుకునేలా ఇస్రో ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. కక్ష్య దూరాలతో పాటు ఆర్బిటర్‌ చక్కర్లు కొట్టే కాలాన్ని తగ్గిస్తూ మంగళవారానికి కీలక దశకు చేరుకునేలా చేశారు. ఈ క్రమంలో సోమవారం మధ్యాహ్నం మూడు గంటలకు అపోజీ (భూమికి అతి దగ్గరగా 170 కి.మీ.) నుంచి వ్యతిరేక దిశగా చంద్రుని కక్ష్య వైపు మళ్లిన చంద్రయాన్‌-2 చంద్రుని గురుత్వాకర్షణకు లోనవుతూ వచ్చింది. ఇదే క్రమంలో గమన వేగాన్ని 2.4 కిలోమీటర్ల నుంచి 2.1 కిలోమీటర్లకు తగ్గించిన ఇస్రో యంత్రాంగం చంద్రుడి కక్ష్యలోకి అది విజయవంతంగా అడుగుపెట్టేలా చేసింది.

గుండె ఆగిపోయినంత పనయింది: శివన్‌
చంద్రయాన్‌-2 చంద్రుడి కక్ష్యలో చేరిందన్న ఆనందం కంటే ఆందోళనే అధికమని ఇస్రో అధ్యక్షుడు కె.శివన్‌ చెప్పారు. బెంగళూరులోని ఇస్రో ప్రధాన కార్యాలయంలో ఆయన చంద్రయాన్‌-2 పనితీరు, రానున్న రోజుల్లో తీసుకోనున్న సాంకేతికపరమైన జాగ్రత్తలపై విలేకరులకు వివరించారు. లక్ష్యం దిశగా ఇకపై చంద్రయాన్‌-2 వేసే ప్రతి అడుగు సవాళ్లతో కూడుకున్నదని చెప్పారు. చంద్రుడి కక్ష్యలోనికి చేరే ఆ 30 నిమిషాల పాటు గుండె ఆగిపోయినంత భావన కలిగిందని వ్యాఖ్యానించారు. ఇకపై ఇలాంటి ఉత్కంఠ తగ్గకపోగా మరింతగా పెరుగుతుందని చెప్పారు. కక్ష్యల కుదింపు, గమన వేగాల్లో ఏమాత్రం కచ్చితత్వం పాటించకపోయినా చంద్రయాన్‌-2 పూర్తిగా విఫలమయ్యే ప్రమాదముందని తెలిపారు. చంద్రుని గురుత్వాకర్షణ శక్తితో వ్యోమనౌక కక్ష్య నుంచి వేరుపడే అవకాశాలున్నాయన్నారు. ఆగస్టు 21, 28, 30, సెప్టెంబరు 1 తేదీల్లో మూడు రకాల విన్యాసాలు చేపడతామన్నారు. ఇందులో భాగంగానే చంద్రుని కక్ష్య దూరాన్ని 18000 కిలోమీటర్ల నుంచి 100 ్ల  100కు తగ్గిస్తామన్నారు. సెప్టెంబరు ఒకటో తేదీ నాటికి విన్యాసాల్లో సాధారణ దశ ముగుస్తుందని వివరించారు.

సెప్టెంబరు 2న క్షణక్షణం ఉత్కంఠే
‘ఇంతవరకు చంద్రయాన్‌-2 కోసం మేము చేపట్టిన విన్యాసాలన్నీ గతంలో చేసినవే. సెప్టెంబరు 2న అసలైన పరీక్ష ఎదురు కానుంది. అదే రోజున ఆర్బిటర్‌ నుంచి ల్యాండర్‌ విక్రమ్‌ విడిపోతుంది. అప్పటి నుంచి ఇస్రో సాంకేతిక వ్యవస్థలన్నీ ల్యాండర్‌ వైపు దృష్టి సారిస్తాయి’ అని శివన్‌ వివరించారు. 3న రెండు విన్యాసాలను చేపట్టి, ఆపై చంద్రుడిపై అడుగుపెట్టే కీలక దశకు చేరుకుంటామన్నారు. తర్వాతి మూడు రోజులపాటు ఎటువంటి ఆపరేషన్లు చేపట్టకుండా 7న ల్యాండర్‌ చంద్రుడిపై అడుగు పెట్టేందుకు ఏవైనా సాంకేతిక అవాంతరాలున్నాయా? అనే అంశాన్ని సరిచూసుకుంటామని చెప్పారు. చంద్రయాన్‌-1 సరిగ్గా ఈ దశలోనే విఫలమైనట్లు గుర్తుచేశారు. ఈసారి అత్యుత్తమ వ్యవస్థలను వినియోగించినట్లు తెలిపారు. ‘మూడురోజుల పాటు కీలకమైన వ్యవస్థలను సరిచూసుకున్న తర్వాత 7న ల్యాండర్‌ పవర్‌ మిషన్లు పని చేయటం ప్రారంభిస్తాయి. ఆపై చంద్రుడి ఉపరితలంపై అడుగుపెట్టేందుకు సిద్ధమయ్యే ల్యాండర్‌ సరిగ్గా అర్థరాత్రి 1.55 గంటలకు చంద్రుడి దక్షిణ ధ్రువంలో మునుపెన్నడూ దిగని చోట పాదం మోపుతుంది. ఆపై రెండు గంటల తర్వాత ల్యాండర్‌ ర్యాబ్‌లు చంద్రుడి ఉపరితలంపై అడుగులు వేస్తాయి. మరో మూడు గంటల పది నిమిషాల తర్వాత రోవర్‌పైనున్న సోలార్‌ ప్యానల్స్‌ విడిపోతాయి. ఆపై.. 3.50 గంటల తర్వాత రోవర్‌, మరో నాలుగు గంటల తర్వాత ల్యాండర్‌లు చంద్రుడి బిలంలో అసలైన పరీక్షలకు సిద్ధమవుతాయి’ అని వివరించారు.ఈ ప్రాజెక్టులో మానవ ప్రయత్నమంతా చేశామని శివన్‌ చెప్పారు. ఇప్పటివరకు ఏ దేశం సాధించని రీతిలో చంద్రుని దక్షిణ ధ్రువంపై చంద్రయాన్‌-2 అడుగుపెడుతోందన్నారు. చివరి 15 నిమిషాల కీలక దశలో అడ్డంకి రాకుండా చంద్రునిపై అడుగుపెట్టేలా జాగ్రత్తలు తీసుకుంటామని వెల్లడించారు. ఈ అరుదైన క్షణాన్ని వీక్షించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఆహ్వానించామని శివన్‌ చెప్పారు.


ప్రధాని హర్షం

దిల్లీ: చంద్రయాన్‌-2 ప్రస్థానంలో కీలకమైన మరో దశ విజయవంతం కావడంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ హర్షం వ్యక్తం చేశారు. చరిత్రాత్మక పయనంలో ఇదో ముఖ్యమైన అడుగుగా పేర్కొన్నారు. శాస్త్రవేత్తల బృందాన్ని అభినందించారు.

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.