close
నేను ఏ తప్పూ చేయలేదు

 కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం

ఈనాడు, దిల్లీ: ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో తానుకానీ, తన కుటుంబ సభ్యులుకానీ ఎలాంటి తప్పూ చేయలేదని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పి.చిదంబరం స్పష్టంచేశారు. ముందస్తు బెయిల్‌కోసం ఆయన దాఖలుచేసిన కేసుపై అత్యవసర విచారణకు సుప్రీంకోర్టు నిరాకరించిన నేపథ్యంలో ఆయన బుధవారం రాత్రి ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో సహచరులైన న్యాయవాదులు కపిల్‌సిబల్‌, అభిషేక్‌సింఘ్వీ, మల్లికార్జున ఖర్గేలతో కలిసి విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. తాను చట్టాన్ని గౌరవిస్తున్నానని, దర్యాప్తు సంస్థలు కూడా చట్టంపై గౌరవం ఉంచి శుక్రవారం సుప్రీంకోర్టు ఉత్తర్వులు వెలువడేవరకు వేచి చూడాలన్నారు. ఆయన ముందస్తుగా తయారు చేసుకొచ్చిన ప్రకటనను చదివి వినిపించారు. విలేకరుల ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి నిరాకరించారు. ‘‘స్వేచ్ఛే మన రాజ్యాంగ పునాది అని నమ్ముతాను. నీకు జీవితం కావాలా? స్వేచ్ఛ కావాలా? అంటే నేను స్వేచ్ఛనే ఎంచుకుంటాను. గత 24 గంటల్లో జరిగినది అనేక మందికి ఆందోళన, అయోమయాన్ని కలిగించింది. ఈ పరిస్థితికి తెరదించడానికే  ఈరోజు మీడియా ముందుకు వచ్చాను’’ అని చిదంబరం తెలిపారు.

మేం నిందితులం కాదు
‘‘ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసు విషయానికొస్తే... అందులో  నేనుకానీ, నా కుటుంబసభ్యులు కానీ నిందితులంకాదు. సీబీఐ, ఈడీలు ఏ కోర్టులోనూ ఛార్జిషీటు కూడా దాఖలుచేయలేదు. పైగా సీబీఐ దాఖలుచేసిన ఎఫ్‌ఐఆర్‌లో కూడా నేను తప్పుచేసినట్లు ఎక్కడా చెప్పలేదు. అయినా ఇందులో నేను, నా కుమారుడు ఘోరమైన నేరాలకు పాల్పడినట్లు విస్తృతమైన అభిప్రాయం నెలకొంది. ఇది నిరాధార ప్రచారం తప్పితే ఇందులో నిజంలేదు. సీబీఐ, ఈడీ నన్ను ప్రశ్నించడానికి పిలిచినప్పుడు అరెస్టు కాకుండా కోర్టు నుంచి రక్షణ కోరడం సహజం. నాకు అరెస్ట్‌ నుంచి రక్షణ కల్పిస్తూ హైకోర్టు 2018 మే 31, జులై 25 తేదీల్లో ఉత్తర్వులు జారీచేసింది. గత 13-15 నెలలుగా నాకు ఆ రక్షణ ఉంది. ఈ అంశంపై 2019 జులై 25వ తేదీన చివరిసారి విచారించి హైకోర్టు తీర్పు రిజర్వుచేసింది. ఏడునెలల తర్వాత మంగళవారం హైకోర్టు నా ముందస్తు బెయిల్‌ పిటీషన్‌ను రద్దుచేసింది. అందువల్ల సుప్రీంకోర్టును ఆశ్రయించమని న్యాయవాదులు సూచించారు. నా తరఫున ఈ రెండు రోజుల్లో అంతా వారే చూసుకున్నారు. నా అపీళ్లను అత్యవసరంగా విచారించి,  మధ్యంతర రక్షణను పొడిగించాలని న్యాయవాదులు సుప్రీంకోర్టుకు పదేపదే విన్నవించారు. మేము రాత్రంతా కష్టపడి కేసు తయారుచేశాం. బుధవారం ఉదయానికి మా పని పూర్తయింది. సుప్రీంకోర్టులో కేసు దాఖలుచేశాం. నేను ఈ పనిలో రాత్రంతా న్యాయవాదుల వెంటే ఉన్నాను. నేను తప్పించుకుపోయానని ప్రచారం చేయడం ఆశ్చర్యం కలిగించింది. ఈరోజు సుప్రీంకోర్టును ఎంత వేడుకున్నా నా కేసును అత్యవసర విచారణకు స్వీకరించలేదని, శుక్రవారం తీసుకుంటారని లాయర్లు చెప్పారు. నేను సుప్రీంకోర్టు ఉత్తర్వులను శిరసావహిస్తున్నాను. ఈరోజు నుంచి శుక్రవారం వరకు తలెత్తుకు తిరుగుతా. ప్రస్తుత పరిస్థితుల్లో చట్టాన్ని గౌరవించడం అంటే శుక్రవారం సుప్రీంకోర్టు వెలువరించే ఉత్తర్వులకోసం వేచిచూడటమే’’ అని చిదంబరం పేర్కొన్నారు.

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.