close
మాటల యుద్ధంలో మహాయోధుడు

సందర్భం ఏదైనా.. ఘట్టం ఏదైనా.. స్వపక్షంపై ఈగ వాలకుండా కాపాడుకోవడంలో కాకలుతీరిన యోధుడు. పత్రికా సమావేశాలైనా, పార్లమెంటు సమావేశాలైనా.. కీలక ప్రకటన చేసినా.. ఎవరికీ చిక్కకుండా, ఎక్కడా దొరక్కుండా.. అత్యంత రాజనీతిజ్ఞతతో తను చెప్పాల్సింది కుండబద్దలు కొట్టినట్లు చెప్పడం ఆయన నైజం. లాహోర్‌ నుంచి దిల్లీకి వలస వచ్చిన జైట్లీ కుటుంబం దేశానికి ఓ అద్భుత నేతను అందించింది.

 

అరుణ్‌జైట్లీ.. అత్యయిక
పరిస్థితి వేళ భరతమాత వేదనల
నుంచి ఉద్భవించిన ధ్రువతార.
ఈ దేశానికి ఎమర్జెన్సీ ద్వారా
పరిచయమైన విద్యార్థి నేత.
దేశంలోని అత్యున్నత న్యాయవాదుల్లో జైట్లీది
ముందువరస. తన వాగ్ధాటితో ఎదుటి పక్షానికి
మాట పెగలకుండా చేయడం ఆయన ప్రత్యేకత.

విపక్షంలో ఉంటే.. అధికార పక్షాన్ని
తన వాదనా పటిమతో ఇరుకునపెట్టి,
శరపరంపరగా విమర్శలతో
తలంటుపోసే నేర్పరి. అధికార పక్షంలో
ఉంటే.. విపక్షాల విమర్శల బాణాల్ని
తిప్పికొడుతూ.. ప్రత్యర్థుల్ని
గుక్కతిప్పుకోనివ్వని మాటల మాంత్రికుడు.

ఒకేసారి ఆర్థిక, రక్షణ మంత్రిగా..
1999 అక్టోబర్‌ 13న వాజ్‌పేయీ సర్కారులో సమాచార, ప్రసారశాఖ సహాయమంత్రి (స్వతంత్ర హోదా)గా పనిచేశారు. తొలిసారిగా ఏర్పాటు చేసిన పెట్టుబడుల ఉపసంహరణ శాఖకు స్వతంత్ర హోదాలో సహాయ మంత్రిగానూ బాధ్యతలు చేపట్టారు. 2000 జులైలో న్యాయ, కంపెనీ వ్యవహారాల శాఖ మంత్రిగా అదనపు బాధ్యతలు నిర్వర్తించారు. 2000 నవంబర్‌లో కేబినెట్‌ మంత్రిగా పదోన్నతి లభించింది. నౌకాయానశాఖను అదనపు బాధ్యతలు చేపట్టిన జైట్లీ.. ఓడరేవుల ఆధునికీకరణపై ప్రత్యేక దృష్టిసారించారు. 2014 నుంచి 2019 వరకు ఆర్థిక, కార్పొరేట్‌ వ్యవహారాల మంత్రిగా పనిచేశారు. మోదీ తొలి ప్రభుత్వంలో 2014-16 వరకు కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రిగా, 2014, 2017లలో రక్షణ మంత్రిగా పని చేశారు. స్వతంత్ర భారత చరిత్రలో ఒకేసారి రక్షణ, ఆర్థిక మంత్రిత్వ శాఖల్ని చేపట్టడం జైట్లీకే సాధ్యమైంది. కేంద్ర ఆర్థిక మంత్రిగా ఆదాయ వెల్లడి పథకాన్ని ప్రకటించారు. పెద్దనోట్ల రద్దు నిర్ణయమూ ఆయన హయాంలో వెలువడిందే. జీఎస్‌టీ అమలును ప్రారంభించారు.

 

విద్యాభ్యాసం
1952 డిసెంబర్‌ 28న మహరాజా కిషన్‌జైట్లీ, రత్నప్రభ దంపతులకు జన్మించారు. తండ్రి న్యాయవాది. జైట్లీ బాల్యమంతా దిల్లీ నారాయణవిహార్‌లో గడిచింది. తల్లి సామాజిక సేవకురాలు. జైట్లీకి ఇద్దరు అక్కలు. దిల్లీ సెయింట్‌ జేవియర్‌ పాఠశాలలో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తయింది. శ్రీరామచంద్ర కాలేజ్‌ ఆఫ్‌ కామర్స్‌లో వాణిజ్యశాస్త్రంలో పట్టా పుచ్చుకున్నారు. దిల్లీ యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో డిగ్రీ చేశారు. కెరీర్‌కు బీజం పడిందక్కడే. కళాశాలలోనే విభిన్న భాషల్లో చర్చల్లో పాల్గొనేవారు. జమ్మూ-కశ్మీర్‌ మాజీ ఆర్థికమంత్రి గిరిధారిలాల్‌ డోగ్రా కుమార్తె సంగీతాడోగ్రాను 1982, మే 24న పెళ్లాడారు. ఈ దంపతులకు కుమారుడు రోహన్‌, కుమార్తె సోనాలి ఉన్నారు. వీరిద్దరూ న్యాయవాదులే.

విద్యార్థి నేత..
దిల్లీ యూనివర్సిటీలో ఉన్నప్పుడే అఖిల భారతీయ విద్యారి పరిషత్‌(ఏబీవీపీ) నేతగా వర్సిటీ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించారు. విశ్వవిద్యాలయ ప్రాంగణాల్లో కాంగ్రెస్‌కు గట్టి పట్టున్న రోజుల్లో 1974లో వర్సిటీ విద్యార్థి సంఘం ఎన్నికల్లో అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఏబీవీపీ అభ్యర్థిగా ఆయన సాధించిన గెలుపు.. ఆనాడు దేశ విద్యార్థి రాజకీయాలపై గణనీయ ముద్ర వేసింది.

అత్యయిక పరిస్థితిలో..

1973లో రాజ్‌నారాయణ్‌, జయప్రకాష్‌ నారాయణ్‌లు ప్రారంభించిన అవినీతి వ్యతిరేక ఉద్యమంలో ప్రముఖ నేతగా పేరొందారు. విద్యార్థి, యువత సంస్థకు జాతీయ కమిటీ కన్వీనర్‌గా జైట్లీని జయప్రకాష్‌ నియమించారు. 1975-77 నాటి అత్యయిక పరిస్థితిని వ్యతిరేకిస్తూ జైట్లీ యువనేతగా గళమెత్తారు. 1975 జూన్‌ 26న అరెస్టు చేసేందుకు యత్నించగా తప్పించుకున్నారు. ఆందోళన కార్యక్రమాల్లో భాగంగా అరెస్టయ్యారు. ముందుజాగ్రత్తగా జైట్లీని అంబాలా జైలులో నిర్బంధించారు. తర్వాత దిల్లీ తిహార్‌ జైలులో 19 నెలలు పాటు ఉంచారు. ఆ సమయంలో వేర్వేరు నేపథ్యాల నుంచి వచ్చిన నేతలతో పరిచయాల్ని, పరిజ్ఞానాన్ని పెంచుకున్నారు. జైలు నుంచి బయటికొచ్చాక జనసంఘ్‌లో చేరారు. 1977లో జరిగిన సార్వత్రిక ఎన్నికల సందర్భంగా జనతా పార్టీ ప్రచారం కోసం ఏర్పాటు చేసిన లోక్‌తాంత్రిక్‌ యువమోర్చాకు కన్వీనర్‌గా ఉన్న జైట్లీ దేశవ్యాప్తంగా ప్రచారం నిర్వహించారు. తర్వాత ఏబీవీపీ దిల్లీ శాఖ అధ్యక్షుడిగా, జాతీయ కార్యదర్శిగా నియామకమయ్యారు.

భాజపా రాజకీయాల్లో..
1980ల్లో భాజపాలో చేరారు. యువమోర్చా జాతీయ అధ్యక్షుడయ్యారు. భాజపా దిల్లీ శాఖ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. 1991లో భాజపా జాతీయ కార్యనిర్వాహక మండలి సభ్యుడయ్యారు. 1999 నుంచి భాజపా అధికార ప్రతినిధిగా పనిచేశారు. 2002లో భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియామకమయ్యారు. 2003లో కేంద్రమంత్రిగా బాధ్యతలు చేపట్టి, 2004లో భాజపా ఓటమితో తిరిగి పార్టీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు  చేపట్టారు.దిల్లీ క్రికెట్‌ సంఘానికి అధ్యక్షుడిగా సేవలందించిన జైట్లీ, 2009లో బీసీసీఐ ఉపాధ్యక్షుడయ్యారు. పలుమార్లు రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించిన జైట్లీ.. 2014లో అమృత్‌సర్‌ లోక్‌సభ స్థానంలో ఓటమి చవిచూశారు.

నేతగా ఎదిగిన న్యాయ దిగ్గజం

దేశంలోని దిగ్గజ న్యాయవాదుల్లో ఒకరిగా పేరొందిన అరుణ్‌జైట్లీ.. న్యాయస్థానం నుంచి వృత్తి జీవితాన్ని మొదలుపెట్టి రాజకీయ నేతగా చట్టసభకు ప్రస్థానం సాగించారు. 1990లో 37 ఏళ్ల వయసులోనే దిల్లీ హైకోర్టులో సీనియర్‌ అడ్వొకేట్‌ హోదా లభించింది. అంతకు ఏడాది ముందు అదనపు సొలిసిటర్‌ జనరల్‌(ఏఎస్‌జీ)గా నియమితులయ్యారు. ఏఎస్‌జీగా అప్పట్లో దేశంలో సంచలనం సృష్టించిన బోఫోర్స్‌ కేసును చేపట్టారు. దేశంలో చరిత్రాత్మక తీర్పులు వెలువడిన ఎన్నో ముఖ్యమైన కేసుల్ని వాదించారు. ఆయన క్లయింట్లలో శరద్‌యాదవ్‌, మాధవరావు సింధియా, ఎల్‌కే ఆడ్వాణీ, బిర్లా కుటుంబం తదితరులే కాకుండా బహళజాతి కార్పొరేట్‌ సంస్థలు ఉన్నాయి. న్యాయ తదితర అంశాలపై పుస్తకాలు వెలువరించారు. రాజ్యసభలో విపక్షనేతగా బాధ్యతలు చేపట్టిన తర్వాత న్యాయవాద వృత్తికి దూరమయ్యారు. ఆసియా అభివృద్ధి బ్యాంకు గవర్నర్ల బోర్డులో సభ్యుడిగానూ వ్యవహరించారు.

గుజరాత్‌ అల్లర్ల కేసులో మోదీకి, వివాదాస్పద సోహ్రబుద్దీన్‌, ఇస్రాత్‌ జహాన్‌ ఎన్‌కౌంటర్ల కేసుల్లో అమిత్‌షాకు న్యాయసేవలు అందించారు. కేంద్రం చేపట్టే న్యాయ నియామకాల్లో జైట్లీ ముద్ర సుస్పష్టం. న్యాయమంత్రిగా పలు ఎన్నికలు, న్యాయ సంస్కరణలు చేపట్టారు. ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు పథకాన్ని అమలు చేశారు. కోర్టుల కంప్యూటరీకరణపై ప్రత్యేక దృష్టిసారించారు. కేసులు త్వరగా పరిష్కారమయ్యేందుకు వీలుకల్పిస్తూ పలు చట్టాల్లో సవరణలు తీసుకొచ్చారు.

 

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.