Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 179165
            [news_title_telugu_html] => 

కమల గళపతి అరుణ్‌ జైట్లీ కన్నుమూత

[news_title_telugu] => కమల గళపతి అరుణ్‌ జైట్లీ కన్నుమూత [news_title_english] => [news_short_description] => వర్తమాన రాజకీయాల్లో అజాత శత్రువు, భాజపా సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి అరుణ్‌ జైట్లీ కన్నుమూశారు. భాజపాలో, మోదీ ప్రభుత్వంలో సంక్షోభ పరిష్కర్తగా పేరొందిన జైట్లీ.. పెద్దనోట్ల రద్దు, జీఎస్‌టీ అమలు వంటి భారీ నిర్ణయాలను ధైర్యంగా అమలుచేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి. మృదు కణజాల క్యాన్సర్‌తో ఈనెల 9న దిల్లీలోని ఎయిమ్స్‌ ఆసుపత్రిలో చేరిన జైట్లీకి కార్డియోన్యూరో సెంటర్‌లో పలు విభాగాల [news_tags_keywords] => [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 1 [news_videolink] => |https://www.youtube.com/embed/MzBqKJB-gNI [news_videoinfo] => |https://www.youtube.com/embed/MzBqKJB-gNI [news_sections] => ,27,26, ) )
కమల గళపతి అరుణ్‌ జైట్లీ కన్నుమూత - EENADU
close
కమల గళపతి అరుణ్‌ జైట్లీ కన్నుమూత

తీవ్ర అస్వస్థతతో ఎయిమ్స్‌లో తుదిశ్వాస విడిచిన మాజీ మంత్రి
ప్రధాని మోదీ, అమిత్‌షా, వెంకయ్యనాయుడు, కేసీఆర్‌ దిగ్భ్రాంతి
శోకసంద్రంలో జైట్లీ కుటుంబ సభ్యులు, భాజపా శ్రేణులు
సంతాపం తెలిపిన పలు పార్టీల నేతలు
నేడు దిల్లీలో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు
ఈనాడు - దిల్లీ

ర్తమాన రాజకీయాల్లో అజాత శత్రువు, భాజపా సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి అరుణ్‌ జైట్లీ కన్నుమూశారు. భాజపాలో, మోదీ ప్రభుత్వంలో సంక్షోభ పరిష్కర్తగా పేరొందిన జైట్లీ.. పెద్దనోట్ల రద్దు, జీఎస్‌టీ అమలు వంటి భారీ నిర్ణయాలను ధైర్యంగా అమలుచేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి. మృదు కణజాల క్యాన్సర్‌తో ఈనెల 9న దిల్లీలోని ఎయిమ్స్‌ ఆసుపత్రిలో చేరిన జైట్లీకి కార్డియోన్యూరో సెంటర్‌లో పలు విభాగాల వైద్య నిపుణుల పర్యవేక్షణలో చికిత్సనందించారు. ఆయన ఆరోగ్య పరిస్థితులను వైద్యులు నిరంతరం గమనిస్తూ వచ్చారు. వారం రోజులుగా ప్రాణాధార వ్యవస్థపై ఉన్న జైట్లీ ప్రాణాలను కాపాడేందుకు విశ్వ ప్రయత్నం చేశారు. కానీ వారి ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. శనివారం మధ్యాహ్నం 12.07 గంటలకు జైట్లీ తుది శ్వాస విడిచినట్లు ఎయిమ్స్‌ వర్గాలు ప్రకటించాయి. 66 ఏళ్ల జైట్లీ కొంత కాలంగా ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. గత ఏడాది మే 14న ఆయనకు ఎయిమ్స్‌లోనే మూత్రపిండాల మార్పిడి జరిగింది. మధుమేహంతో బాధపడుతున్న జైట్లీ బరువు తగ్గటం కోసం 2014 సెప్టెంబరులో బేరియాట్రిక్‌ సర్జరీ చేయించుకున్నారు. జైట్లీకి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. గొప్ప స్నేహితుడు: జైట్లీ మృతిపట్ల రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, కేంద్రమంత్రులు, వివిధ పార్టీల నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గొప్ప స్నేహితుడు, రాజనీతిజ్ఞుడు, న్యాయకోవిదుడిని దేశం కోల్పోయినట్లయిందని వారు తమ సంతాప సందేశాల్లో పేర్కొన్నారు.

జైట్లీ తుది శ్వాస విడిచే సమయానికి ప్రధాని మోదీ విదేశీ పర్యటనలో, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఏపీ పర్యటనలో, హోం మంత్రి అమిత్‌షా హైదరాబాద్‌ పర్యటనలో, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ పట్నా పర్యటనలో ఉన్నారు. జైట్లీ మరణ వార్త తెలియగానే ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మంత్రులు రాజ్‌నాథ్‌సింగ్‌, అమిత్‌ షాలు తమ అధికారిక పర్యటనలను రద్దుచేసుకొని హుటాహుటిన దిల్లీ చేరుకున్నారు.

భావోద్వేగానికి గురైన మోదీ: తనకు అత్యంత సన్నిహితుడైన జైట్లీ మృతి చెందటంపై ప్రధాని మోదీ తీవ్ర ఆవేదన చెందారు. మిత్రుడు తిరిగిరాని లోకాలకు వెళ్తున్న సమయంలో తాను ఎంతో దూరంలో ఉన్న బహ్రెయిన్‌లో ఉండిపోతానని ఊహించలేకపోయానని విచారం వ్యక్తం చేశారు. బహ్రెయిన్‌ నేషనల్‌ స్టేడియంలో భారత జాతీయులు నిర్వహించిన సమావేశంలో ప్రసంగిస్తూ  ఆయన భావోద్వేగానికి గురయ్యారు. ప్రజలు కృష్ణాష్టమి వేడుకలు జరుపుకుంటున్న వేళ స్నేహితుడు జైట్లీని కోల్పోయిన  విషాదంలో తాను మునిగిపోయానని తెలిపారు. అంతకుముందు ప్రధాని మోదీ ఫోన్‌లో జైట్లీ కుటుంబ సభ్యులతో మాట్లాడారు. జైట్లీ భార్య సంగీత, కుమారుడు రోహన్‌కు ప్రగాఢ సానుభూతి తెలిపారు. విషాదంలో ఉన్నప్పటికీ వారు ప్రధానిని విదేశీ పర్యటన రద్దు చేసుకోవద్దని కోరారు. సన్నిహిత మిత్రుడు జైట్లీ అంత్యక్రియలకు ప్రధాని మోదీ హాజరుకాలేకపోతున్నారు. ప్యారిస్‌లో జరుగనున్న జీ7 దేశాల సదస్సులో మోదీ ముఖ్యఅతిథిగా పాల్గొనాల్సి ఉన్నందున పర్యటన వాయిదా వేసుకోవటం సాధ్యంకావటంలేదని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

వెంటాడిన ఆరోగ్య సమస్యలు: ప్రధాన మంత్రి మోదీ తొలి ప్రభుత్వంలో పూర్తి స్వేచ్ఛతో పనిచేసిన మంత్రిగా పేరొందిన జైట్లీ రాజకీయ ఎదుగుదలతో పాటే ఆరోగ్య తరుగుదల ప్రారంభమైంది. రాజకీయ జీవితంలో ఉన్నత స్థితికి చేరి ఆర్థికమంత్రిగా విస్తృతమైన సేవలు అందించే పనిలో నిమగ్నమైన సమయంలో ఆయన్ను తొలుత కిడ్నీ సమస్య చుట్టుముట్టింది. రెండు మూత్రపిండాలు చెడిపోవడంతో 2018లో వాటిని మార్చారు. దాన్నుంచి బయటపడి సాధారణ స్థితికి చేరుకొనే లోపే తొడ భాగంలో మృదుకణజాల క్యాన్సర్‌ బయటపడింది. అమెరికాకు వెళ్లి చికిత్స చేయించుకున్నప్పటికీ ఫలితం లేకపోయింది. క్యాన్సర్‌ ఆయన్ను కదలలేని స్థితికి తీసుకురావడంతో 2019 ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టలేకపోయారు. మానసికంగా బలంగా ఉన్నప్పటికీ శారీరకంగా ఇంటికే పరిమితం కావాల్సి రావడంతో మోదీ రెండో ప్రభుత్వంలో ఆయన మంత్రిగా బాధ్యతలు చేపట్టలేకపోయారు. పోర్టుపోలియో లేని మంత్రిగా అయినా ఉండమని మోదీ చేసిన సూచనను ఆయన సున్నితంగానే తిరస్కరించి అధికార బాధ్యతలకు దూరంగా ఉండిపోయారు. ప్రస్తుతం యూపీ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

వ్యక్తిగత విమర్శలకు దూరం: కమలం పార్టీలో నిన్నటి తరం జాతీయ నేతల్లో పిన్నవయస్కుడైన అరుణ్‌జైట్లీ రాజకీయంగా ఉన్నత దశకు ఎదుగుతున్న క్రమంలో మృతి చెందటం భాజపా శ్రేణులను తీవ్ర ఆవేదనకు గురిచేసింది. అరుణ్‌జైట్లీ దేశంలోని ప్రముఖ న్యాయవాదుల్లో ఒకరిగా పేరొందారు. భాజపా విధానాలను గట్టిగా సమర్థించినప్పటికీ ఏనాడూ మతం రంగు అంటించుకోని అరుదైన నేత. ప్రత్యర్థులను విధానపరంగానే తప్ప వ్యక్తిగతంగా ఎన్నడూ విమర్శించని గొప్ప పార్లమెంటేరియన్‌. అన్ని పార్టీల నుంచీ మిత్రులను సంపాదించుకున్న స్నేహశీలి.

నిగంబోధ్‌ ఘాట్‌లో అంత్యక్రియలు
అరుణ్‌ జైట్లీ భౌతిక కాయానికి ఆదివారం సాయంత్రం అధికార లాంఛనాలతో దిల్లీలోని యమునా నది ఒడ్డున ఉన్న నిగంబోధ్‌ ఘాట్‌లో అంతిమ సంస్కారాలు జరుపనున్నట్లు భాజపా నాయకుడు సుధాన్షు మిత్తల్‌ ఓ ప్రకటనలో తెలిపారు.

‘‘జైట్లీ మరణంతో ఓ విలువైన మిత్రుడిని కోల్పోయాను. రాజ్యాంగం, చరిత్ర, న్యాయపరమైన అంశాలపై ఆయనకు ఉన్న పరిజ్ఞానం అపారం. తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో వివిధ మంత్రిత్వ శాఖలను నిర్వహించడం ద్వారా దేశ ఆర్థిక ప్రగతికి, రక్షణ సామర్థ్యాల బలోపేతానికి జైట్లీ కృషి చేశారు. వివిధ దేశాలతో వాణిజ్య సంబంధాల అభివృద్ధికి ఎంతో శ్రమించారు. భాజపా సిద్ధాంతాలను, విధానాలను రూపొందించడంలో కీలక పాత్ర పోషించారు. పార్టీలకు అతీతంగా కూడా అందరి అభిమానాన్ని పొందారు’’

- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి


 

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.